గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శనివారం, 20 సెప్టెంబరు 2014 (14:25 IST)

కేసీఆర్ ను స్కాట్లండ్ పంపిస్తే కేక పెట్టించి ముక్క తెచ్చేవారట...

స్కాట్లండ్ వేర్పాటువాదుల కల చెదిరింది. గ్రేట్ బ్రిటన్ నుంచి విడిపోతామంటూ వేర్పాటువాదులు చేసిన ఆందోళన నిప్పుపై భారీ వర్షమే కురిసింది. స్కాట్లాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రేట్ బ్రిటన్ తో కలిసే ఉంటుందని అక్కడి ప్రజలు ఓట్ చేయడంతో విభజనవాదం వీగిపోయింది. ఐతే ఇక్కడ... అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం స్కాట్లండ్ ఫలితంపై కాస్త ఉత్కంఠగానే ఎదురుచూశారు. 
 
తెలంగాణ వాదులు స్కాట్లండ్ ఖచ్చితంగా విడిపోతుందని అంచనా వేస్తే సమైక్యవాదులు మాత్రం కలిసే ఉంటుందని పందేలు వేశారు. మొత్తానికి అక్కడి ప్రజానీకం మాత్రం తాము గ్రేట్ బ్రిటన్ తోనే కలిసి ఉంటామని తీర్పు ఇచ్చారు. స్కాట్లండుపై మొత్తం 30 చోట్ల ఓటింగ్ జరిగితే 26 చోట్ల సమైక్యవాదం నెగ్గింది. 4 చోట్ల మాత్రమే విభజనవాదులు పైచేయి సాధించారు. 
 
కానీ ఓటింగ్ శాతం చూస్తే మటుకు విభజనకు అనుకూలంగా 45 శాతం, వ్యతిరేకంగా 55 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ సరళిపై తెలంగాణవాదులు చెపుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అప్పట్లో ఓటింగ్ పెడితే ఇలాంటి ఫలితమే వచ్చి ఉండేదనీ, ఎందుకంటే విభజన కోరుకుంటున్నవారు తక్కువ సంఖ్యలోనే ఉంటారని చెపుతున్నారట. దీనిపై సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోనూ చర్చ జరిగింది. 
 
కొంతమంది మాత్రం... కేసీఆర్ తో స్కాట్లండుకు రెండుమూడు సభలు జరిపి ఉంటే ఖచ్చితంగా విభజనవాదం నెగ్గి కూర్చుని ఉండేదని సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్ పవర్ వాళ్లకు తెలియదు కదా మరి. తెలిసి ఉన్నట్లయితే పిలిచి ఉండేవారేమో అనే కామెంట్లు వినవస్తున్నాయి.