గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Modified: మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (19:51 IST)

శ్రీకాళహస్తిలో నిర్లక్ష్యాన్ని శివయ్య క్షమిస్తాడా...!

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆయలంలో ఇంతకాలం ఎంత నిర్లక్ష్యం రాజ్యమేలిందో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఉదంతాలు విదితం చేస్తున్నాయి. ఈఓలుగా పనిచేసిన అధికారుల ఉదాశీనత ఎంతగా ఉందో స్ట్రాంగ్‌ రూం నుంచి బయటపడుతున్న బంగారు ఆభరణాలు ఎత్తిచూపుతున్నాయి.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆయలంలో ఇంతకాలం ఎంత నిర్లక్ష్యం రాజ్యమేలిందో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఉదంతాలు విదితం చేస్తున్నాయి. ఈఓలుగా పనిచేసిన అధికారుల ఉదాశీనత ఎంతగా ఉందో స్ట్రాంగ్‌ రూం నుంచి బయటపడుతున్న బంగారు ఆభరణాలు ఎత్తిచూపుతున్నాయి. ఉన్నతాధికారుల్లోనూ ఇంత బాధ్యతారాహిత్యం ఉంటుందా అని సామాన్య జనం విస్మయం చెందేలా ఉంది పరిస్థితి. తాజాగా శ్రీకాళహస్తి ఆలయ స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి బయటపడిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను చూస్తే శివయ్య ఆస్తుల పరిరక్షణపై అధికారులు ఎంత శ్రద్థగా పనిచేశారో తెలిసిపోతుంది. ఒకటి కాదు స్వామివారి ఆభరణాలను బ్యాంకు లాకర్‌కే పరిమితం చేయడం నుంచి తాజా ఉదంతం దాకా ఆలయంలో సాగిన అస్తవ్యస్థ పాలనను కళ్ళకు కడుతున్నాయి. ఆ ఉదంతాలను ఒకసారి చూస్తే...
 
శ్రీకాళహస్తి ఆలయంలో కొలువైన స్వామివారికి, అమ్మవారికి ఎన్నో విలువైన ఆభరణాలున్నాయి. కైలాసహారం, మామిడిపిందెల హారం, పాపిటిబిళ్ల, కర్ణాలు, బంగారు రుద్రాక్షలు, విభూది రేఖలు, కిరీటాలు ఇలా అనేకమైన వజ్రాభరణాలు ఉన్నాయి. శివయ్యపై భక్తితో ఎప్పుడో రాజులు, చక్రవర్తులు, జమీందారులు సమర్పించినవి వీటితో ఉన్నాయి. కోట్ల విలువైన ఈ ఆభరణాలను బ్యాంకు లాకర్‌లో భద్రపరుస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంధర్భంగా మాత్రమే వీటిని బయటకు తీసి స్వామి, అమ్మవార్లకు అలంకరిస్తారు. శివరాత్రి ఉత్సవాల తరువాత మళ్ళీ లాకర్‌లో పెట్టేస్తారు. ఇది ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. 
 
అయితే పదేళ్ళ నుంచి ఈ ఆభరణాలను లాకర్‌ నుంచి బయటికి తీయడం లేదు. అద్దె నగలుతో, గిల్టు నగలుతో స్వామి అమ్మవార్లకు అలంకరణ పూర్తి చేస్తూ వచ్చారు. సాధారణంగా ఈఓ మారినప్పుడు అప్పటి దాకా పనిచేసిన వారు కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తారు. అప్పుడే బంగారు నగలు కూడా అప్పగించాలి. లాకర్‌ తెరచి రికార్డు ప్రకారం అందులో అన్నీ ఉన్నాయో లేదో చూపించి లాకర్‌ తాళాలు అప్పగించాలి. అయితే పదేళ్ళ నుంచి ఇది జరగడం లేదు. ఈ పదేళ్ళలో 9మంది ఈఓలు మారారు. ఇందులో ఇద్దరు రిటైర్‌ అయిపోయారు కూడా. ఎట్టకేలకు మొన్న శివరాత్రికి ఈఓగా భ్రమరాంబ చొరవతో ఆ ఆభరణాలు లాకర్‌ నుంచి వెలుగుచూశాయి. శివయ్య కంఠాన్ని అలంకరించాయి.
 
శ్రీకాళహస్తీశ్వరుడి హుండీలో నగదుతో పాటు వెండి, బంగారు ఇతర లోహాలు కూడా కానుకల రూపంలో జమ అవుతుంటాయి. హుండీ లెక్కింపు సంధర్భంగా వేటికవి వేరు చేస్తుంటారు. వెండి లాగా కనిపించే తెల్లటి లోహం వేరుచేసి కిలోల లెక్కన అమ్ముతుంటారు. సంవత్సరాల తరబడి 25 బస్తాలకు ఇలాంటి లోహం పోగుపడింది. ఎట్టకేలకు కొన్ని నెలల క్రితం ఈఓ భ్రమరాంబ ఆ గదిని తెరిచి బస్తాలను తనిఖీ చేశారు. ఆశ్చర్యకరంగా తుక్కులో బంగారం బయటపడింది. నాలుగు బస్తాల తుక్కులో వెతికితేనే దాదాపు మూడున్నర కిలోల వెండి, 58 గ్రాముల బంగారం దొరికింది. అన్ని బస్తాలు చూస్తే ఇంకెన్ని కిలోల బంగారు ఉంటుందో పెద్దగా విలువలేని వైట్‌ మెటల్‌లోకి వెండి, బంగారు ఎలా వెళ్ళిందనేది ఎవరూ చెప్పడం లేదు.
 
శ్రీకాళహస్తి దేవాలయానికి అనుబంధంగా స్కిట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ఉంది. స్కిట్‌ అవసరాల కోసం 19.08.1997వ తేదీ రూ.50 లక్షల నగదును ఈఓ,, శ్రీకాళహస్తి దేవస్థానం పేరుతో ఐఎన్‌జి వైశ్యా బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. దీని కాల పరిమితి 10 యేళ్ళు. అంటే 2007 ఆగస్టులో ఈ డిపాజిట్‌ గడువు తీరి డబ్బులు చేతికి అందుతాయన్నమాట. ఆ రోజు రానే వచ్చింది. వడ్డీతో కలిపి కోటి 71 లక్షల రూపాయలు అయ్యింది. వాస్తవంగా ఇలాంటి గడువు తీరిన డిపాజిట్లను ఏమీ చేయాలనేది మళ్ళీ నిర్ణయించాలి. అప్పటి దాకా ఉన్న బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ వచ్చే బ్యాంకులు, స్కీములు ఉంటే అందులోకి మార్చాలి. కానీ అలాంటిదేమీ జరుగలేదు. దేవస్థానం పట్టించుకోవడం లేదు కాబట్టి బ్యాంకు అధికారులే కోటి 71 లక్షల రూపాయలు మరో పదేళ్ళ కాలానికి తమ బ్యాంకులో డిపాజిట్‌ చేసుకున్నారు. దాని గడువు కూడా 2017ఆగస్టులో తీరిపోతుంది. ఈ మధ్యే ఆ డిపాజిట్‌ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది.
 
నాలుగు రోజుల క్రితం స్ట్రాంగ్‌ రూం పరిశీలించగా మరో రహస్యం బయటపడింది. ఎవరు సమర్పించినవో ఎప్పుడు సమర్పించినవో గానీ అసలు ఆలయ లెక్కల్లోనే లేని దాదాపు మూడు కిలోల బరువున్న బంగారు ఆభరణాలు కనిపించాయి. మైసూరు రాజులు స్వామికి బహూకరించిన అలంకార కవచంతో పాటు ఉత్సవమూర్తులకు అలంకరించే కిరీటాలు, భుజకీర్తులు, వరదహస్తాలు, పాదాలు అమ్మవారి బంగారు జడలు చూడామణి పలు ఆభరణాలు దొరికాయి. వీటి విలువ 20 లక్షల రూపాయల పైమాటే.
 
ఏ ఉదంతం తీసుకున్నా ఇందులో అధికారుల అలసత్వం తప్ప ఇంకొకటి కనిపించదు. సాధారణ విషయాలు అటుంచితే స్వామివారి ఆస్తుల పరిరక్షణపైనా అధికారులకు శ్రద్థ లేదనేది తేలతెల్లమవుతోంది. ఆలయాలకు ఈఓలను నియమించేది భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడం కోసమే కాదు ఆలయ ఆస్తులను పరిరక్షించనకు కూడా. శ్రీకాళహస్తీశ్వరుని భూములూ పెద్ద ఎత్తున ఆక్రమణకు గురయ్యాయి. కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. వాటిని పరిష్కరించి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అధికారులు ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించదు. దేవదాయశాఖ ఉన్నతాధికారుల చొరవ కానరాదు. భ్రమరాంబ చొరవ తీసుకోకుంటే ఇవన్నీ ఇంకెన్నాళ్లు మరుగునపడి ఉండేవో శివయ్యా. నిర్లక్ష్యాన్ని క్షమించు... స్వామీ...