గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2015 (14:32 IST)

ఏపీ ప్రత్యేక హోదా చుట్టూ రాజకీయ క్రీడ : క్రెడిట్ నీకు దక్కుతుందా? నాకు దక్కుతుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రత్యేక హోదా చుట్టూ తిరుగుతున్నాయి. ఈనెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జరిగే భేటీ ప్రధాన అంశం కూడా ప్రత్యేక హోదానే. ఈ సమావేశంలో ప్రత్యేక హోదా అంశం అటో ఇటో తేలిపోనుంది. ఆ తర్వాత కూడా ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రంలో రాజకీయాలు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎత్తుకుపైఎత్తు వేస్తూ గేమ్ ప్లాన్ ఆడుతున్నాయి. అందుకే రాష్ట్ర రాజకీయాలు ఈ అంశం చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పవచ్చు. 
 
విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా సాధనలో విఫలమయ్యారంటూ బీజేపీ, తెలుగుదేశం పార్టీలను కాంగ్రెస్, వైకాపా, వామపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అదేసమయంలో హోదా కోసం పోరాడుతున్నది తామేనన్న క్రెడిట్‌ పొందడం కోసం కూడా ఈ పార్టీలూ ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి. అదేసమయంలో టీడీపీ, బీజేపీ మధ్య సాగుతున్నది పాము - ముంగిస కథలా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ చెప్పుచేతల్లో ఉండాలని బీజేపీ నాయకులు భావిస్తుండగా, కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పినదానికల్లా తలూపి తన రాజకీయ ప్రయోజనాలను పణంగా పెట్టుకోకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య సాగుతున్న ఆట ఇపుడు ముదిరి పాకాన పడిందని చెప్పొచ్చు.
 
అందుకే ప్రత్యేక హోదా సాధ్యం కాని పక్షంలో ఫలానా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఈ నాలగు ప్రధాన పార్టీల్లో ఏ ఒక్క పార్టీ కూడా ధైర్యంగా మందుకు వచ్చి చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ మర్మం తెలియని ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా వస్తే తమ జీవితాలు మెరుగుపడతాయని నమ్ముతూనే ఉన్నారు. హోదా రాని పక్షంలో ఆ పాముకాటుకు తాము బలికాకూడదని తెలుగుదేశం, బీజేపీ నాయకులు భావిస్తున్నంత కాలం పరిస్థితి ఇలాగే ఉంటుంది. 
 
కాంగ్రెస్‌, వైసీపీలకు భయపడి సేఫ్‌ గేమ్‌ ఆడే విధానానికి ఈ రెండు పార్టీలూ స్వస్తి చెబితే ఏపీ ప్రజలకు నిజంగా మేలు జరుగుతుంది. ఆ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది ఒక్కటే. తమకు చక్కటి రాజధాని నిర్మాణం జరగాలనీ, ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి పరిశ్రమలు రావాలనీ, ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కుకోవాలనీ మాత్రమే. ఈ మూడు కోర్కెలనూ ఏ రూపంలో తీర్చినా ఆ రాష్ట్ర ప్రజలకు సమ్మతమే అవుతుంది. 
 
అయితే, కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడి 14 మాసాలు గడిచిపోయాయి. ఏమి చేయాలన్నా ఇంక మూడు సంవత్సరాలే మిగిలి ఉంది. చివరి ఆరు నెలల్లో ఏమి చేయడానికీ ఉండదు. ఈ పరిస్థితులలో ప్రతి రోజూ విలువైనదే! హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ పేరిట కోరుకున్నవి సాధించగలిగితే ఏపీ ప్రజలు అర్థం చేసుకొని సహకరిస్తారు. ఏపీకి ప్యాకేజీ ఇస్తే చంద్రబాబు మరింత బలపడి తమకు అందకుండా పోతారని బీజేపీ నాయకులు అనుమానించాల్సిన పనిలేదు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌ వ్యతిరేకత ప్రాతిపదికన ఏర్పాటయ్యింది కనుక చంద్రబాబునాయుడు బీజేపీని కాదని ఆ పార్టీతో చేతులు కలపలేరు. 
 
అదేసమయంలో ఏపీలో టీడీపీ తర్వాత తామే ఉండాలన్న ఆశను బీజేపీ నాయకులు వీడాలి. ఒకవేళ ఏపీలో బలపడాలనుకున్నా అక్కడ ప్రజల మనోభావాలకు అనుగుణంగా కావాల్సినవి సాధించుకురావడం ద్వారానే అది సాధ్యమన్న వాస్తవాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తించాలి. టీడీపీ - బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతానికి వైసీపీ ఉండగా, ఆ స్థానాన్ని వచ్చే ఎన్నికల నాటికి తమ సొంతం చేసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. 
 
ఇక్కడ కాంగ్రెస్‌, వైసీపీలది ఒక్కటే ఓటు బ్యాంకు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు గత ఎన్నికలలో జగన్మోహన్‌ రెడ్డి వైపు మళ్లింది. కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి పొందాలన్న ప్రయత్నంలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. అవినీతి కేసులలో జగన్మోహన్‌ రెడ్డికి శిక్షపడి ఎన్నికలలో పోటీకి ఆయన అనర్హుడైతే ఏపీలో తాము బలపడటం ఖాయమని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. బీజేపీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రస్తుతం వైసీపీ వైపు ఉన్న ఓటర్లు ఆ పార్టీ వైపు వెళ్లరు. ప్రత్యామ్నాయం కోరుకుంటే వారు కాంగ్రెస్‌ పార్టీనే ఎంచుకుంటారు. 
 
ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీని అంత తేలిగ్గా అంచనా వేయకూడదు. ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ చావుదెబ్బ తింది. కానీ ఆరేళ్లు గడిచేసరికి మళ్లీ బలం పుంజుకొని అధికారం చేజిక్కించుకుంది. వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డికి రాజకీయ పరిపక్వత లేదు కనుక.. ఆ పార్టీ ఎక్కువ కాలం నిలబడకపోవచ్చుననీ, అదే జరిగితే కాంగ్రెస్‌ మళ్లీ బలపడుతుందనీ తెలుగుదేశం నాయకులు కూడా భావిస్తున్నారు. 
 
ఇదే అంశాన్ని ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద కూడా తెలుగుదేశం నాయకులు ప్రస్తావించినట్టు సమాచారం. మొత్తంమీద ఈ పార్టీల మధ్య ప్రత్యేక హోదా అంశం రాజకీయమై సుడులు తిరుగుతోంది. అది సెంటిమెంట్‌గా మారి అధికారంలో ఉన్న బీజేపీ లేదా తెలుగుదేశం పార్టీలలో ఎవరో ఒకరిని మింగక ముందే ఉభయ పార్టీలకూ చెందిన పెద్దలు మేల్కొని ఏపీకి మేలు చెయ్యడానికి పూనుకోవడం వారికే మంచిది.