గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : ఆదివారం, 10 జనవరి 2016 (10:32 IST)

కాలు దువ్వుతున్న 'పందెంకోళ్ళు'... రూ.కోట్ల బెట్టింగ్స్‌కు పందెం రాయుళ్ళ సిద్ధం!

సంక్రాంతి పండగ సమీపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే భోగి మంటలు, మకర సంక్రాంతి వెలుగులు దేశవ్యాప్తంగా దర్శనమివ్వనున్నాయి. అయితే, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు.. మరికొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి ఫీవర్‌ అపుడే మొదలైంది. సనాతన సంప్రదాయాలను చాటి చెప్పే పండుగ కావడంతో ఇంటి లోగిళ్ళను రంగవల్లుల అలంకరించి,  అతిథులకు స్వాగతం పలికేందుకు పల్లెలు, పట్టణాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. 
 
అదేసమయంలో కోడి పందాలను నిర్వహించేందుకు పందెం రాయుళ్లు సిద్ధమైపోయారు. నిజానికి సంక్రాంతి పండుగ సీజన్‌లో కోడి పందేలా జోరు అంతాఇంతా కాదు. ఖాకీలు 'నై' అంటుంటే పందెం రాయుళ్లు మాత్రం 'సై' అంటున్నారు. పండుగ ముసుగులో భారీగా కోడి పందాలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం వేదికలు శరవేగంగా సిద్ధం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. 
 
సంక్రాంతిని అడ్డుపెట్టుకుని రెచ్చిపోయేందుకు, పెద్ద ఎత్తున పందాలు నిర్వహించేందుకు కోడిపందాల రాయుళ్లు సిద్ధమయ్యారు. కోడిపందాలు నిర్వహించేందుకు అనుమతినిచ్చేది లేదని పోలీసు ఉన్నతాధికారులు తెగేసి చెప్తున్నప్పటికి పందెం రాయుళ్లు మాత్రం పందాల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. పశ్చిమగోదావరి డెల్టాలోని చింతలపూడి, జంగారెడ్డిగూడెం, మెట్టలోని లింగపాలెం, కొణిజర్ల, భీమవరం, అయిభీమవరం, జువ్వలపాలెం, కలగం పూడితోపాటు విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాలను పందాలకు సిద్ధం చేస్తున్నారు. మామిడితోటల్లో ఖాళీ స్థలాలను రోలర్లతో చదును చేయిస్తున్నారు. ఫెన్సింగ్‌లు వేయించి పందెం రింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
 
ఇంతేకాదు పందాలు చూసేందుకు వచ్చిన అతిథుల కోసం ఫైవ్‌స్టార్‌ సదుపాయాలు కల్పించేందుకు కూడా కోడిపందాల నిర్వాహకులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. కోడి పందాలతోపాటు పేకాట, గుండాట వంటి వివిధ రకాల జూదాలతో పాటు నోరూరించే పసందైన వంటకాలను కూడా సిద్ధం చేయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసుల నిఘా నేత్రాలకు మాత్రం అవేమీ కనిపించక పోవడంగమనార్హం.