శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (10:55 IST)

ఏపీలో ఉద్యోగ సంఘాలు చీలిపోయాయ్... ఏపీఎన్జీవో అశోక్‌ బాబు పనైపోయింది!

ఏపీఎన్జీవో చీలికలు పేలికలైంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో సమైక్యతను చాటిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగులు ఇప్పుడు చీలిపోయారు. మెజారిటీ వర్గం గతంలో నాయకుడిగా పనిచేసిన అశోక్ బాబు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వే

ఏపీఎన్జీవో చీలికలు పేలికలైంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో సమైక్యతను చాటిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగులు ఇప్పుడు చీలిపోయారు. మెజారిటీ వర్గం గతంలో నాయకుడిగా పనిచేసిన అశోక్ బాబు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వేరే కుంపటి పెట్టారు. వారు కొత్త నాయకత్వాన్ని ఎంచుకున్నారు. అశోక్ బాబు అసమర్థత వల్లే ఏపీఎన్జీవో విడిపోయిందా? ఉద్యోగుల సమస్యలను పక్కనబెట్టి అశోక్ బాబు ప్రభుత్వంతో లాలూచీ పడ్డారా? ఇంతటి చీలికలకు వెనుక ఉన్న కారణాలేంటి. 
 
సమైక్యాంధ్ర ఉద్యమ పుణ్యమా అని ఏపీఎన్జీవో ఒక వెలుగు వెలిగింది. ఉద్యోగులంతా ముక్తకంఠంతో సమైక్యాంధ్రగా ఉండాలంటూ రోడ్డెక్కారు. ఆ ప్రయత్నంలో వారికి నాయకత్వం వహించిన అశోక్ బాబు కూడా అంతే ఊపుతో పనిచేశాడు. అయితే అప్పట్లోనే కొన్ని పార్టీలకు కొమ్ము కాస్తూ అశోక్ బాబు ఉద్యమాన్ని తాకట్టుపెట్టారన్న ఆరోపణలు వినిపించాయి. కొంతమంది చిన్నాచితకా ఉద్యోగ సంఘాలు ఏపీఎన్జోవో నుంచి బయటకు వచ్చాయి. అయితే తర్వాత రాష్ట్రం విడిపోయి తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అశోక్ బాబు ప్రభుత్వంతో కూడా మంచి సత్సంధాలు మెయింటైన్ చేశాడు. 
 
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అందరూ కలిసి రావాలన్న నినాదంలోనే భాగంగానే ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నామని ప్రకటించుకున్నాడు. అయితే ఆ ప్రయత్నంలో అశోక్ బాబు ఒక్కడు మాత్రమే ప్రభుత్వానికి దగ్గరై ఉద్యోగులందరినీ దూరం చేశారన్న అభిప్రాయం ఏర్పడింది. ఉద్యోగుల సంక్షేమానికి పనిచేయాల్సిన అశోక్ బాబు ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేస్తున్నాడంటూ ఆరోపించాడు మిగిలిన ఉద్యోగ సంఘం నాయకులు. సమస్యలు పరిష్కరించమని ఎవరైనా ఉద్యోగులు వెళ్ళి అడిగితే వారిని అవమానించే వెళ్ళే విధంగా మాట్లాడడంతో పాటు అసలు సమస్యల గురించి పట్టించుకునే వారే కాదంటున్నారు కొత్తగా ఉద్యోగ జేఏసీ ఛైర్మన్‌గా ఎన్నికైన బొప్పరాజు. 
 
అశోక్ బాబు తీరును నిరసిస్తూ 80 ఉద్యోగ సంఘాలు తిరుపతిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఉద్యోగ జేఏసీ పేరుతో కొత్త వేదికను ఏర్పాటు చేసుకున్నారు. దానికి అధ్యక్షుడిగా గతంలో ఏపీఎన్జీవోలో రెవిన్యూ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన బొప్పరాజు వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ నాయకులు అశోక్ బాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగ సంఘ నాయకుడిగా తనకు తిరుగేలేదన్న విధంగా అశోక్ బాబు వ్యవహరిస్తున్నాడని, ఒంటెత్తుపోకడలకు పోతూ ఉద్యోగులను అవమానకరంగా మాట్లాడుతున్నారన్నారు. 
 
ప్రభుత్వం దగ్గరికి తాను ఏదైనా సమస్య తీసుకెళ్ళితేనే పరిష్కారం అవుతుందని, మిగిలిన ఎవరూ సమస్యను పరిష్కరించే దమ్ము లేదంటూ గర్వానికి పోతున్నారన్నారు. అంతేకాకుండా ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వంతో పోరాడాల్సిన అశోక్ బాబు ప్రభుత్వ పెద్దలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. 
 
ఇలాంటి సమయంలో ఉద్యోగస్తుల సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని ప్రశ్నించారు ఉద్యోగ జేఏసీ నాయకులు. ఇప్పటికైనా బుద్ధి చెప్పుకుని అందరినీ కలుపుకుని పోయేవిధంగా అందరూ వ్యవహరించాలంటున్నారు. సంఘాల మధ్య చీలిక తెచ్చి తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలన్న ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదంటున్నారు ఉద్యోగ జెఎసి నాయకులు.
 
ఉద్యోగ సంఘాల్లో చీలిక రావడంతో రాజకీయాలు ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జేఏసీ నాయకులకు ప్రతిపక్ష పార్టీ నుంచి మద్దతు లభించే అవకాశాలున్నాయి. దీంతో ఉద్యోగుల మధ్య వచ్చిన విభేధాలు భవిష్యత్తులో తారాస్థాయికి చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.