మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By chj
Last Modified: మంగళవారం, 8 నవంబరు 2016 (15:43 IST)

అద్వానీ(జన్మదినం) లివింగ్ లెజెండ్, నడుస్తున్న చరిత్ర... గురుదక్షిణగా మోదీ ఏమిస్తారు...?

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నాలుగు దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీకి ఎదురు నిలిచి, ఆ పార్టీపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించి చరిత్ర సృష్టించిన పార్టీ భారతీయ జనతాపార్టీ. భారతీయ జనతా పార్టీ స్థాపించిన నా

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నాలుగు దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీకి ఎదురు నిలిచి, ఆ పార్టీపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించి చరిత్ర సృష్టించిన పార్టీ భారతీయ జనతాపార్టీ. భారతీయ జనతా పార్టీ స్థాపించిన నాటి నుండి తిరుగులేని బలంతో అధికారం చేపట్టిన నేటివరకు అందులో ప్రధాన పాత్ర పోషించిన లాల్ కృష్ణ అద్వానీ జన్మదినం నేడు.
 
అద్వానీ అఖండ భారత్‌లో, నేటి పాకిస్తాన్‌లో కరాచీలో పుట్టారు. ఉన్నత విద్య కోసం ముంబై వచ్చారు. స్వాతంత్య్రోద్యమ సమయంలోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి, పద్నాలుగేళ్ల ప్రాయంలోనే జీవితాన్ని జాతి సేవకు అంకితం చేశారు. ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి, రెండేళ్ల పాటు అద్వానీని జైల్లో పెట్టారు. ఆ తర్వాత శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి చురుగ్గా పనిచేశారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సహకారంతో మంచి కార్యకర్తగా పేరుపొంది, రాజస్థాన్ జనసంఘ్ పార్టీ అధ్యక్షుడికి సలహాదారునిగా నియమించబడ్డారు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలలో జన సంఘ్ తరపున ఎన్నికై మరుసటి సంవత్సరమే ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్  అధ్యక్షుడయ్యారు. 1970లో రాజ్యసభ ఎన్నికైన అద్వానీ జనసంఘ్‌లో ప్రముఖ పాత్ర వహించి దేశ ప్రజలను ఆకర్షించారు. 1975లో మీసా చట్టం కింద అరెస్ట్ అయ్యారు.
 
ఎమర్జెన్సీ కాలంలో తన అనుభవాలను వివరిస్తూ అద్వానీ ‘ది ప్రిజనర్స్ స్క్రాప్ బుక్ ’ గ్రంథాన్ని రచించారు. 1976లో జైలు నుంచే ఆయన రాజ్యసభకు ఎన్నికైనారు. ఎమర్జెన్సీ అనంతరం జనసంఘ్ పార్టీ జనతా పార్టీలో విలీనం కావడంతో అద్వానీ 1977లో జనతా పార్టీ తరపున పోటీ చేసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖామంత్రిగా పనిచేశారు. ఆ విధంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రిగా పనిచేసిన మొట్టమొదటి కాంగ్రెసేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు. జనతా పార్టీ పతనంతో జనసంఘ్ పార్టీ వేరుపడి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించడంతో అద్వానీకి దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం కల్గింది.
 
ఐతే ప్రారంభంలో ఆ పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 1982లో పార్టీకి లభించిన లోక్‌సభ స్థానాల సంఖ్య రెండు మాత్రమే. 1986లో అద్వానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ స్థానాల సంఖ్యను 86కు పెంచగలిగినాడు. అద్వానీ లోక్‌సభలోకి తొలిసారిగా ప్రవేశించినది కూడా 1989లోనే. 1970లో తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులోకి అడుగు పెట్టిన ఆయన నాలుగుసార్లు రాజ్యసభకు, ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. బీజేపీ నిర్మాణంలో అద్వానీ పాత్ర అనన్య సామాన్యం. ముఖ్యంగా 80, 90 దశకాల్లో అటల్ బిహారీ వాజ్‌పేయితో కలసి ఆయన బీజేపీకి సుస్థిరమైన పునాదులు వేశారు. 
 
అద్వానీ కృషి, పట్టుదల ఫలితమే రెండు లోక్‌సభ స్థానాలుగల బీజేపీ 1989 ఎన్నికల్లో 86 సీట్లు గెల్చుకుంది. ఆ తర్వాత 121, 161.. ఇలా స్థానాలు పెంచుకుంటూ ఢిల్లీ గద్దెను సొంతం చేసుకుంది. భాజపా, అనేక ఇతర పార్టీల మద్దతుతో 1999 నుండి 2004 వరకు భారత కేంద్ర ప్రభుత్వాన్ని పాలించింది. అటల్ బిహారీ వాజపాయి ప్రభుత్వంలో 3 పర్యాయాలు కూడా కేంద్రమంత్రిగా హోంశాఖను సమర్థవంతంగా నిర్వహించారు. 1998-2004 మధ్య ఉపప్రధాని పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో ప్రధాన పార్టీ అయిన భాజపా, భారత పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షముగా 2014 మే వరకు కొనసాగింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో లోక్ సభ లోని 543 స్థానాలకు మునుపెన్నడూ లేనన్ని 281 స్థానాలు గెలుచుకున్న భాజపా (మిత్ర పక్షాలతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య కూటమికి 337 స్థానాలు) నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారం చేబట్టింది. సొంత బలంతో బీజేపీ దేశాన్ని పాలించాలనే అద్వానీ కల 2014లో సాకారమైంది. 2008లో "మై కంట్రీ, మై లైఫ్" పేరుతో స్వీయచరిత్రను విడుదల కావించాడు. 986 పేజీల పుస్తకంలో తన రాజకీయ జీవితపు అంతరంగాన్ని విపులంగా వివరించాడు.
 
2007, డిసెంబర్ 10  నాడు పార్టీ కేంద్ర కార్యవర్గం సమావేశమై అటల్ బిహారీ వాజపాయి వారసుడిగా అద్వానీ పేరును ఖరారు చేసింది. అనారోగ్య కారణాలపై నాయకత్వ బాధ్యతల నుంచి వైదొల్గాలని నిర్ణయించుకున్నందున, లోక్ సభకు మధ్యంతర ఎన్నికలు రావచ్చన్న దృష్టితో అద్వానీ లాంటి వ్యక్తికి ఈ బాధ్యతలు కట్టబెట్టాలని వాజపేయి భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డుకు సందేశం పంపారు. అద్వానీ అభ్యర్థిత్వాన్ని బోర్డు కూడా ఆమోదించింది. పాకిస్తాన్ పర్యటనలో జిన్నాకు లౌకికవాదిగా పేర్కొని సంఘ్ పరివార్‌చే ఆగ్రహానికి గురైన అద్వానీ ఆ తర్వాత అధ్యక్ష పదవికి కూడా వదులుకోవాల్సి వచ్చింది. కాని అదే సంఘ్ పరివార్ అద్వానీకి మద్దతు ప్రకటించింది. లోక్‌సభలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే అద్వానీ తాను ప్రధాని పదవికి సహజ అభ్యర్థిగా చెప్పుకున్నారు. దీంతో సహచరులు ఆయనపై తిరగబడ్డారు. మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా వంటి నేతలు అద్వానీ ప్రకటనపై విమర్శలు గుప్పించారు. అనంతర పరిణామాల దృష్ట్యా మురళీ మనోహర్ జోషినే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడం విశేషం.
 
2014 ఎన్నికల్లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీని పార్టీ ప్రకటించినప్పుడు అద్వానీ అసంతృప్తి చెందారు. ఆయన్ని బుజ్జగించడానికి పార్టీ నాయకులు తంటాలు పడాల్సి వచ్చింది. స్వయంగా నరేంద్ర మోదీ వెళ్లి అద్వానీ ఆశీస్సులు అడిగేసరికి ఆయన కాదనలేకపోయారు. అయిష్టంగానే నరేంద్ర మోదీ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. అయితే ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అద్వానీ క్రమంగా వాస్తవాన్ని అర్థం చేసుకుని మోదీతో కలసి పనిచేయడం ప్రారంభించారు. మోదీ కూడా ఏ పని చేసినా అద్వానీ సలహా తీసుకుంటూ వచ్చారు. కాంగ్రెస్‌లోని ఒక వర్గం అద్వానీని మోదీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా అద్వానీ సంయమనం పాటించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోదీ హవా నడుస్తోంది. ఆ విషయన్ని అద్వానీ సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. ఈ సమయంలో మోదీకి తనలాంటి వ్యక్తి సపోర్ట్ అవసరమని భావించారు. అందుకే పెద్దమనసు చేసుకుని మోదీకి మద్దతు పల్కారు. నరేంద్రమోదీ సైతం ఏనాడు అద్వానీని బహిరంగా విమర్శించిన సందర్భాలు లేవు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది అద్వానీయేనని అనేక పర్యాయాలు ఆయనే ప్రకటించారు. గుజరాత్ అల్లర్ల అనంతరం పార్టీ తనను దూరంగా పెట్టిన సందర్భంలో అద్వానీ మాత్రం మోదీ వైపే ఉన్నారు.
 
నైతిక విలువలు కలిగిన రాజకీయ నాయకునిగా అద్వానీ ప్రజల ప్రశంసలు పొందారు. అందుకే భారతీయులు అద్వానీని నమ్మారు. ఆయన ఆవేశానికి అర్ధముందని గ్రహించారు. జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయల లాగా వాజ్‌పేయి, అద్వానీలు ఐదు దశాబ్దాలపాటు పని చేశారు. దేశ రాజకీయాల్లో బీజేపీని తిరుగులేని శక్తిగా తయారు చేశారు. నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ మొదలైన నేటితరం నాయకులను తొలినాళ్లలోనే గుర్తించి, వారి ప్రతిభను ప్రోత్సహించినది కూడా అద్వానీయే. ఆరు దశాబ్దాల ప్రజా జీవితంలో మచ్చలేని ఉక్కుమనిషిగా, విలువలే శ్వాసగా, ప్రజాస్వామ్య పరిరక్షణకు అంకితమై, విశాల జాతీయ దృక్పథంతో మొదట దేశం, తర్వాత పార్టీ... చివరగా వ్యక్తిగతం అని నినదిస్తున్న కురు వృద్ధుడు ఆయన.
 
1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌కు భారత్ సరైన సమాధానం ఇవ్వడంలో అప్పటి దేశ హోంశాఖ మంత్రిగా ఉన్న అద్వానీ పాత్ర కూడా ఉంది. ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆది నుండి రాజకీయాలలో ప్రోత్సహించి, అతని శక్తిసామర్థ్యాల పైన పూర్తి స్థాయి నమ్మకముంచిన వ్యక్తి అద్వానీ. ప్రతి రాష్ట్రంతోనూ, దాదాపు ప్రతి ప్రాంతంతోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయని, స్వయంగా ఆయన ఆ ప్రాంతాలన్నిటిలో తిరిగారని అంటే నమ్మలేకపోవచ్చు. స్వాతంత్య్ర కాలం నాటి గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్, వల్లభ్ భాయ్ పటేల్, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్రబోస్, జయప్రకాశ్ నారాయణ్ లాంటి నాయకులను పక్కనపెడితే.. ఆ తర్వాత దేశం యావత్తూ గర్వించదగ్గ రాజకీయ నాయకులు పెద్దగా కనబడరు. 90వ వసంతంలోకి అడుగు పెడుతున్న అద్వానీ నేటి తరాలకు లివింగ్ లెజెండ్, నడుస్తున్న చరిత్ర.
 
ఐతే అంత గొప్ప నాయకుడైన అద్వానీకి ప్రధాని కావాలనే కోరిక మాత్రమే తీరలేదు. బాబ్రీ మసీదు కూల్చివేత భాజపాకు ఎంతగానో కలిసొచ్చింది గానీ వ్యక్తిగతంగా అద్వానీ నష్టపోయారు. ఆయన ప్రధాని కాకపోవడానికి ఈ ఉదంతమే శాపంగా మారింది. ఆయనకు రాష్ట్రపతి పదివి ఇస్తే బాగుంటుందని చాలామంది ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. రాష్ట్రపతి పదవిని గురుదక్షణగా అద్వానీకి ఇవ్వాలనే ఆలోచన మోదీకి కూడా ఉందని చాలామంది అంటుంటారు. 90 దశకంలో ప్రవేశించిన ఈ రాజకీయ కురువృద్ధునికి ఆ పదవీ స్వీకరించే అవకాశం వస్తుందో.. లేదో.... ఒకవేళ వచ్చినా ఆయన స్వీకరిస్తారో... లేదో.. కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా భారత ప్రజాస్వామ్య రాజకీయాలలో అద్వానీ కీర్తి మాత్రం శాశ్వతం.
 
-డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్, తెలుగు లెక్చరర్, తెనాలి