శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr

పారిస్ దాడిలో పాల్గొన్న తీవ్రవాదులకు గ్రనేడ్లు, ఏకే47 గన్స్, బాంబులు ఎక్కడనుంచి వచ్చాయి?

ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంపై జరిగిన దాడిలో పాల్గొన్న ఇసిస్ ఉగ్రవాదులకు గ్రనేడ్లు, ఏకే 47 తుపాకులు, బాంబులు ఎక్కడ నుంచి వచ్చాయన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పైగా ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకరు ఫ్రాన్స్ దేశస్తుడే కావడం గమనార్హం. మరొక వ్యక్తి సిరియా నుంచి శరణార్థిగా గ్రీస్ మీదుగా పారిస్‌లో ప్రవేశించాడు. అయితే, ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల వద్ద గ్రనేడ్లు, ఏకే 47 తుపాకులు, పేలుడు సామాగ్రి ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయి?. ఎలా వచ్చాయనేది తేలాల్సి ఉంది. దీనిపై ఫ్రాన్స్ భద్రతా బలగాలతో పాటు ఐరోపా సమాఖ్య దేశాలన్నీ దర్యాప్తు చేస్తున్నాయి.
 
మరోవైపు.. ఫ్రాన్స్ నిఘా వ్యవస్థపై ఇపుడు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలో పటిష్టమైన నిఘా వ్యవస్థలున్న దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. అయినా తీవ్రవాదుల కదలికల్ని ఫ్రాన్స్ ఇంటెలిజెన్స్ కనుక్కోలేక పోయిందా?. పారిస్‌పై తీవ్రవాదులు ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు దాడులు చేశారు. అయినప్పటికీ.. భద్రతా బలగాలు, నిఘా వర్గాలు.. టెర్రరిస్టుల జాడను ఎందుకు కనుక్కులేక పోయాయి?. ప్యారిస్‌లో ఐసిస్ నెట్ వర్క్ అంత పటిష్టంగా ఉందా? అనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
అయితే, ఐసిస్ దాడుల్ని పసిగట్టలేకపోవడానికి.. నిఘా వర్గాలు చెబుతున్న సమాధానం సిరియా శరణార్థులు. సిరియా నుంచి లక్షల సంఖ్యలో శరణార్ధులు  ఐరోపా దేశాలకు వస్తున్నారు. ఐసిస్ తీవ్రవాదులు శరణార్థుల ముసుగు వేసుకుని.. గ్రీస్, బెల్జియం మీదుగా ప్యారిస్‌ చేరుకున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. వారికి స్థానికంగా కొంతమంది సాయం చేసారని భావిస్తున్నాయి. శరణార్థులు లక్షల సంఖ్యలో ఉండటంతో.. వారిలో తీవ్రవాదులు ఎవరో... నిజమైన బాధితులు ఎవరో గుర్తించడంలో నిఘా విభాగం విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి.