గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Eswar
Last Modified: బుధవారం, 9 జులై 2014 (18:04 IST)

హై స్పీడు బుల్లెట్... ఇది మోడీ విసిరిన రాకెట్... విమానంకు ఎక్కువా...?

దేశంలో బుల్లెట్ ట్రైన్ల శకం మొదలైంది. త్వరలో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి తెస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే భారత్ లాంటి దేశాల్లో ఇది సాధ్యమేనా?. ఇప్పటికే బుల్లెట్ రైలు నడిపిస్తున్న చైనా, జపాన్‌... వీటితో లాభాలు పొందుతున్నాయా?. ప్రాజెక్ట్ ప్రకటించినంత ఈజీగా... బుల్లెట్ ట్రైన్లు పట్టాలెక్కుతాయా?
 
బుల్లెట్ ట్రైన్ పేరుకు తగ్గట్టే బుల్లెట్‌లా దూసుకెళ్తుంది. వందల కిలోమీటర్లను జెట్‌స్పీడ్‌తో కవర్ చేస్తుంది. ఇప్పటికే చైనా, జపాన్‌లో బుల్లెట్ రైళ్లు పరుగులెత్తుతున్నాయి. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ దేశాలను ఆదర్శంగా తీసుకున్న మోడీ సర్కార్... త్వరలో భారత్‌లోనూ వీటిని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది.
 
దేశంలో తొలిసారి బుల్లెట్ ట్రైన్లు ప్రవేశపెట్టాలని సంకల్పించింది ఎన్డీయే ప్రభుత్వం. ముందుగా ముంబై, అహ్మదాబాద్ కారిడర్‌లో 60 వేల కోట్లతో ప్రాజెక్ట్‌ను అమలుచేస్తామని రైల్వే బడ్జెట్‌లో ప్రకటించింది. మెట్రోలు, ప్రధాన నగరాల్ని కలుపుతూ మొత్తం 9 రూట్లలో హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేస్తామంది. దీనికోసం వంద కోట్లను కేటాయించింది.
 
మరోవైపు మన దేశంలో బుల్లెట్‌ రైల్ సాధ్యమవుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ కల సాకారం కావాలంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టాల్సిందే. మన దగ్గర ప్రస్తుతం రైళ్లు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికే ట్రాక్‌లు ఉన్నాయి. బుల్లెట్‌ ట్రైన్ అంటే... 250 కిలోమీటర్ల స్పీడ్ కామన్. దీంతో ఇప్పుడున్న ట్రాక్‌లు, మౌలిక సదుపాయాలేవీ పనికిరావు. అన్నీ కొత్తగా నిర్మించాల్సిందే. ప్రాజెక్ట్ కోసం భారీగా భూసేకరణ చేయాల్సి ఉంటుంది.
 
అమెరికా సహా అగ్రదేశాల్లో బుల్లెట్ ట్రైన్ల కంటే... ఎయిర్‌, రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. 
 
మరోవైపు భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్ నడవాలంటే... కిలోమీటర్‌కు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఓ అంచనా. టికెట్ ధరలూ భారీగా పెంచాల్సి వస్తుంది. కిలోమీటర్‌కు 8 రూపాయలు ఛార్జ్ చేస్తే తప్ప... ట్రైన్ నడవడం కష్టం. ఈ లెక్కన 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే... టికెట్‌ ధర 3200 రూపాయల దాకా అవుతుంది. హైదరాబాద్‌ నుంచి విశాఖకు విమానంలో వెళ్లినా అంత ఖర్చు కాదు. దీంతో బుల్లెట్ ట్రైన్ చెప్పుకోవడానికి గొప్పగా కనిపించినా... ఆచరణలోకి తేవడం కష్టమేనంటున్నారు నిపుణులు.