శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (21:34 IST)

రాంపాల్ అరెస్టు : హర్యానా మాజీ సీఎం భార్య కూడా బాబా రాంపాల్ భక్తురాలే!!

ఎట్టకేలకు పోలీసుల బోనులో చిక్కిన వివాదాస్పద బాబా రాంపాల్‌కు సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు పరమభక్తులే. ఇలాంటి వారిలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా సతీమణి కూడా ఓ భక్తురాలే కావడం గమనార్హం. అలాంటి రాంపాల్.. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వేలాది మంది భక్తులకు ఆరాధ్య దైవంగా ఎదిగాడు. 
 
ఐటీఐ విద్యను అభ్యసించిన రాంపాల్.. 1951 సెప్టెంబర్ 8న హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ జిల్లా ధనాన గ్రామంలో జన్మించాడు. తండ్రి నంద్ లాల్ ఓ సామాన్య రైతు. తల్లి ఇందిరాదేవి సాధారణ గృహిణి. చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కలిగివుండటం రాంపాల్‌కు బాగా కలిసి వచ్చింది. 
 
ఐటీఐ పూర్తి చేసిన రాంపాల్... హర్యానా ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం సంపాదించాడు. 1995 వరకు జూనియర్ ఇంజినీర్‌గా పనిచేసి, ఆ తర్వాత బాబా అవతారం ఎత్తాడు. 25 ఏళ్లపాటు హనుమంతుడిని భక్తిభావంతో పూజించిన రాంపాల్... ఆ తర్వాత తనను తాను కబీర్ ప్రవక్తగా చెప్పుకుని స్వామీజీగా అవతరించాడు.
 
ప్రారంభంలో నిరుపేద, అట్టడుగు వర్గాల ప్రజలను ఆకర్షించిన రాంపాల్ అతి తక్కువ కాలంలోనే బాగా మంచి ఆదరణ పొందాడు. ముఖ్యంగా ఆయన చేసిన అనేక వివాదాస్పద ప్రసంగాలు అట్టడుగు ప్రజలను అమితంగా ఆకర్షించాయి. "దేవుళ్లను మొక్కకండి. ఉపవాసాలు ఉండకండి. మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వని హిందూ మతంలోని ఎలాంటి నియమ, నిష్టలను పాటించకండి. దేవుడిని నేరుగా చేరుకోవడానికి ఎలాంటి మార్గం లేదు" అంటూ రాంపాల్ ఉపన్యాసాలు ఇచ్చేవారు. 
 
అలా.. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన భక్తుల సంఖ్య పెరగడాన్ని చూసిన ఉన్నత శ్రేణి ప్రజలు కూడా ఆయనకు భక్తులుగా మారిపోయారు. ఇలాంటి వారిలో మాజీ ముఖ్యమంత్రి సతీమణి కూడా ఒకరు. అలా ప్రశాంతంగా సాగిపోతున్న తన జీవితంలో 2006 సంవత్సరం నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. 
 
ముఖ్యంగా.. మరో స్వామీజీపై రాంపాల్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రోహ్ తక్ జిల్లా మత ఘర్షణలకు దారితీశాయి. ఈ ఘర్షణల్లో ఓ వ్యక్తి తుపాకీ గుళ్లకు బలయ్యాడు. ఫలితంగా ఆయనను ఈ జిల్లాలోని కరొంతా ఆశ్రమం నుంచి పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారు. పైగా రాంపాల్‌కు వ్యతిరేకంగా తొలి పోలీసు కేసు నమోదైంది. కేసు విషయంలో కోర్టుకు హాజరు కాకుండా, ఏదో ఒక కారణం చెబుతూ రాంపాల్ తప్పించుకునేవాడు. కోర్టు ఏకంగా 43 సార్లు వారెంట్‌లు జారీ చేసింది.
 
కాలక్రమంలో, ఆశ్రమం చుట్టూ రాంపాల్ సొంత సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఎన్నిసార్లు వారెంట్‌లు జారీ చేసినా కోర్టుకు హాజరుకాకపోవడంతో... చివరకు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ దఫా రాంపాల్‌ను అరెస్టు చేసిన కోర్టులో హాజరుపరచకపోతే హర్యానా రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్ కోర్టు బోనెక్కాల్సి వస్తుందంటా ఘాటుగా హెచ్చరించింది. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. రాంపాల్‌ను అరెస్టు చేసేందుకు మంగళవారం ఉదయం తొలి ప్రయత్నం చేయగా, వారికి ఊహించిన విధంగా రాంపాల్ షాకిచ్చారు. బాబా అనుచరులు ఏకంగా పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆశ్రమమంతా ఉద్రిక్తత నెలకొంది. ఈ కాల్పుల్లో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. భారీ సంఖ్యలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. చివరకు పోలీసులు బాబా రాంపాల్‌ను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, అతని అనుచరులు 450 మందిని అదుపులోకి తీసుకున్నారు.