బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2016 (18:44 IST)

పవన్ పార్టీకి ఇప్పటికిప్పుడైనా 50 సీట్లు ఖాయం.. 2019 ఎన్నికల గురించి చెప్పాలా?

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ 2019 ఎన్నికల్లో కొత్త శక్తిగా ఎదిగే అవకాశం ఉందని ఇప్పటికే ఓ సర్వే తేల్చేసింది. ప్రస్తుతం ఏపీలో ఉన్న టీడీపీ తన సత్తాను నిరూపించుకోకపోతే.. కొత్త శక్తికి అధికారం తప్పదని ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ 2019 కల్లా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన చేశారు. 
 
రెండు సినిమాలు చేసి పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఇలా రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన మరుసటి రోజు పవన్ కల్యాణ్ విజయవాడలో జనసేన నాయకులతో రహస్యంగా సమావేశం జరిపారని సమాచారం. బలాబలాలపై ఈ సందర్భంగా కసరత్తులు మొదలెట్టేసినట్లు తెలిసింది. 
 
పవన్ కల్యాణ్ రాజకీయాల్లో వస్తామంటే వద్దంటామా అన్నట్లు ఏపీలో పరిస్థితి ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రశ్నించే వ్యక్తే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే మార్పుంటుందని జనం నమ్ముతున్నారు. 2014 ఎన్నికల్లో పవన్ చెప్పబట్టే.. తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడ్డాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే జరగకుంటే చంద్రబాబు గెలుపు సాధ్యం అయ్యే పని కాదు అని అందరికీ తెలిసిందే.
 
ప్రస్తుతం పవన్ రాజకీయాల్లోకి వస్తే ఓట్లు చీలిపోతాయని ప్రచారం సాగుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే మిగిలిన ఓట్లు చీలే అవకాశమున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవితో రాజకీయంగా శత్రుత్వం ఉంటుందని, రాజకీయంగా చిరు ప్రత్యర్థే అని ఇప్పటికే పవన్ ప్రకటించారు. 
 
2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో చేతులు కలుపుతారా లేదా అనేది కూడా డౌటే. కానీ జనసేన పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తే.. కనీసం 50 పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. అలాగే ఇప్పటి నుంచి పవన్ కల్యాణ్ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడేందుకు ప్రయత్నిస్తే మాత్రం 2019 నాటికి బలమైన శక్తిగా అవతరించక తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ కల్యాణ్ ఏం చేస్తారో అనేది వేచి చూడాలి.