శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2016 (12:22 IST)

తరలిపోతున్న శేషాచల వృక్షసంపద.. తిరుపతి అటవీశాఖలో ఇంటి దొంగలు...

ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేరంటారు. ఆ సామెత కరెక్టుగా తిరుపతి అటవీశాఖకు సరిపోతుంది. శేషాచలంలో ఉన్న అరుదైన వృక్షసంపద తరలిపోవడమే ప్రధాన కారణం ఎర్రచందనం స్మగర్లయితే వారికి దగ్గరుండి సహకరించేది కొంతమంది అటవీశాఖాధికారులేనన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డబ్బులకు కక్కుర్తి పడుతున్న కొంతమంది అటవీశాఖాధికారులు అక్రమార్కులకు అండగా ఉంటూ వృక్షసంపదను యధేచ్చగా సరిహద్దులను దాటించేస్తున్నారు. 
 
తిరుపతి శేషాచలం అడవులు. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన అడవుల్లో ఒకటి. అత్యంత అరుదైన వృక్ష సంపద ఈ ప్రాంతంలో ఉంది. ఆసియాలోనే ఎక్కడా లేని కొన్ని వృక్షాలతో పాటు వన్యమృగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు శేషాచలం అడవుల గొప్పతనాన్ని మాటల్లో చెప్పలేకపోయారు. అలాంటి గొప్ప ప్రాముఖ్యత కలిగింది శేషాచలం అడవులు. ప్రధానంగా ఈ ప్రాంతంలో అరుదుగా లభించేది ఎర్రచందనం. ఎర్రచందనం చెట్లకు విదేశాల్లో రూ.కోట్లలో లెక్కపలుకుతుంది. దీంతో గత కొన్నిసంవత్సరాలుగా ఎర్రచందనం చెట్లను యధేచ్ఛగా కొంతమంది ఎర్రచందనం స్మగర్లు అడ్డంగా కోట్లాది రూపాయలకు పడగలెత్తారు. 
 
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం గురించి పెద్దగా పట్టించుకోకపోయినా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఉక్కుపాదం మోపారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్‌ను నియమించి ఎప్పటికప్పుడు శేషాచలంను కాపాడే ప్రయత్నం చేశారు. అయినా సరే ఎర్రచందనం మాత్రం ఇప్పటికీ తరలిపోతూనే ఉంది. పోలీసులతో పాటు అటవీశాఖ, టాస్క్ ఫోర్స్ అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలనుకునే లోపల ఆ విషయం కాస్త మొత్తం ఎర్రచందనం స్మగర్లకు తెలిసిపోతోంది.
 
తాము కలిసి సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా తెలిసిపోతోందో తెలియక తలలు బద్దలు కొట్టుకునేవారు అటవీశాఖాధికారులు. అయితే రానురాను మెల్లగా అర్థమైంది ఉన్నతాధికారులకు. అది మొత్తం ఇంటి దొంగల పనేనని. కొంతమంది పోలీసు శాఖలోని వారితో పాటు అటవీశాఖ, టాస్క్‌ ఫోర్స్‌లోని వారు డబ్బులకు కక్కుర్తిపడి ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్నట్టు గుర్తించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. చాపకింద నీరులా విషయాలన్నింటినీ ఎర్రచందనం స్మగర్లకు విషయాలను చేరవేస్తున్నారు ఇంటి దొంగలు. దీంతో చాలా సులువుగా ఎర్రచందనం స్మగ్లర్లు ఎర్రచందనాన్ని యథేచ్ఛగా కొట్టి అటవీప్రాంతం నుంచి విదేశాలకు తరలించేస్తున్నారు. 
 
అంతేకాదు ఎర్రచందనం స్మగ్లర్లు రూ.కోట్లకు పడగ లెత్తడమే కాకుండా సహకరిస్తున్న ఇంటిదొంగలకు కావాల్సినంత డబ్బులు ఇస్తున్నారు.  ఉన్నతాధికారులు ఇంటిదొంగలను పట్టుకునేంత వరకు ఎర్రచందనం అక్రమ రవాణా ఆగదన్నది స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన సీఎం చంద్రబాబునాయుడు ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.