గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : ఆదివారం, 26 జూన్ 2016 (12:12 IST)

ఆ టెంపుల్‌లో టెంకాయ కొట్టాలంటే కాసులు కొట్టాల్సిందే.. వారానికి రూ.50 వేలు.. నెలకు రూ.2 లక్షల ఆదాయం... ఎలా?

చిత్తూరు జిల్లాలోని పుణ్యక్షేత్రాల వద్ద భక్తులను దళారీలు నిలువునా దోచేస్తున్నారు. భక్తులను ఒకటి రెండు ఆలయాల వద్ద దోచేస్తున్నారని మాత్రమే చెప్పలేం.

చిత్తూరు జిల్లాలోని పుణ్యక్షేత్రాల వద్ద భక్తులను దళారీలు నిలువునా దోచేస్తున్నారు. భక్తులను ఒకటి రెండు ఆలయాల వద్ద దోచేస్తున్నారని మాత్రమే చెప్పలేం. ఎందుకంటే అన్ని ఆలయాల వద్ద దళారీల బెడదే. భక్తుల జేబులకు చిల్లులు పెట్టి ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నారు. 
 
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల్లోను భక్తులను మోసం చేస్తున్నారు. బోయకొండ ఆలయాల వద్ద జరుగుతున్న తతంగమే ఇందుకు నిదర్శనం. అమ్మవారికి భక్తులు సమర్పించే కొబ్బరికాయల్లో ఒక చిప్ప సేకరించుకోమని అనుమతి ఇస్తే టెంకాయ కొట్టేందుకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడి కాంట్రాక్టర్లు. దీని ద్వారా ఏటా లక్షల రూపాయలు అక్రమంగా సంపాందించేస్తున్నారు. 
 
భక్తులు ఆలయం ముందు భాగంలోని త్రిసూలం వద్ద కొబ్బరికాయలు సమర్పిస్తారు. ఇందుకోసం త్రిసూలానికి రెండు వైపులా రెండు కౌంటర్లు ఉన్నాయి. ఇక్కడ ఉండే కాంట్రాక్టర్లు భక్తుల నుంచి కొబ్బరికాయలు తీసుకుని, కొట్టి ఒక చిప్పను తీసుకుంటారు. మరొకటి భక్తులకు ఇస్తారు. ఇదంతా ఉచితంగానే చేయాలి. కానీ, ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలంటే 5 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. కొబ్బరి కాయలను ఉచితంగా కొట్టాలని అక్కడే బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. అయినా సరే కాంట్రాక్టర్లు మాత్రం వాటిని బేఖాతరు చేస్తున్నారు. ఎవరైనా భక్తులు 5 రూపాయలు మీకెందుకు ఇవ్వాలి.. మేమే కొట్టుకుంటామంటే.. అసలు ఒప్పుకోరు. వారితో గొడవపడి మరీ వారిని బూతులు తిట్టి టెంకాయలను వారే కొడతారు. 
 
శుక్ర, శని, సోమవారాల్లో రోజూ 10 వేల మందికిపైగా భక్తులు వస్తుంటారు. కనీసం 4 వేలమంది కొబ్బరి కాయలు కొడతారు. ఆది, మంగళ, గురువారాల్లో 20 వేల మందికి వరకు వస్తారు. కనీసం 7 వేలమంది కొబ్బరి కాయలు కొడతారు. వారంలో కనీసం 10 వేల మంది కొబ్బరికాయలు సమర్పిస్తారు. ఈ లెక్కన ఒక్కొక్కరి వద్ద 5 రూపాయలు వసూలు చేస్తారనుకున్నా... వారానికి 50 వేల రూపాయలు, నెలకు 2 లక్షలు అవుతుంది. ఏడాదికి 24 లక్షలు అన్నమాట. దీనంతటికీ ఆలయానికి కాంట్రాక్టరు చెల్లించేది 4 లక్షలు రూపాయలు మాత్రమే. ఇప్పటికైనా దేవస్థానం ఈఓ స్పందించాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.