గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (18:19 IST)

పవన్ కల్యాణ్‌కు ఉన్నది.. జగన్‌కు లేదట.. ఏంటది..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణలో వరంగల్ ఉప ఎన్నికల్లో అనామక పార్టీ కంటే తక్కువ ఓట్లు నమోదు చేసుకున్న జగన్‌కు రాజకీయ చతురత లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వరంగల్ ఉపఎన్నికల్లో బీజేపీని కలుపుకున్న టీడీపీ మూడో స్థానంలోనైనా నిలిచింది. అయితే జగన్ పార్టీ ఐదో స్థానానికి పడిపోయింది. 
 
తెలంగాణలో వరంగల్ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేయకపోవడం.. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వరంగల్ ఉప ఎన్నికలను పెద్దగా పట్టించుకోకపోవడంతో పరాజయం పాలైనా హుందాగా ఉండిపోయారు. అయితే జగన్ మాత్రం వరంగల్ ఎన్నికల సందర్భంగా ఏపీని వరదలొచ్చి ముంచుతున్నా పట్టించుకోకుండా.. ప్రచారంలో పాల్గొనడమే ఆయన గౌరవానికి భంగం కలిగించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బెర్తు ఖాయమని తెలుసుకున్న నేతలంతా ప్రచారానికి ఆమడ దూరంలో ఉంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సాయం చేసే ఉద్దేశంలో ప్రచారం చేసిన జగన్‌ మర్యాద పోగొట్టుకున్నారని వారంటున్నారు. జగన్ చర్య వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి క్రేజ్ తగ్గిపోయిందని వారు చెప్తున్నారు.
 
ఈ విషయంలో పవన్ కల్యాణ్‌కు ఉన్న పొలిటికల్ నాలెడ్జ్ కూడా జగన్‌కు లేదని వారు ఎద్దేవా చేస్తున్నారు. పవన్ పార్టీ పెట్టినా.. బీజేపీ, టీడీపీలకు మద్దతిస్తూ 2019 ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాల్లో వస్తానని ప్రకటించారు. అయితే జగన్ మాత్రం ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై నోరెత్తకుండా.. అవినీతిపై పట్టుబట్టడంతో ప్రజల మధ్య క్రేజ్‌ను కోల్పోయారని.. ఇదే తంతు కొనసాగితే వైకాపా ఏపీలోనూ, తెలంగాణలోనూ గల్లంతు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు.