గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : బుధవారం, 4 నవంబరు 2015 (19:40 IST)

వాజ్ పేయ్ బెటరా..? మోదీ ఏం చేస్తున్నారు..? దేశంలో ఈ పరిస్థితికి కారణమేమిటి?

దేశంలో మత సహనంపై రోజుకో నేత నోరు విప్పుతున్నారు. బీఫ్ వివాదంతో వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు పార్టీలతో సంబంధాలు లేకుండా వ్యక్తిగతంగా విమర్శలకు పదునుపెడుతున్నారు. నువ్వా నేనా అన్నట్లు ఈ వార్ సాగుతోంది. ఇందుకు హిందూ-ముస్లిం అనే మత వివాదం తెరపైకి వచ్చేట్లు కనబడుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ప్రధాన మంత్రి వాజ్ పేయ్ హయాంలో సంక్షోభ పరిస్థితుల నుంచి బయపడేందుకు ఆయన చాలా విజ్ఞతతో పనిచేసేవారని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫే చెప్పేస్తున్నారు.
 
భారత్-పాకిస్థాన్‌‍ల మధ్య సరైన వాతావరం లేకపోవడం అనేది ఆయా అధికార పార్టీలకు సంబంధించిన అంశం కాదని.. వ్యక్తిగతంగా ఫీలవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందని ముషారఫ్ అంటున్నారు. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకే వాజ్‌పేయ్ సిన్సియర్‌గా పనిచేశారని.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా కొంతమేరకు అదే మార్గంలో నడిచారని ముషారఫ్ అన్నారు. అయితే పాక్‌తో, ముస్లింలతో భారత ప్రధాన మంత్రి మోదీకి ఉన్న సమస్యేంటో అర్థం కావట్లేదన్నారు.
 
బీఫ్ తిన్నవారిని కొట్టి చంపేయడంతో భారత్‌లో హిందూ-ముస్లింల మధ్య మత విభేదాలు రగులుకుంటాయన్న ఆందోళనలను ఇప్పటికే కొందరు వ్యక్తపరుస్తున్నారు. అంతేగాకుండా షారూఖ్ ఖాన్ వంటి సెలబ్రిటీలను కూడా ఈ వివాదం వదిలిపెట్టట్లేదు. ఒకవైపు శివసేన మరోవైపు బీజేపీ నేతలు తమకు ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవడం ద్వారా సమస్య మరింత జటిలమవుతోంది. మరోవైపు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఓ భాజపా నేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తల, మొండెం వేరు చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. ఆయనను అరెస్టు చేశారనుకోండి. ఐతే ఇంత జరుగుతున్నా.. మత అసహనం పెరిగిపోతుందని వస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాత్రం ఖండిస్తున్నారు. అసలు దేశంలో ఎలాంటి సంక్షోభ వాతావరణం లేదంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అయితే ఇలాంటి ప్రతి చిన్న విషయానికి ప్రధాని స్పందించాల్సిన అవసరం లేదంటున్నారు. 
 
దేశంలో కొన్ని అవాంఛిత పరిణామాలు చోటుచేసుకున్నాయని, వాటితో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వెంకయ్య బుధవారం విమర్శలు గుప్పించారు. పలువురు రచయితలు, సాహితీవేత్తలు పురస్కారాలను వెనక్కివ్వడంపై కూడా వెంకయ్యనాయుడు స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో హింస చెలరేగితే మౌనంగా ఉన్నవారు, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 
 
మరోవైపు మతసహనంపై బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేత సాధ్వీ చేసిన కామెంట్స్‌కు పలువురు సెలబ్రిటీలు ఖండించిన నేపథ్యంలో శివసేన కూడా షారూఖ్ ఖాన్‌కు మద్దతు తెలిపింది. బీజేపీ నేతలు, ఎంపీలు వరుసగా షారూఖ్‌పై విమర్శలు చేయడంతో శివసేన లైన్లోకి వచ్చింది. షారూఖ్ ఓ ముస్లిం అయినందున ఆయన్ని టార్గెట్ చేసుకోవడం మంచికాదని హితవు పలికింది. ఇలా నటుడిపై విమర్శలు చేయడం సబబు కాదంది. 
 
అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం దేశంలో జరుగుతున్న పరిణామాలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఏం చేస్తున్నారన్న చర్చ మొదలైంది. అసలీ సమస్యల్ని పరిష్కరించే దిశగా మోదీ ఎలాంటి చర్యలు చేపడుతారన్న దానిపైన చర్చ నడుస్తోంది. ఇదే తంతు కొనసాగితే మాత్రం ఇప్పటికే పడిపోయిన నరేంద్ర మోదీ క్రేజ్ భారీగా డౌన్ కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. మరి మోదీ ఇప్పటికైనా మేల్కుంటారో లేదో వేచి చూడాలి.