శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : శుక్రవారం, 11 జులై 2014 (15:06 IST)

పోలవరం బిల్లు పాస్... అప్పుడు టీవీలు కట్ చేసి... ఇప్పుడు చర్చతో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సమైక్యాంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం అవసరం లేదు.. ఒక రాష్ట్రాన్ని విభజించే పూర్తి అధికారం పార్లమెంట్‌కే ఉంది. ఇది మొన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు గొంతు చించుకుని చెప్పిన మాటలు. ఆ నేతలే ఇపుడు ప్లేటు ఫిరాయించారు. 
 
పోలవరం ప్రాజెక్టు కోసం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే అధికారం హక్కు పార్లమెంట్‌కు లేదు. ముఖ్యంగా.. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఆ రాష్ట్ర శాసన సభ అభిప్రాయం, అనుమతి లేకుండా ఎలా విలీనం చేస్తారని ఇపుడు ప్రశ్నిస్తున్నారు. 
 
నాడు అలా మాట్లాడిన నేతల్లో కాంగ్రెస్ తరపున నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకరు. టీఆర్ఎస్ తరపున నాటీ మాజీ ఎంపీ, నేటి కరీంనగర్ ఎంపీ బి వినోద్ కుమార్‌లను ప్రధానంగా చెప్పుకోవచ్చు. 
 
వీరిద్దరు ఇపుడు చెపుతున్న మాటేంటో తెలుసా. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం, ఆమోదం లేకుండా ముంపు మండలాలను బదలాయించే అధికారం, హక్కు పార్లమెంట్‌కు లేదు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని నిండు సభ సాక్షిగా వినోద్ చెప్పడంతో దానికి సభాపతి సుమిత్రా మహాజన్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ అంటూ కాస్తంత కఠువుగానే సమాధానమిచ్చారు. 
 
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరహాలో పోలవరం ఆర్డినెన్స్ ప్రవేశపెట్టలేదు. జాతీయ బహుళార్థ సాధక ప్రాజెక్టు కోసం ఒక మండలంలోని కొన్ని ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు మాత్రమే పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశపెట్టింది. 
 
అలాంటి బిల్లుకు లోక్‌సభ ఆమోదం ముద్ర వేయాలంటే తెలంగాణ రాష్ట్ర అనుమతి కావాలని గొంతు చించుకుని అరుస్తున్న ఈ నేతలకు.. నాడు 13 జిల్లాలకు చెందిన ఐదు కోట్ల మంది ప్రజానీకం, 294 మంది ఎమ్మెల్యేలు కలిగిన సమైక్యాంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం, ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లు గుర్తుకు రాలేదు. 
 
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును తిరస్కరిస్తూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం చెత్తబుట్టలో వేసే చిత్తుకాగితంతో సమానమని ఆనాడు చాలామంది నాయకులు మీడియాముఖంగా చెప్పేశారు కూడా. పార్లమెంట్‌దే అంతిమ నిర్ణయమంటూ పదేపదే మైకులు పట్టుకుని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రసంగాలు చేశారు. ఒక రాష్ట్రాన్ని విభజించాలన్నా.. రాష్ట్ర సరిహద్దులు మార్చాలన్నా పార్లమెంట్‌కే సంపూర్ణాధికారులు ఉన్నాయంటూ ఇందుకోసం ఆర్టికల్ 3 ఉందని గుర్తు చేశారు. 
 
మరి ఇపుడు అదే పార్లమెంట్ ఏడు ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ తెచ్చిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపాలంటే 119 మంది శాసనసభ్యులు కలిగిన అసెంబ్లీ తీర్మానం కావాలని చెప్పడం వారికే చెల్లుబాటు అవుతుంది. 
 
పార్లమెంట్ ఇపుడు దేశానికి పలు రాష్ట్రాలకు ఉపయోగపడే బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణం కోసం బిల్లు తెస్తే మాత్రం అది రాజ్యాంగ విరుద్ధంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలకు కనిపిస్తోంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు అనుసరించి, రాష్ట్రాన్ని విభజించడం వల్లే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో భూస్థాపితం కాగా, తెలంగాణలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అసలు ఏపీ పునర్విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదించేనాడు లోక్ సభ సాక్షిగా టీవీ ప్రసారాలను నిలిపివేసి, లోకానికి తెలియకుండా బిల్లును ఆమోదించినపుడు ఈ నాయకులు పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదేం అనే విమర్శలు సైతం వినవస్తున్నాయి.