గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (14:55 IST)

నోరెత్తని ఏపీ ఎంపీలు.. స్పెషల్ స్టేటస్‌కు గండి.. మరి ప్యాకేజీ సంగతేంటి?

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్‌పై కేంద్రం వైఖరేంటో స్పష్టమైపోయింది. ముందు నుంచి ప్రత్యేక హోదాపై ఏ మాత్రం స్పందించని ఏపీ ఎంపీలు... కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని ప్రకటన చేసినప్పటికీ స్పందించకుండా.. నోరెత్తకుండా.. మిన్నకుండిపోయారు. స్పెషల్ స్టేటస్‌పై ఏమాత్రం పట్టుబట్టకుండా.. ప్రత్యేక ప్యాకేజీపై కూడా మౌనంగా కూర్చుండిపోయిన ఎంపీలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగించుకుని ఏపీకి వచ్చే నేతలకు ప్రజల నుంచి నిరసన తప్పదని అంటున్నారు.   
 
మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జంతర్‌మంతర్ వద్ద వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే వామపక్షాలు కూడా స్పెషల్ స్టేటస్‌పై నిరసన గళం విప్పాయి. విపక్షాలన్నీ ఏకమై ప్రత్యేక హోదాపై ఆందోళనలు చేపడితే రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. 
 
ప్రత్యేక హోదా ఇస్తామని ప్రగల్భాలు పలికి... అధికారం చేపట్టాక మాట మార్చిన బీజేపీకి టీడీపీతో మిత్రపక్షంగా కొనసాగుతుందా..? లేకుంటే ప్రత్యేక హోదాను కాళ్లావేళ్లా పడి.. మెప్పించి తెచ్చుకుంటుందో అనేది తెలియాల్సి వుంది. లేకుంటే టీడీపీకి రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకతలు తప్పవు. ఒకవేళ స్పెషల్ స్టేటస్ కుదరకపోయినా కేంద్రంలోని ఎంపీలు ప్రత్యేక ప్యాకేజీపైనైనా ఓ క్లారిటీ ప్రకటన వెలువడేలా చేస్తారా..? లేక అదీ కూడా వద్దనే రీతిగా మిన్నకుండిపోతారా.. అనేది చూడాలి. 
 
ఇప్పటికే సీమాంధ్ర ఎంపీలు ఎంతైనా పడతారులే అన్నట్లు గతంలో యూపీఏ సర్కారు రాష్ట్ర విభజన సమయంలో చుక్కలు చూపించింది. ఇదే తరహాలో బీజేపీ కూడా సీమాంధ్ర ఎంపీలే కదా.. సర్దుకుంటారులే అన్న చందంగా స్పెషల్ స్టేటస్‌పై కుదరదని ప్రకటన చేసేసింది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన మాట తప్పినట్టేనా..? స్పెషల్ స్టేటస్‌లాగానే.. స్పెషల్ ప్యాకేజీ కూడా తూతూమంత్రంగా ఉంటుందా? అనేది తెలియాల్సి వుంది.