శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శనివారం, 23 జనవరి 2016 (10:16 IST)

కేబినెట్‌లో భారీ ప్రక్షాళనపై మోడీ దృష్టి.. జైట్లీకి రక్షణ.. గోయల్‌కు ఆర్థికం!

కేంద్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టిసారించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులోభాగంగా, సీనియర్ మంత్రులపై ఆరోపణలు చేస్తూ.. కీలకమైన సంస్కరణలను ప్రతిపక్షాలు అడ్డుకుంటుండటంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించినట్లు సమాచారం. 
 
ఈ క్రమంలో క్యాబినెట్‌లోని కీలకస్థానాలను యువరక్తానికి అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా పన్నులు, భూ సంస్కరణ బిల్లులకు చట్టరూపం ఇవ్వకపోవడంతో.. క్యాబినెట్‌లో మార్పులు తేవాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎన్డీయే ప్రభుత్వం అత్యంత కీలకంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు 2017లో జరుగనుండటంతో.. ఈ లోపే క్యాబినెట్‌లో మార్పులు చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని తొలగించి, ఆ స్థానంలో పియూష్ గోయల్‌కు విత్తమంత్రి బాధ్యతలను అప్పగించాలన్న గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, మోడీ సందేశాన్ని, ఆలోచనలను స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు వివరించడంలోనూ.. పెట్టుబడులు వచ్చేలా చేయడంలోనూ అరుణ్‌ జైట్లీ కీలకపాత్ర పోషించారు. అయితే, ఆయనపై వచ్చిన విమర్శలతో పార్లమెంట్‌ను ప్రతిపక్షాలు స్తంభింపజేయడమే కాకుండా, బడ్జెట్ ప్రసంగం కూడా ఇవ్వకుండా అడ్డుపడ్డాయి. ఈ క్రమంలో ఆర్థిక శాఖను మరొకరికి అప్పగిస్తే.. పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 
 
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్దినెలలపాటు జైట్లీకి రక్షణ శాఖ నిర్వహించిన అనుభవం కూడా ఉండటంతో ఆయనకు రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, ఏదైనా విషయాన్ని వ్యక్తీకరించడంలో గోయల్‌ది అందెవేసిన చేయి.. ప్రధాని వెంట పలు దేశాలకు వెళ్లి వచ్చిన అతికొద్ది క్యాబినెట్ మంత్రుల్లో ఆయన ఒకరు కావడంతో.. ప్రధానమైన ఆర్థిక శాఖకు జైట్లీ తర్వాత ఆయనే సరైన వ్యక్తి అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. దేశంలో విద్యుత్ రంగానికి గోయల్ ఊతమిచ్చారు. దీంతో ఆర్థిక శాఖను ఆయనకు అప్పగించడం ఖాయమనే ఊహాగానాలు వెలుపడుతున్నాయి.