శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PYR
Last Modified: గురువారం, 22 జనవరి 2015 (10:02 IST)

ఎంసెట్ కుంపటిపై చలి కాచుకుంటున్న పార్టీలు...!

రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికీ, ప్రయోజనాలు పొందడానికి ఏ అంశాన్నైనా తమ రాజకీయాలకు అనుకూలంగా మలుచుకోగలరడనానికి  ఎన్నో ఉదాహరణలున్నాయి. అదీ నీరు, భూమి, చదవు, సంస్కృతి దేన్నైనా సరే ఇట్టే జనం నరాల్లోకి ఎక్కించగలరు. మెప్పించి ఏళ్ళ తరబడి నాన్చగలగే సత్తా వారికి ఉంది. ఇందులో ఒక పార్టీని తీసేయాల్సిన పని లేదు. మరో పార్టీని తోసేయాల్సిన అవసరం లేదు. మొన్న తెలంగాణ.. నిన్న శ్రీశైలం.. నేడు ఎంసెట్ రేపు మరోటి. వారికి కావాల్సిందల్లా అల్లరి.. ఇదే ప్రస్తుత రాజకీయం. తాజా ఎంసెట్ వివాదంలో దాగి ఉన్న పరమార్థం అదే.. ఎవరి రాజకీయ ప్రయోజనం వారిది. టీఆర్ ఎస్సైనా... తెలుగుదేశమైనా... బీజేపీ అయినా ప్రస్తుతం చేస్తున్నది ఎంసెట్ కుంపటి చుట్టూ చలి కాచుకోవడమే.. అసలు ఎంసెట్ చుట్టూ ఏం జరుగుతోంది..? దీనికి పరిష్కారం ఎలా? అని ఆలోచనలు నిజంగా జరుగుతున్నాయా..? 
 

అసలు విభజన చట్టం ఏమి చెబుతోంది..? ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది..? భారత దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ విభజన అనివార్యమయ్యింది. ఇక్కడ గుండె కాయలాంటి హైదరాబాదే ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రాంతాలకు విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగ కేంద్రం. ఇదే అసలు చిక్కు. ఎంసెట్ కు కీలకమైన విద్యా విధానాన్ని పరిశీలిస్తే.. విడిపోక ముందు, ప్రస్తుతం కూడా పేరుమోసిన ఇంజనీరింగ్ కళాశాలలు,మెడికల్ కాలేజీలు హైదరాబాద్ చుట్టూనే ఉన్నాయి. వీటిలో చదవడమంటేనే విద్యార్థులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇవి ప్రతిభకల విద్యార్థుల కలల కళాశాలు. వాటిలో చదవాలనేది వారి జీవిత ఆశయంగా పోటీ పడుతారు. అయితే రాష్ట్రం విడిపోతే వాటి హక్కు ఉండదనే అప్పట్లో సీమాంధ్ర మేధావులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. 
 
అదే పదేళ్ళ ఉమ్మడి విద్యావిధానం. రెండు రాష్ట్రాలలోని ఏ కాలేజీలోనైనా రెండు ప్రాంతాల విద్యార్థులు విద్యను అభ్యసించవచ్చు. అందుకే ఉమ్మడి ఎంసెట్, ఉమ్మడి లాసెట్, కొన్ని యూనివర్శిటీలకు ఉమ్మడి పిజీ సెట్ లను సూచించారు. ఇది చట్టం. పార్లమెంటు ఆమోదం కూడా పొందింది. కానీ ఈ రెండు రాష్ట్రాలు ఎందుకు కలిహించుకుంటున్నాయి? అంటే.. రాజకీయం. తెలంగాణలో వేడి తగ్గకుండా ఉండాలంటే కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ఎంసెట్ నిర్వహించాల్సిందే. ఎందుకు ? అంటే ఉమ్మడి ఎంసెట్ నిర్వహిస్తే ఏమవుతుంది? ఎవరు ఎన్ని చెప్పినా.. బ్రిటీష్ హయాం నుంచి సీమాంధ్ర ప్రాంతంలో విద్యా వ్యవస్థ కాస్త గట్టి పునాదినే వేసుకుంది. తెలంగాణలో దొరలపాలన, నిజాం పాలన కారణంగా విద్యకు అంతగా ప్రాధాన్యత కలగలేదనే చెప్పాలి. ఈ తారతమ్యం ఏ ఒక్క యేడాది రెండు యేళ్ళదో కాదు. కనీసం రెండు శతాబ్దాలు కొనసాగింది. 
 
సహజంగానే సీమాంధ్ర విద్యార్థులు ఉమ్మడి పరీక్షలలో ముందుంటారు. ఇది వాస్తవం. ఇందుకు వారు సాధించే ర్యాంకులే తార్కాణాలు. ఇలాంటి పరిస్థితులలో ఉమ్మడి పరీక్ష జరిపితే తమ ప్రాంతంలోని మంచి మంచి కళాశాలలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సీట్లు తన్నుకుపోతారనేది భయం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. అయితే విభజన చట్టాన్ని అనుసరించి వేరు ఎంసెట్ పరీక్షలు నిర్వహించడానికి వీలుకాదనే విషయం తెలంగాణ నాయకులకు స్పష్టంగా తెలుసు. ఇలాంటి అంశాలపైనే కోర్టులు అనేక తీర్పులు ఇచ్చాయి. అయినా వారు ప్రత్యేక ఎంసెట్ పరీక్షకే పట్టుబట్టడానికి కారణం. జనంలో నానే అంశాన్ని తమ రాజకీయాలకు అనుగుణంగా మార్చుకోవాలనుకోవడమే ప్రధాన కారణం. విడిగా ఎంసెట్ నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమిటి..? 
 
రాష్ట్రం పాతదే అయినా విద్యా సంస్థల విషయంలో నవజాత శిశువే. ఎక్కడా హైదరాబాద్ స్థాయితో పోల్చుకోగలిగిన ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు లేవు. వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తే వాటిలో చదువుకునే అవకాశం ఇక్కడి విద్యార్థులకు దక్కదనేది జగమెరిగిన సత్యం. ఉదాహరణకు జెఎన్ టియు కాలేజీలు ఎన్ని ఉన్నా.. హైదాబాద్ జెఎన్టీయూ, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నా.. హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీల ప్రమాణాలు ఉండవనేది తేటతెల్లం. వేర్వేరు ఎంసెట్ పరీక్షలు జరిపితే ప్రతిభావంతులైన విద్యార్థులు అక్కడ చదివే అవకాశాన్ని కోల్పోక తప్పదు కదా. ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థలు అభివృద్ధి చెందేంత వరకూ అంటే పదేళ్ళపాటు ఉమ్మడి విద్యా విధానానం తప్ప ఇక్కడి విద్యార్థులకు మరో మార్గం లేదు. 
 
ఇలాంటి కీలక విషయం ఎంసెట్ మంట రాజేస్తుంటే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తోంది. కోర్టులలో విజయం సాధిస్తాం. ఒకడుగు వెనక్కి తగ్గి ఉపాధ్యక్ష పదవి తీసుకుంటాం అనడం.. టీఆర్ఎస్ నాయకులను నిందించే పనులు తప్ప పరిష్కార మార్గాలను వెతికిందా.. ఈ సమస్యకు రాజకీయ పరిష్కారం తప్ప మరోమార్గం లేదనే విషయం తెలుగుదేశం పార్టీకి స్పష్టంగా తెలుసు. అయినా రాజకీయ పరష్కారానికి కృషి చేసిన దాఖలాలు లేవు. ప్రయత్నాలు కూడా జరపడం లేదు. దీనికి కారణంగా మళ్ళీ రాజకీయమే.. అదే రెండు కళ్ళ సిద్ధాంతం, బీజేపీతో స్నేహం. భద్రాచలం డివిజన్ లోని కోన్ని ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లో కలపినప్పుడు అక్కడి టీఆర్ ఎస్ అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని కేంద్రంపై పోరాటానికి సిద్ధమయ్యింది. 
 
మరి ఇక్కడ ఏపికి అన్యాయం జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదనేది విమర్శలకు దారితీస్తోంది. విభజనను కాంగ్రెస్ సక్రమంగా చేయలేదని తామొస్తే సరిదిద్దుతామని, తమతో ఉన్న చంద్రబాబు పార్టీని గెలిపించకపోతే మీ ఇష్టం అని నేటి ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే చెప్పారు. ప్రజలు కూడా నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. మరి ఇప్పుడు బీజేపీ ఏం చేస్తోంది? పదేళ్ళ పాటు ఉమ్మడి విద్యా విధానమని స్పష్టంగా చట్టం ఉన్నా... దాని ఉల్లంఘన జరుగుతున్నా చట్టాన్ని అమలు చేయాల్సిన కేంద్రం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తోంది. పార్టీలు అన్ని ఇలాగే ఎంసెట్ చుట్టూ చలి కాచుకుంటే విద్యార్థులకు మిగిలేది చీకటి భవిష్యత్తే.