శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (17:13 IST)

'సిక్స్త్ మాస్ ఎక్స్‌టింక్షన్' ప్రారంభం... జీవకోటి అంతరించడం ఖాయమా?

'సిక్స్త్ మాస్ ఎక్స్‌టింక్షన్' (ఆరవ సమూహ వినాశనం) ప్రారంభమైందా? అంటే.. భూమండలంపై ఉన్న జీవకోటి అంతరించడం ఖాయమేనా? ప్రస్తుతం సంభవిస్తున్న విపరీతమైన ప్రకృతివైపరీత్యాలు, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు దేనికి సంకేతం? ఇత్యాది అంశాలకు సిక్స్త్ మాస్ ఎక్స్‌టింక్షన్ సమాధానమిస్తోంది. ఇంతకీ దీనిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఏమంటున్నారో ఓ సారిపరిశీలిద్దాం.
 
 
నిజానికి నిన్నమొన్నటివరకు త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందనే ప్రచారం సాగింది. కానీ, జీవకోటి మాత్రమే అంతమైపోతుందని, ప్రపంచం అలానే ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే భూమండలంపై ఉన్న ఇతర జీవరాసుల కంటే మనుషులే ముందుగా అంతరించిపోతారని వారు హెచ్చరిస్తున్నారు. దీన్నే వారు "సిక్స్త్ మాస్ ఎక్స్‌టింక్షన్‌"గా పిలుస్తున్నారు. ఇది సంభవించేందుకు గల అనేక కారణాలను వారు ఉదాహరణలతో వివరిస్తున్నారు. 
 
ఇటీవలి కాలంలో భూమండలంపై ప్రకృతివైపరీత్యాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ముఖ్యంగా భూకంపాలు, భారీ తుఫాన్లు, భారీ వర్షాలు.. వరదలు సంభవిస్తున్నాయి. అలాగే, వాతావరణంలో కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఎండలు, తీవ్ర కరువు కాటకాలు, నీటి ఎద్దడి వంటి ప్రతికూల పరిస్థితులను కళ్లారా చూస్తున్నాం. కంటిముందే అడవులు మాయమైపోతున్నాయి. పచ్చదనం మచ్చుకైనా కనిపించడం లేదు. అనేక రకాల పక్షి జాతులు అంతరించిపోయాయి. మానవజాతిపై ప్రకృతి పగబట్టినట్లు విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇవన్నీ ప్రాణికోటి అంతానికి దారితీస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. 
 
నిజానికి తొలి సమూహ వినాశనం (ఫస్ట్ మాస్ ఎక్స్‌టింక్షన్) ఆరు కోట్ల 60 లక్షల సంవత్సరాల కిందట సంభవించిందట. దీనివల్ల రాక్షస బల్లులు అంతరించిపోయాయి. ఆ తర్వాత వివిధ దశల్లో నాలుగుసార్లు వేగంగా జీవజాలం అంతరించిపోతూ వచ్చిందని వారు చెపుతున్నారు. ఇప్పుడు ఆరో దశ నడుస్తోంది. ఈ దశలో గతంలో కంటే... వంద రెట్లు వేగంగా పశుపక్ష్యాదులు కనుమరుగవుతున్నాయి. 
 
అలాగే, మనుషులైతే అత్యంత వేగంగా అంతరిస్తారని స్టాన్‌ఫోర్డ్‌తో పాటు మరికొన్ని విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. వీరి అంచనా ప్రకారం సమీప కాలంలోనే భూమ్మీద జీవరాశి మొత్తం అంతరిస్తుందట. ఆ తర్వాత జీవం ఏర్పడేందుకు కొన్ని లక్షల సంవత్సరాల సమయం పడుతుందని వారు చెపుతున్నారు.