శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: మంగళవారం, 19 జులై 2016 (13:07 IST)

చంద్ర‌బాబు విదేశీ ఒప్పందాలు... రూ. 2 వేల కోట్ల భూమి రూ.200 కోట్లకే లీజుకు... మెడ‌కు చుట్టుకుంటాయా?

విజ‌య‌వాడ ‌: న‌వ్యాంధ్రప్ర‌దేశ్‌కు విదేశీ పెట్టుబ‌డులు వెల్లువ‌లా వ‌స్తున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు త‌ర‌చూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు... పెట్టుబ‌డుల కోసం కాలికి బ‌ల‌పాలు క‌ట్టుకుని విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. అయితే, ఇపుడు అవే విదేశీ ప‌ర్య‌ట‌న‌లు

విజ‌య‌వాడ ‌: న‌వ్యాంధ్రప్ర‌దేశ్‌కు విదేశీ పెట్టుబ‌డులు వెల్లువ‌లా వ‌స్తున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు త‌ర‌చూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు... పెట్టుబ‌డుల కోసం కాలికి బ‌ల‌పాలు క‌ట్టుకుని విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. అయితే, ఇపుడు అవే విదేశీ ప‌ర్య‌ట‌న‌లు... భ‌విష్య‌త్తులో స‌మ‌స్యాత్మ‌కం కానున్నాయా? విదేశీ పట్టుబ‌డులు... వివాదాస్ప‌దం కానున్నాయా? 
 
సింగ‌పూర్, జ‌పాన్, చైనా, ర‌ష్యా... ఇలా ప‌లు దేశాల్లో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌టించి పెట్టుబ‌డుల‌ను ఏపీకి ఆహ్వానిస్తున్నారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ, ఆయా దేశాల‌తో ఇండియాకు ఉన్న సంబంధ బాంధ‌వ్యాల‌ను బ‌ట్టి పెట్టుబ‌డుల రాక ఆధార‌ప‌డి ఉంటుంది. అంతేకాదు.. విదేశీ వ్య‌వ‌హారాలు ఎలా ఉన్నాయ‌నే ప‌రిస్థితిని కూడా ఎక్క‌డిక‌క్క‌డ బేరీజు వేసుకోవాలి. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్ర‌బాబు చైనా పర్య‌టించారు. అనంత‌రం ఇక్క‌డ విజ‌య‌వాడ‌లో చైనాకు చెందిన కంపెనీకి స్వ‌రాజ్ మైదాన్ స్థ‌లాన్నిఅప్ప‌గించేశారు. 
 
బంద‌రు రోడ్డులో ద‌శాబ్దాలుగా పి.డ‌బ్ల్యూడీ గ్రౌండ్స్‌గా వెలుగొందుతున్న ఈ కాస్ట్లీ ప్ర‌దేశంలో సిటీ స్క్వేర్ నిర్మిస్తామ‌ని చైనా కంపెనీ చెపుతోంది. అయితే, ఇదే దేశం ఇటీవ‌ల భార‌త్ న్యూక్లియ‌ర్ స‌ప్ల‌యర్స్ గ్రూప్‌లో ప్ర‌వేశాన్ని అడ్డుకున్న ప‌రిస్థితి. ఎన్.ఎస్.జి.లో భార‌త్‌కు స్థానం క‌ల్పించాల‌ని అమెరికా, ర‌ష్యా వంటి దేశాలు మ‌ద్ద‌తు ఇస్తే, చైనా మాత్రం దానిని తీవ్రంగా వ్య‌తిరేకించింది. భార‌త్‌ను న్యూక్లియ‌ర్ స‌ప్ల‌యర్స్ గ్రూప్‌లో చేరిస్తే, పాకిస్థాన్‌ను కూడా చేర్చాల్సిందే అంటూ మోకాల‌డ్డుతోంది. దీనితో ఆ దేశంతో ఒప్పందాల‌న్నిటిపై భార‌త ప్ర‌భుత్వం దృష్టి సారించే ప‌రిస్థితి త‌లెత్తుతోంది.
 
ఇప్ప‌టికే చైనా నుంచి వ‌స్తువుల రాక‌ను మోదీ ప్ర‌భుత్వం నిలువ‌రిస్తోంది. చైనా మార్కెట్ భార‌త్‌ని ముంచెత్త‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతోంది. ఈ ద‌శ‌లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చైనాతో చేసుకునే వ్యాపార ఒప్పందాలు బెడిసికొట్టేలా క‌నిపిస్తున్నాయి. విజ‌య‌వాడ‌లో దాదాపు 2 వేల కోట్లుకు పైగా ఖ‌రీదు చేసే స్వ‌రాజ్ మైదాన్ కేవలం 220 కోట్లకు చైనా కంపెనీకి లీజ్‌కు ఇచ్చేశారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే వామ‌ప‌క్షాలు, ప్ర‌జా సంఘాలు ప్ర‌భుత్వాన్ని తూర్పార‌బ‌డుతున్నాయి. చైనా కంపెనీ ఇక్క‌డ క‌ట్టే సిటీ స్క్వేర్ వ‌ల్ల ఏమి లాభం? క‌నీసం ప్ర‌జ‌ల‌కు వెయ్యి రూపాయ‌లు లేనిదే లోనికి ఎంట్రీ దొరుకుతుందా అని ప్ర‌శ్నిస్తున్నారు. 
 
పైగా స్వాతంత్ర్య ఉద్య‌మ స్పూర్తితో ఇక్క‌డ ఏర్పాటు చేసిన స్వ‌రాజ్ మైదాన్ ఇత‌ర దేశాల పాల‌వ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. స్వ‌యంగా పూజ్య బాపూజీ స‌భ నిర్వ‌హించిన స్వ‌రాజ్ మైదాన్‌ని చైనాకు అప్ప‌గించ‌డ‌మే కాకుండా, దీనిపై ఇక్క‌డి వారికి హ‌క్కులేకుండా చేయ‌డంపై నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. మ‌రోప‌క్క అంత‌ర్జాతీయ స్థాయిలో న్యూక్లియ‌ర్ స‌ప్ల‌యర్స్ గ్రూప్‌లో చేరేందుకు భార‌త్‌కు అడ్డుప‌డుతున్న చైనాతో ఒప్పందం... భ‌విష్య‌త్తులో వివాదాస్ప‌దం అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఇలాంటి సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారో చూడాల్సి ఉంది. ఏమాత్రం తేడా వచ్చినా అది 2019 ఎన్నికల్లో ఆయనపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు.