శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : సోమవారం, 1 డిశెంబరు 2014 (14:28 IST)

2013లో రూ.83.. 2014లో రూ.69 : ఇదీ ప్రస్తుత లీటర్ పెట్రోల్ ధర!

అంతర్జాతీయ ముడి చమురు ఉత్పత్తి మార్కెట్‌లో ఏర్పడిన ఆధిపత్యపోరు కారణంగా స్వదేశంలో పెట్రోల్ ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. దీనికి నిదర్శనగా ఒకటి రెండు నెలల్లో మూడు సార్లు పెట్రోల్ ధరలు తగ్గడమే. ఫలితంగా గత 2013లో రూ.83గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర ఇపుడు రూ.69కి చేరింది. అంటే ఒక్క సంవత్సరం వ్యవధిలో రూ.14 మేరకు తగ్గింది. ఈ ధర ఇంకా తగ్గుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
సాధారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ట్రేడింగ్‌పై ఆధారపడి మారుతుంటాయి. 2008-09 సమయంలో ప్రపంచ దేశాలను ఆర్థిక మాంద్యం చుట్టుముట్టినప్పుడు క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 35 డాలర్ల వరకు దిగజారాయి. ఆ సమయంలో ఇండియాలో పెట్రోల్ ధర లీటరుకు రూ.50 దిగువకు వచ్చింది. ఆ తర్వాత మెల్లగా మాంద్యం ఛాయలు తొలగిపోగా క్రూడాయిల్ ధర సైతం 135 డాలర్ల వరకూ పెరిగింది. ఆ సమయంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.200 వరకూ ఉండాల్సింది. 
 
అయితే దేశంలో ధరల నియంత్రణ ఉండబట్టి ఆ భారం సబ్సిడీ రూపంలో ప్రభుత్వ ఖజానాపై పడింది. ఆ తర్వాత పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణ తొలగిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ మార్కెట్ సరళిని అనుసరించి ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తుంటాయి. 
 
ఇదిలావుండగా, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 8 సార్లు పెట్రోల్ ధరలు తగ్గాయి. వాస్తవానికి ఈ విషయంలో మోడీ గొప్పతనమేమీ లేదు కూడా. అయితే, ముడి చమురు ధరలు పడిపోవడంతో ఒక యేడాది క్రితం రూ.83 వద్ద ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు రూ.69కి చేరింది. 
 
చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల మధ్య కొనసాగుతున్న విభేదాలే క్రూడాయిల్ ధరల పతనానికి కారణం. ఈ విబేధాలు కొనసాగి మరోసారి 35 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర వస్తే... పెట్రోల్ రేటు రూ.32 వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.