శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శనివారం, 13 ఫిబ్రవరి 2016 (15:46 IST)

మెగాస్టార్ చిరంజీవి గొప్ప తండ్రి... స్ఫూర్తిదాయకుడు... ఎందుకంటే...?

గత కొన్ని రోజులుగా మెగాస్టార్ రెండో కుమార్తె శ్రీజ పెళ్లి వార్త హల్‌చల్ చేస్తోంది. ఆమె నిశ్చితార్థం కూడా జరిగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనన్నట్లు మెగా క్యాంపస్ నుంచి దీనిపై ఎలాంటి ఖండింపు సమాధానాలు రాలేదు. కనుక శ్రీజ పెళ్లి ఖాయమేనని తెలుస్తోంది. చిరంజీవి గొప్ప తండ్రి... ఆదర్శనీయుడు, స్ఫూర్తిదాయకుడుగా ఈ విషయంలో చెప్పుకోక తప్పదు. సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలున్నప్పటికీ చిరంజీవి వ్యక్తిత్వం భిన్నమంటారు ఆయనను దగ్గరగా చూసిన కొంతమంది. 
 
ఎంతో కష్టపడి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్న చిరంజీవి వ్యక్తిగత జీవితంలో... ముఖ్యంగా తన రెండో కుమార్తె శ్రీజ విషయంలో కాస్త ఇరుకున పడ్డారు. ఆమె తను ప్రేమించిన వ్యక్తిని పెద్దల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోవడం ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత వారి మధ్య గొడవలు వచ్చి తిరిగి ఆమె తన పుట్టింటికి తిరిగి వచ్చింది. ఇక అక్కడ నుంచి చూస్తే చిరంజీవి తండ్రిగా ఎంత ఉన్నతులో అర్థమవుతుంది. 
 
ఈ సమాజంలో చాలామంది ప్రేమ వివాహాన్ని అంగీకరించరు. అంగీకరించకపోయినప్పటికీ ప్రేమించినవాడితో సదరు అమ్మాయి పెళ్లి చేసుకుని దూరమైపోతే ఇక ఆమె గురించి పట్టించుకోరు. ఐతే పెళ్లయ్యాక వారివారి మనస్తత్వాలు కలవక విడిపోతే, విడాకులు తీసుకుని వస్తే ఇక ఆమె జీవితం అంతటితో సరి అన్నట్లుగా చాలామంది వ్యవహరిస్తారు. ప్రేమించినవాడు ఆదరించక, పుట్టింటివారు పట్టించుకోక ఆమె జీవితం నరకప్రాయంగా మారుతుంది. 
 
ఇలాంటి వ్యవహారంలో పరువు కోసం చాలామంది కన్నపేగు తెంచుకుని పుట్టిన బిడ్డ జీవితం ఎలా పోయినా పట్టించుకోరు. తమ పుత్రిక తనకు తలవంపులు చేసే పని చేసిందనీ, కనుక తమకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తారు. తమ కళ్లెదుటే కష్టాల కడలిలో ఈదుతున్నా తమకు పట్టనట్లు వ్యవహరిస్తారు. దుర్భర జీవితం అనుభవిస్తున్నా చూస్తూ ఉంటారు తప్పించి పట్టించుకోరు. 
 
ఇలాంటి కరడుగట్టిన తల్లిదండ్రులకు మెగాస్టార్ గొప్ప తండ్రిగా ఆదర్శనీయుడు. కుమార్తె తనకు నచ్చిన అబ్బాయిని కట్టుకున్నప్పుడు, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ వారికి ఎలాంటి ఇబ్బందిని తలపెట్టలేదు. తమ కుమార్తె ప్రేమించినవాడితో సమస్య వచ్చి విడాకులు తీసుకుంటే, అందరి తండ్రుల్లా వదిలేయలేదు. ఆమెను చేరదీసి జీవితంపైన కొత్త ఆశలు కల్పించారు. అంతటితో జీవితం అయిపోలేదనీ, ఇంకా భవిష్యత్తు చాలా ఉందని చాటిచెప్పారు. చిరంజీవి వంటి గొప్ప తండ్రుల నుంచి తమ కన్నబిడ్డలను చిన్నచూపు చూసేవారు స్ఫూర్తి పొందాల్సింది ఎంతైనా ఉంది. అందుకే మెగాస్టార్ మెగాస్టారే.