శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : మంగళవారం, 12 మే 2015 (11:20 IST)

జయకు ఊరట.. రాజ్యసభలో మోడీ బిల్లులకు మోక్షం

వరండాలో స్విచ్ వేస్తే హాల్లో లైటు వెలగడమంటే ఇదే మరి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు కర్నాటక హైకోర్టు నుంచి ఊరట లభించింది. ప్రధాని నరేంద్రమోదీకి మరోరకంగా సడలింపు దక్కిందనే చెప్పాలి. ఆయన రాజ్యసభలో ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు ఇక మోక్షం లభించినట్లే.. ఒకవైపు అన్నాడిఎంకే వర్గాలు సంబరాలు చేసుకుంటుంటే, కేంద్రంలోని బీజేపీ వర్గాలు రిలాక్స్ అవుతున్నాయి. ఆమెకు బెయిలొస్తే మోడీకి అంత రిలాక్స్ ఏమిటనేది ప్రశ్న రండీ తెలుసుకుందాం. 
 
మోడీ ప్రభుత్వం రాజ్యసభలో ఆరు బిల్లులు ప్రవేశపెట్టింది. పార్లమెంటులో పూర్తి స్థాయి మెజారిటీ కలిగి ఉన్న ఎన్డీయే రాజ్యసభలో అంత మెజారిటీ లేదు. దీంతో కాంగ్రెస్ ప్రతిమారు రాజ్యసభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. అక్కడ ప్రస్తుతం ఆరు బిల్లులు పెండింగులో ఉన్నాయి.   భూ సంస్కరణల బిల్లు, నల్లధనం, దేశవ్యాప్తంగా ఒకే పన్నుల విధానానికి (జీఎస్‌టీ) సంబంధించిన బిల్లులు ఆమోదం పొందాల్సి ఉంటుంది. 
 
ఒకానొక దశలో ఆయా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ సంఘానికి నివేదించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలా అయితే ఏన్డీయేకు మెజారిటీ లభిస్తుంది. అయితే ఈ లోగానే జయ నిర్థోషిగా బయటపడడంతో ఎన్‌డీఏ సర్కారుకు కాస్త ఊరటనిచ్చిందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కీలకమైన ఆరు బిల్లులను ఈ సమావేశాల్లోనే సభ ఆమోదించేలా చూడాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఆ క్రమంలో ఆన్నాడీఎంకే మద్దతు కీలకంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వం నిరాటంకంగా నెగ్గుకురావాలంటే ఖచ్చితంగా అన్నాడీఎంకే సహకారాన్ని కోరాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ రెండు రాజకీయ వర్గాల మధ్య రాజీ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ బిల్లులకు అన్నాడిఎంకే మద్దతిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే సంయుక్త పార్లమెంటరీ సంఘానికి నివేదించాల్సిన అవసరం ఉండదు. అన్నా డిఎంకే మద్దతుతో బిల్లుల ఆమోదానికి రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే నెగ్గుకురావడానికి అవరోధాలు ఉండబోవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
మరోవైపు పీకల్లోతు కష్టాల్లోంచి బయట పడ్డ జయలలితకు కూడా మోడీ ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరం ఉంది. మరో ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎన్‌డీఏ ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్లాలనే ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే లోక్‌సభలో కాంగ్రెస్ అభ్యర్థనను కాదని భూసంస్కరణల బిల్లుకు అన్నాడీఏంకే సభ్యులు మద్ధతునిచ్చారు. తమ పార్టీ అధినేత్రి సూచన మేరకు వారు ప్రభుత్వానికి అండగా నిలిచారు. రాజ్యసభలోనూ వీరి సహకారంతో లభిస్తుందనే భావిస్తున్నారు. అందుకే జయకు ఊరట.. మోడీకి రిలాక్స్.