శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Modified: మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (10:39 IST)

రాహూల్ జోరు... మోడీ బేజారు.. బీజేపీ ఎంపీలకు క్లాసు

ముద్దపప్పులా ఉంటాడు. పార్టు టైమ్ రాజకీయాలు చేస్తుంటారని రక రకాల విమర్శలతో తనను ఎద్దేవా చేసిన అధికార పక్షానికి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ చుక్కలు చూపించారు. తనలోని దూకుడిని పార్లమెంటు ఎదుట పెట్టారు. షూటు బూటు ప్రభుత్వం అంటూ విమర్శలతో విరుచుకుపడడంతో భారతీయ జనతా పార్టీ నాయకులు షాకయ్యారు. వారు తేరుకునే లోపు జరగాల్సిన దాడి జరిగిపోయింది. తనను టార్గెట్ చేస్తూ రాహూల్ మాట్లాడిన మాటలకు ప్రధాని మోడీ విలవిలలాడారు. చివరకు అధికార పార్టీ ఎంపీలకు క్లాసుల మీద క్లాసులు పీకారట. 
 
చాలా కాలం తరువాత ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ పార్లమెంటులో అడుగు పెట్టారు. ఎప్పుడూ చాలా కూల్ గా కనిపించే రాహూల్ లో దూకుడు కనిపించింది. పదునైన పదజాలం ఆయన నోట బయటకు వచ్చాయి. లోక్‌సభలో నరేంద్ర మోడీ సర్కార్‌పై రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. తమ యువరాజులో ఈ కోణాన్ని చూడటం కాంగ్రెస్‌ నేతలకే కొత్తగా అనిపించింది. అంత ఎగ్రెసివ్‌గా రాహుల్‌ మాట్లాడేస్తోంటే, నోళ్ళు వెల్లబెట్టారు కాంగ్రెస్‌ నేతలు. మరోపక్క, బీజేపీ నేతలకు ఇది నిజంగానే పెద్ద షాక్‌. 
 
పెద్ద ఎత్తున మద్దతిచ్చి అధికారంలోకి తీసుకు వస్తే భారతీయ జనతా పార్టీ తగిన న్యాయం చేయడం లేదనీ, ఇది షూటు బూటు ప్రభుత్వంగా మారిపోయిందంటూ రాహూల్ విరుచుకుపడడం అందరికీ ఆసక్తికరంగా అనిపించింది. రైతులకు న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. నిజంగా రైతల పట్ల అధికార పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మోడీ జనంలోకి వెళ్ళితే రైతుల పడే బాధలేంటో తెలుస్తాయనీ, ఆయన ఏనాడైన రైతాంగ సమస్యలపై స్పందించారా.. అని ప్రశ్నించారు. అకాల వర్షాల వలన దెబ్బతిన్న ప్రాంతాలలో మోడీ పర్యటించాలని డిమాండ్ చేశారు. 
 
ఇలా రాహూల్ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేయడంతో కేంద్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో పత్రికలు కూడా పతాక శీర్షికన రాహుల్ ను పొగిడేశాయి. ఇక్కడ నరేంద్ర మోడీకి కాలింది. ఎంపీల్ని పిలిచి నరేంద్ర మోడీ క్లాసు పీకినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 
 
రాత్రికి రాత్రి పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులతో మాట్లాడిన నరేంద్ర మోడీ, అస్సలేమాత్రం సభలో ప్రభుత్వంపై, ప్రతిపక్షం దాడిని లైట్‌ తీసుకోవద్దని  సూచించారట. ఈ వ్యవహారంపై బీజేపీ వర్గాల్లో హాట్‌ హాట్‌గా చర్చ జరుగుతోంది. రాహుల్‌కి అంత ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం లేదని కొందరు కేంద్ర మంత్రులు, ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీకి వివరించే ప్రయత్నం చెప్పినా ఆయన వినలేదు. మన అలసత్వం, ప్రత్యర్థికి బలంగా మారకూడదరి ఘాటుగానే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.