శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: సోమవారం, 24 ఏప్రియల్ 2017 (13:59 IST)

'ట్విట్టర్ టైగర్' పవన్ కళ్యాణ్‌ బాటలో తమిళ రైతులు... ఉత్తరాది అహంకారంపైన...?

ఉత్తరాది అహంకారం... మళ్లీ తెరపైకి వచ్చింది. గత 40 రోజులుగా తమిళ రైతులు తమిళనాడులో కరవు సాయం అందించండి మహాప్రభో అని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పలు విధాలుగా, పలు మార్గాల్లో నిరసనలు తెలిపినా కేంద్రం స్పందించలేదు. ఆఖరికి శనివారం నాడు రైతులు మూత్రం తాగే స్థి

ఉత్తరాది అహంకారం... మళ్లీ తెరపైకి వచ్చింది. గత 40 రోజులుగా తమిళ రైతులు తమిళనాడులో కరవు సాయం అందించండి మహాప్రభో అని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పలు విధాలుగా, పలు మార్గాల్లో నిరసనలు తెలిపినా కేంద్రం స్పందించలేదు. ఆఖరికి శనివారం నాడు రైతులు మూత్రం తాగే స్థితికి వెళ్లినా పట్టించుకోలేదు. దీనిపై తమిళ రైతులు మండిపడుతున్నారు. ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు రైతు రుణమాఫీ ప్రకటించిన కేంద్రం దక్షిణాదిపై ఎందుకు వివక్ష చూపుతోందంటూ ప్రశ్నిస్తున్నారు. 
 
తమను ఆదుకోవాలంటూ ఢిల్లీలో గత 40 రోజులుగా తిష్ట వేసి, మండుటెండలను కూడా లెక్కచేయకుండా దీక్ష చేసినప్పటికీ ఫలితం రాలేదు. దీనితో వారు ఢిల్లీలో తమ ఆందోళనలు విరమించారు. మరోవైపు ఉత్తరాదికి దక్షిణాది సమస్యలంటే పట్టవా అని వారు మండిపడుతున్నారు. తాము ప్రాణత్యాగం తప్ప అని రకాలుగా... అంటే గాంధేయ మార్గంలో ఎన్ని చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పట్టించుకోనందుకు నిరసనగా మంగళవారం నాడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. 
 
ఈ బంద్‌కు తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా విపక్ష నేత స్టాలిన్ మాట్లాడుతూ... కేంద్రానికి తమిళనాడు కష్టాలు పట్టడం లేదని మండిపడ్డారు. ఈ ప్రాంత సమస్యలను గాలికొదిలేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో ఇంకా మరికొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటేనే కేంద్రంలో కదలిక వస్తుందా అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో గత ఏడాది నీటి సమస్య ఎదురయితే నీటి రైళ్లను అక్కడికి తరలించారు కదా అని అడిగారు. అలాంటిది తమిళనాడు పట్ల కేంద్రం ఎందుకు ఈ వివక్ష ప్రదర్శిస్తుందని ప్రశ్నించారు.
 
ఇదిలావుంటే 'ట్విట్టర్ టైగర్'గా పిలుచుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉత్తరాది అహంకారం, దక్షిణాది ఆత్మగౌరవం నినాదం చేశారు. తాజాగా మళ్లీ ఇదే విషయమై ఆయన ట్వీట్ చేశారు. ఇండియా అంటే కేవలం ఢిల్లీ మాత్రమే కాదని పాలకులు గుర్తించాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇకనైనా దక్షిణాదిపై చిన్నచూపు చూడటం మానుకుని ఇక్కడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే వేర్పాటువాదం వస్తుందని ఆయన వెల్లడించారు. దక్షిణాదిని చిన్నచూపు చూడటంపై పవన్ చేసిన వ్యాఖ్యలు మాదిరే తమిళనాడు రైతులు కూడా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ మాటల్లో వాస్తవముందని వారు కూడా అంటున్నారు. మరి వీరంతా ఏకమయితే పరిస్థితి ఎలా వుంటుందో వెయిట్ అండ్ సీ.