గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2016 (16:24 IST)

రోజాతో సారీ చెప్పించాలనుకున్నారు.. ఎదురుదాడితో అవాక్కయ్యారు... ఎవరు?

వైకాపా ఎమ్మెల్యే రోజాతో క్షమాపణ చెప్పించాలని తెలుగుదేశం పార్టీ విశ్వప్రయత్నాలు చేసింది. హైకోర్టు ఆదేశాలను సైతం పాటించకుండా రోజాను అసెంబ్లీకి రాకుండా గత అసెంబ్లీ సమావేశాల సమయంలో అడ్డుకున్నారు. అదే పవర్‌తో రోజాతో క్షమాపణ చెప్పించేందుకు ప్రయత్నించారు. రోజాపై టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చేందుకు సభా హక్కుల కమిటీ మరోసారి రోజాకు అవకాశం కల్పించింది. ఈసారి ఎలాగైనా సారీ చెప్పక తప్పదు.. లేకపోతే కఠిన చర్య తీసుకునైనా సరే రోజాకు తమ తడాఖా చూపించాలని డిసైడైపోయారు. 
 
రోజా కూడా ఎందుకొచ్చిన గొడవ.. ఓసారి సారీ చెప్పేస్తే తన ఎమ్మెల్యే గిరీ కాపాడుకోవచ్చన్న ఉద్దేశంతో ఉన్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి ఈ క్రమంలో రోజా క్షమాపణ చెప్పడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ రోజా మాత్రం తనదైన శైలిలో సభాహక్కుల కమిటీకి షాక్ ఇచ్చారు. అనితను అగౌరవ పరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కమిటీ ముందు రోజా మరోసారి కుండబద్దలు కొట్టారు. అనిత పట్ల తనకు గౌరవం ఉందని.. తన వ్యాఖ్యలు అనితను బాధించి ఉంటే  వెనక్కి తీసుకుంటానని మాత్రమే ఆమె చెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని రోజా ఖరాఖండీగా చెప్పేశారు. 
 
అంతే కాకుండా.. సభలోని తన వీడియోలు సోషల్ మీడియాకు ఎలా లీక్ అయ్యాయో తేల్చాలని ఆమె హక్కుల కమిటీ ముందు వాదించారు. శాసన సభా కార్యదర్శిని రోజా నిలదీసినట్లు సమచారం. సభలో వైసీపీ సభ్యులను కించపరిచేలా అధికార పార్టీ సభ్యులు కామెంట్ చేశారని.. దీనిపై  సభా హక్కుల కమిటీకి తాము ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. రోజా సారీ చెబుతుందని ఊహించిన కమిటీ పెద్దలు ఈ ఎదురుదాడితో అవాక్కయ్యారట. అందుకే ఆమె వివరణను రికార్డు చేసుకున్నామని.. మళ్లీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామని చెప్తున్నారు.