గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By chj
Last Modified: మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (13:19 IST)

'ధర్మపత్ని'తో మొదలై 'మనం' వరకూ ప్రయాణం... ది గ్రేట్ స్టార్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి నేడు

అక్కినేని నాగేశ్వర రావు (1924-2014) ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత. వరి చేలలోనుండి, నాటకరంగం ద్వారా కళారంగంలోకి వచ్చిన వ్యక్తి. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల

అక్కినేని నాగేశ్వర రావు (1924-2014) ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత. వరి చేలలోనుండి, నాటకరంగం ద్వారా కళారంగంలోకి వచ్చిన వ్యక్తి. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య ద్వారా విజయవాడ రైల్వే స్టేషన్లో గుర్తించబడ్డాడు. ధర్మపత్ని సినిమాతో నటుడిగా కెరీర్‌ని ఆరంభించి దాదాపు 75 ఏళ్ల సుదీర్ఘమైన తన నటనా జీవితంలో 225కి పైగా సినిమాల్లో నటించిన బహుదూర బాటసారి మన అక్కినేని. 
 
పుల్లయ్య దర్శకత్వంలో ధర్మపత్ని సినిమాలో మొదటిసారి అక్కినేని నాగేశ్వరరావు తెరపై కనిపించారు. 19 ఏళ్ల వయసులో సీతారామరాజు జననంతో హీరోగా మొదటి సక్సెస్ అందుకున్నారు. ఎన్.టి.ఆర్‌తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు. మూడు ఫిల్మ్‌ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. భారతీయ సినిరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్‌తో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు.
 
అక్కినేని 1923 సెప్టెంబర్ 20 వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురం లో జన్మించాడు. చిన్ననాటినుండే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు లో 1933 ఆగస్టు 14న ఆమె జన్మించారు. ఆమెపేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశారు.
 
అక్కినేని అంటే ఓ నట శిఖరం. తెరమీద అలుపెరుగక నటిస్తూ ముందుకెళ్తున్న ఓ సంపూర్ణ నటతత్త్వం. అవార్డులంటే అక్కినేనిగా పేరుపడినా... అవి తనను వరించడానికి కేవలం ఒకే ఒక్క సూత్రం పాటిస్తూ ముందుకెళ్ళాడీ సూత్రధారి. అదే పాత్ర ఏదైనా.. ఆ పాత్రకు తగినట్టుగా అందులో ఇమిడిపోయి- దానికి ఇదివరకెన్నడూ లేని వన్నెలద్దడం ఆయన ప్రత్యేకత. ఎన్నో రొమాంటిక్ రోల్స్ వేస్తూ వచ్చిన అక్కినేని... డూడూ బసవన్నను ఆడించే డీ గ్లామరైజ్డ్ పాత్రలనూ పోషించి సాటి లేని మేటిగా పేరు పొందాడాయన. 
 
అక్కినేని ఆనాటికి పెద్ద స్టార్ నటుడయినా... సాటి స్టార్ నటులతో ఎన్నో చిత్రాలను చేశాడు. అందులో మిస్సమ్మ, గుండమ్మ కథ, మాయాబజార్, వంటి సూపర్ డూపర్ హిట్లు అనేకం. ఆనాడు ఎఎన్నార్ తో  సమానంగా పోటీ పడుతున్న మరో మహానటుడు ఎన్టీఆర్.  ఎన్టీఆర్  ఒక పక్క శ్రీరామ, శ్రీకృష్ణ వంటి పాత్రలతో ప్రేక్షక జనుల పాలిట దేవదేవుడిగా చెలరేగి పోతుంటే... మదిలో ప్రేక్షకులనే దైవంగా భావించి... ఎందరో భక్త శిఖామణుల పాత్రలను పోషించి... పోటీని రసవత్తరం చేశాడు ఎఎన్నార్. అలా తెరమీది పోటీని తెలివిగా అధిగమించిన ఘనపాటి అక్కినేని.
 
తన నటనతో, చలాకీతనంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళా లోకపు అరాధ్యునిగా నిలిచారు అక్కినేని నాగేశ్వరరావు. అభినయంతో మాత్రమే నడుస్తున్న సినిమాలకి నాట్యం జోడించిన తొలి హీరో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. అయన నుంచే పాటలకు కొత్త కళ వచ్చింది అనడంతో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వారి నాట్యానికి ఆబాల గోపాలం ఆనందంతో నర్తించారు. ఏఎన్నార్ విజయాలు తెలుగు సినిమా స్టామినానే మార్చేశారు. 90 ఏళ్ల వయసులో కూడా తన తనయుడు నాగార్జున, మనువడు నాగచైతన్యతో కలసి నటించిన చిత్రం మనం. ఈ సినిమానే ఆఖరి సినిమా అవడం, మూడు తరాల అద్భుతమైన సినిమా అవడంతో ఈ సినిమాకి ప్రేక్షకులు అఖండ విజయాన్ని అందించారు. 91 ఏళ్ల వయసులో అభిమానులను శోక సంద్రంలో ముంచుతూ జనవరి 22న తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయి శాశ్వత నిద్రలోకి ఉపక్రమించారు అక్కినేని నాగేశ్వరరావు.