గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : సోమవారం, 29 డిశెంబరు 2014 (15:17 IST)

అమ్మ రెండాకులు... రజినీకాంత్ దారటు... ఎంజీఆర్ కుర్చీలో...?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత గాలం వేస్తున్నారంటూ కోలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడి జయలలిత.. ప్రస్తుతం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇంటికి చేరుకున్నారు. ఈ బెయిల్ గడువు మరో మూడు నెలలు మాత్రమే ఉంది. ఈ గడువులోగా తన కేసును పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆమె ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు జైలుశిక్షను అనుభవించాల్సి ఉంటుంది. 
 
ఇదే జరిగితే అన్నాడీఎంకేకు రథసారథి విషయంలో ప్రశ్నార్థకంగా మారనుంది. దీంతో అన్నాడీఎంకే శ్రేణులు రజినీతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా ఉన్నత స్థాయిలోనే ఈ చర్చలు అత్యంత గోప్యంగా సాగుతున్నట్టు వినికిడి. జయలలిత ఆదాయపన్ను కేసు నుంచి విముక్తి  పొందలేని పక్షంలో పార్టీ బాధ్యతలను రజినీకి అప్పగించాలన్న యోచనలో ఆమె ఉన్నట్టు సమాచారం. 
 
అందువల్లే రజినీకాంత్ బీజేపీలో చేరేందుకు తర్జనభర్జనలు పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. తాజాగా కూడా ఆయన తుది నిర్ణయం తీసుకునేందుకు మరో నాలుగు నెలల సమయం కావాలని కమలనాథులను కోరినట్టు సమాచారం. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే జయలలిత కేసు అంశం ఈ నాలుగు నెలల్లో అటోఇటో తేలిపోనుంది. 
 
ఒకవేళ జయమ్మకు కోర్టులో చుక్కెదురైతే అన్నాడీఎంకే సారథ్య బాధ్యతలను ఆయన చేపట్టే అవకాశం ఉందనే వాదన గట్టిగా వినబడుతోంది. లేనిపక్షంలో బీజేపీలో చేరాలన్నది రజినీ ఆలోచనగా ఉందని అంటున్నారు. అందుకే బీజేపీలో చేరేందుకు మరో నాలుగు నెలల సమయం కావాలని అమిత్ షా ను కోరినట్టు సమాచారం. దీనికి సమ్మతించని అమిత్ షా... సొంత పార్టీ నేతలకు కూడా రజినీకాంత్ గురించి మరచిపోవాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఏది ఏమైనా రజినీకాంత్ అసలు విషయం తెలియాలంటే మరో నాలుగు నెలలు ఆగాల్సిందే.