శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2015 (15:39 IST)

చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో సీసీ టీవీ వైర్లు ఎవరు కత్తిరించారు? పోలీసుల ఆరా?

చిత్తూరు కార్పొరేషన్ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ కేసులో అనురాధ మేనల్లుడు చింటూనే ప్రధాన సూత్రధారి అని నిర్ధారణకు వచ్చినప్పటికీ.. ఆయనకు ఎవరెవరు సహకరించారనే అంశంపై పోలీసులు ఇపుడు ఆరా తీస్తున్నారు. 
 
ముఖ్యంగా మేయర్‌ హత్యోదంతంలో చింటూ పాత్ర ఏ మేరకు ఉన్నదనేది నిగ్గుతేల్చే ప్రయత్నంలో ఉంది. మేనమామ మోహన్‌తో కలిసి చిత్తూరు రాజకీయాల్లో చురుగ్గా కొనసాగిన చరిత్ర చింటూది. దీంతో జిల్లా టీడీపీలో ఎవరెవరితో చింటూకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. ఆ సంబంధాల కోణం ఏమిటనేది ఆరా తీస్తున్నారు. అలాగే, మోహన్‌కు కూడా రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువే. ఒకసారి ఆయనపై హత్యాయత్నం కూడా జరిగింది కూడా. రాజకీయ ప్రత్యర్థులు మరోసారి విరుచుకుపడ్డారా? అనేదానిపై కూడా ఆరా తీస్తున్నారు. 
 
ఇప్పటికే మొబైల్‌ కాల్‌ డేటాను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. అదేసమయంలో, కటారి కుటుంబంతో చింటూకు ఎక్కడ తేడా వచ్చింది... ఆ ఘర్షణ తీవ్రత ఎంత.. హత్య చేసే స్థాయిలో అవి ఉన్నాయా అనే కోణాన్నీ తడుముతున్నారు. చింటూ ఇంట దొరికిన ఆధారాలను నిశితంగా పరిశీలిస్తూనే, అతడికి సన్నిహితంగా ఉండేవారిని పిలిపించుకొని ప్రశ్నిస్తున్నారు. 
 
అన్నిటికంటే ముఖ్యంగా చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలోని సీసీ టీవీ కెమెరాలు ఉన్నఫళంగా పనిచేయడం లేదు. దీనికి కారణం ఎవరు? మేయర్‌ దంపతులపై హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న చింటూకు కార్పొరేషన్‌ కార్యాలయంలో ఉద్యోగులు ఎవరైనా సహకరించారా...? అనే వాటిపై చిత్తూరు సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
 
నిజానికి నగరపాలక సంస్థ కమిషనర్‌గా శ్రీనివాసరావు ఉన్నన్ని రోజులు సీసీ కెమరాలు పనిచేశాయి. ఆ తర్వాత ఎందుకు పనిచేయలేదనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ కెమరాల్లో ఎలాంటి మరమ్మతులు లేవని క్రైం పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో చింటూ ద్వారానే కొందరు ఉద్దేశపూర్వకంగా సీసీ కెమరాల వైర్లను కట్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకోసం కార్పొరేషన్ ఉద్యోగులు లేదా కార్పొరేటర్లలో ఎవరైనా చింటూకు సహకరించారా అనే విషయంపై పోలీసు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.