గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : సోమవారం, 25 మే 2015 (06:09 IST)

అధినేతపై ధిక్కార స్వరం.. టీడీపీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై పార్టీ సీనియర్లు ధిక్కారస్వరం పెంచుతున్నారు. ఒంటి చేత్తో పార్టీని. కంటి చూపుతోనే నాయకులను కంట్రోల్ చేసే చంద్రబాబుకు కొత్త షాక్ లు తగులుతున్నాయి. చిత్తూరులో శివప్రసాద్... కర్నూలులో కేఈ... విజయనగరంలో పత్తివాడ ఇలా ఒకరి తరువాత ఒకరు చంద్రబాబు తీరును తూర్పారబడుతున్నారు. ఇవి చంద్రబాబును ఇరుకున పెట్టే పరస్థితులే కల్పిస్తున్నాయి. ఎప్పుడూ ఎన్నడూ తిరుగుబాటును అరిగించుకోలేని చంద్రబాబు సంజాయిషీ చెప్పుకోవాల్సిన స్థితి ఏర్పడింది. 
 
సాధారణ ఎన్నికలలో కర్నూలులో తక్కువ సీట్లు వచ్చాయని చంద్రబాబు తమ పైన దృష్టి సారించడం లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. మారుతున్న రాజకీయపరిస్థితులను అనుసరించి చంద్రబాబు జిల్లాల వ్యాప్తంగా మార్పులు చేస్తున్నారు. తక్కువ సీట్లు వచ్చిన జిల్లాల నాయకులను సూటపోటి మాటలు మాట్లాడతున్నారు. కర్నూలు జిల్లాలో కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చాయని, కాబట్టి అక్కడి నాయకులను, పార్టీని పటిష్ట పరచాలని చెప్పాల్సిన నాయకుడు సాధింపు మాటలు మొదలు పెట్టారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను వెనుకేసుకు రావడం అదే సమయంలో వారిని తెగడడం వారిని ఇబ్బంది పెడుతూ వచ్చాయి.
 
పైగా ప్రాధాన్యతను కూడా తగ్గిస్తూ వచ్చారు. సీనియర్ నాయకుడుగా ఉన్న కేఈ క్రిష్ణమూర్తికి ఇవి రుచించలేదు. పైగా జిల్లాలో ఆయన వర్గీయులకు బదులు శిల్పచక్రవర్తి రెడ్డికి జిల్లా పగ్గాలను అప్పగించారు. అందుకు ముందు రాజధాని విషయంలో మంత్రి నారాయణకు ప్రాధాన్యత కల్పించిన విషయంలోనూ తేడా వచ్చింది. అప్పటి నుంచే కాస్త విభేదాలున్నాయి. వాటికి తోడు చంద్రబాబు మాట్లాడే మాటలు ఆయనను బాధించాయి. దీంతో కర్నూలు మినీ మహనాడు ఆయన తన అసంతృప్తి వెల్లకక్కాడు. 
 
అంతకు ముందు చంద్రబాబునాయుడుపై స్వంత జిల్లాకు చెందిన ఎంపి శివప్రసాద్ కూడా పెదవి విరిచారు. ఇది కూడా అదే తరహా అసంతృప్తి. కనిపించినప్పుడు జిల్లా నుంచి తక్కువ సీట్లు వచ్చాయని అంటుంటారని తెలిపారు. అయితే ఇది టఫ్ జిల్లా అనే విషయం ఆయనకు తెలసన్నారు. అయితే అప్పటికీ 6 సీట్లు వచ్చాయన్నారు. కానీ చద్రబాబు మాత్రం తక్కువ వచ్చాయనే సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారనే మాటే చెప్పారు. చిత్తూరు జిల్లాలో పార్టీ సర్వ నాశనం కాకుండా కాపాడుకుంటామని ఆయన అనడం విశేషం. అదే సభలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కూడా చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేశారు. మాటలు చెప్పే వారికి మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నారని పని చేసే వారికి అవకాశం లేదనే అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
కర్నూలులో కేఈ క్రిష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ గానే స్పందించారు. నాల్కరుచుకోవాల్సిన చంద్రబాబు తాను కర్పూలు జిల్లాకు తాను ఎంతో చేశానని చేస్తున్నానని చెప్పుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగానే, విజయనగరం జిల్లా మినీ మహానాడులో టీడీపీ సీనియర్ నేత పతివాడ నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా వాసులను సీఎం మంచివారు అని అంటుంటారని, అందుకే మమ్మల్ని ఇక్కడే ఉంచారని వ్యంగ్యస్త్రాలు వేశారు. తనకు పదవి రాకపోవడంపై ఆయన పైవిధంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య కళాశాల విషయంలో చంద్రబాబు మాటల్లో స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు.