బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2015 (18:31 IST)

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి: చంద్రబాబు డిసైడ్ చేసేశారా?

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఓటుకు నోటు కేసులో బాగా ఫేమస్ కావడానికి తోడు.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు చుక్కలు చూపించే ఒక్క మగాడు రేవంత్ రెడ్డినేనని ఆయనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని చంద్రబాబు డిసైడైపోయారని తెలిసింది. ఈ ప్రచారం ఎప్పటి నుంచో ఉన్నా.. రేవంత్ పై కోర్టు ఆంక్షలు ఒక్కొక్కటిగా తొలగిపోయిన నేపథ్యంలో ఈ జోరు మరింత ఊపందుకుంది. 
 
అయితే రేవంత్ రెడ్డిని టీడీపీ తెలంగాణ అధినేతగా ప్రకటిస్తే సీనియర్లలో అసంతృప్తి ఏర్పడే ఛాన్సుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పార్టీలో చాలా జూనియర్.. ఆయనకంటే సీనియర్లు పార్టీలో ఉన్నారు. వారిని పక్కనబెట్టి చంద్రబాబు రేవంత్‌కు పగ్గాలిస్తే బాగుండదని వారంటున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు.. ఇలా సీనియర్ల జాబితా చాలానే ఉంది. కానీ ఎందుకో చంద్రబాబు రేవంత్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి అయితేనే సమర్థంగా ఎదుర్కోగలుగుతారని చంద్రబాబు భావిస్తున్నారు.  
 
అందుకే తగ్గట్టునే రేవంత్ రెడ్డి కూడా ఇటీవల కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి చేసినంత ఘాటు వ్యాఖ్యలు కేసీఆర్ సర్కారుపై ఎవరూ చేయడంలేదు. కానీ చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉన్నా.. సీనియర్లను కాదని జూనియర్‌కు పగ్గాలు అప్పగిస్తే పార్టీలో విబేధాలు తీవ్రమయ్యే ఛాన్సుంది. అందుకే బాబు ఓ కొత్త ఐడియా కనిపెట్టారు. 
 
కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు కొత్త విధానం అమల్లోకి తెస్తున్నారు. పార్టీ యాక్టివ్ కార్యకర్తల నుంచి ఐవిఆర్ఎస్ విధానం ద్వారా ఒపీనియన్ తీసుకుంటారట. తెలంగాణలోని క్రియాశీల సభ్యుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నారట. అలాచేస్తే రేవంత్ రెడ్డికే క్రేజ్ లభిస్తుందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తే పార్టీకి ఊతమిచ్చినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. మరి రేవంత్ రెడ్డి తెలంగాణ టీడీపీ లీడర్ అవుతారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.