గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2016 (13:12 IST)

చిత్తూరు జిల్లా వ్యభిచార ముఠా చేతిలో 200మంది యువతులు...

చిత్తూరు జిల్లా ఆధ్మాత్మిక క్షేత్రం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. జిల్లాలోని ప్రధాన ప్రాంతాలైన తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లి, చిత్తూరులలో కొంతమంది అసాంఘిక కార్యకలాపాలను యధేచ్ఛగా నిర్వహించ

చిత్తూరు జిల్లా ఆధ్మాత్మిక క్షేత్రం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. జిల్లాలోని ప్రధాన ప్రాంతాలైన తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లి, చిత్తూరులలో కొంతమంది అసాంఘిక కార్యకలాపాలను యధేచ్ఛగా నిర్వహించేస్తున్నారు. పోలీసులు మాత్రం మామూళ్లలో జోగుతూ తమకేం సంబంధంలేనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో వ్యభిచారముఠా ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నాయి. జనావాసాల మధ్యే గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాలను నడిపేస్తున్నారు.
 
చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, తంబళ్ళపల్లిలలో ఈ మధ్యకాలంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయి. ప్రధానంగా నిరుద్యోగ యువతులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని మోసగించి వారిని విదేశాలకు పంపి వ్యభిచారం చేయిస్తున్నారు. మరికొంతమందిని అయితే స్థానికంగా ఉన్న ప్రాంతాల్లో వ్యభిచార గృహ నిర్వాహకులకు అమ్మేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇందులో 200 మందికిపైగా యువతులు ప్రస్తుతం చిక్కుకుని బాధలు పడుతున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది.
 
మదనపల్లి, తంబళ్లపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలలో యువతులు చదువుకుని ఆర్థిక స్థోమత లేక వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కోసం వెళుతుంటారు. వారి నెంబర్లను సేకరిస్తున్న వ్యభిచార ముఠా నిర్వాహకులు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని పిలిపించుకుని వారిని బలవంతం చేసి వ్యభిచారంలో దింపేస్తున్నారు. కొంతమంది యువతులు ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో వ్యభిచార ముఠా నిర్వాహకులతో కలిసి మనస్సు చంపుకుని వెళ్ళిపోతుండగా మరికొంతమంది మాత్రం దూరంగా పారిపోయి వచ్చేస్తున్నారు.
 
ఇలాంటి యువతులను ఇప్పటికే జిల్లాలో 200 మందికిపైగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే వీరిని వ్యభిచారగృహ నిర్వాహకుల నుంచి సురక్షితంగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ విషయంపై సీరియస్‌గా తీసుకుంది.