శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (16:20 IST)

డాడీ.. పార్టీ మారొద్దు.. ప్లీజ్‌.. వెళితే ప్రజల్లో చులకనైపోతాం.. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి

కుటుంబ రాజకీయాలు మామూలే. తండ్రి, తల్లి రాజకీయాల్లో ఉంటే తమ కుమారులనో, కుమార్తెలనో రాజకీయాల్లోకి తీసుకువస్తుంటారు. ఆ తర్వాత వారి పిల్లలు.. అలా అలా కుటుంబంలోని వారికే ఛాన్సులు వస్తుంటాయి.

కుటుంబ రాజకీయాలు మామూలే. తండ్రి, తల్లి రాజకీయాల్లో ఉంటే తమ కుమారులనో, కుమార్తెలనో రాజకీయాల్లోకి తీసుకువస్తుంటారు. ఆ తర్వాత వారి పిల్లలు.. అలా అలా కుటుంబంలోని వారికే ఛాన్సులు వస్తుంటాయి. పదవిని అలంకరిస్తుంటారు. అదేవిధంగా చిత్తూరుజిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుమారుడు మిథున్‌ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి పెద్దిరెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన మిథున్‌ రెడ్డి ప్రస్తుతం రాజంపేట ఎంపీగా కొనసాగుతున్నారు. తండ్రీ, కొడుకులు ఇద్దరు కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు.
 
అయితే గత కొన్నిరోజులుగా తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పార్టీని మారాలన్న ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు తన అనుచరులు, సన్నిహితులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవాలన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. కారణం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో తనకు సముచిత స్థానం లభించలేదన్న కోపంతోనే. సీనియర్‌ నాయకుడిగా ఉన్న తనకు అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి సరైన గౌరవం ఇవ్వలేదన్న కోపంతో ఉన్నారు పెద్దిరెడ్డి. ఇదే విషయాన్ని గత కొన్నిరోజులుగా తన సన్నిహితులతో చర్చిస్తూనే ఉన్నారు.
 
తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవాలని సీనియర్‌ నాయకులతో కూడా పెద్దిరెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. సీనియర్‌ నాయకులు కూడా పెద్దిరెడ్డిని తెదేపాలోకి ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ విషయమంతా కుమారుడు మిథున్‌ రెడ్డికి తెలియదు. తండ్రి పార్టీని మారతారని తెలుసుకున్న మిథున్‌ రెడ్డి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం ప్రారంభించారు.
 
రెండురోజుల క్రితం తండ్రితో చాలాసేపు మాట్లాడిన మిథున్‌ రెడ్డి.. డాడీ పార్టీని వదిలి వెళ్ళవద్దంటూ వేడుకొన్నాడట. పార్టీని వదిలి వెళ్ళాలన్న ఆలోచననను మానుకోవాలని, ప్రస్తుతం మనం ఒకే పార్టీలో ఉంటే మంచిదని, లేకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పే ప్రయత్నం చేశారట. అయితే అందుకు పెద్దిరెడ్డి ససేమిరా అన్నారట. ఎట్టిపరిస్థితిల్లోను తాను పార్టీలో కొనసాగలేనని చెప్పారట. అయితే మిథున్‌ రెడ్డి మాత్రం పార్టీని మారాలన్న నిర్ణయాన్ని మాత్రం కనీసం కొన్నిరోజుల కన్నా మానుకోవాలని కోరారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ప్రస్తుతానికి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పార్టీ మారాలన్న నిర్ణయం వాయిదా వేసుకున్నారు. కానీ త్వరలో తెదేపాలోకి వెళ్ళడం ఖాయమని మాత్రం ఆయన అనుచరులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు.