శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : గురువారం, 19 నవంబరు 2015 (14:19 IST)

చిత్తూరు మేయర్ దంపతులకు చింటూకు మధ్య శత్రుత్వం ఎందుకొచ్చింది?

చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఈమె భర్త కటారి మోహన్‌లకు మధ్య దగ్గరి బంధువైన చింటూకు మధ్య శత్రుత్వం ఎందుకు వచ్చిందనే విషయంపై పలు రకాలైన కథనాలు వెలుపడుతున్నాయి. అనురాధకు స్వయానా మేనల్లుడైన చింటూ... మేనత్తను నిర్ధాక్షిణ్యంగా తలపై కాల్చి చంపాడు. ఆ తర్వాత బావ మోహన్‌పై రెండు రౌండ్ల కాల్పులు జరుపగా, ఒక బుల్లెట్ అతని పొట్టలోకి దూసుకెళ్లింది. దీంతో కటారి మోహన్ కార్పొరేషన్ కార్యాలయం వెలుపల కుప్పకూలిపోగా... వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే, కటారి దంపతులతో ఎంతో సన్నిహితంగా ఉండే చింటూకు కటారి దంపతులతో వైరం ఎందుకు పెంచుకున్న విషయాన్ని పరిశీలిస్తే... 
 
చిత్తూరు నగర పాలక ఎన్నికలకు ముందు చింటూతో అనురాధ కుటుంబానికి మంచి సంబంధాలే ఉండేవి. అనురాధ మేయర్ అయిన తర్వాత ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఆర్థిక వ్యవహారాల నుంచి రాజకీయ విభేదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కాంట్రాక్టులు, టెండర్ విషయాల్లో గొడవలు జరిగాయి. దీంతో రెండు వర్గాలు ఫ్లెక్సీలు చించేసుకోవడం, రోడ్ల మీద గొడవకు దిగడం వరకూ వెళ్ళారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య వైరం నివురుగప్పిన నిప్పులా ఉంది. అయితే ఇది హత్యలకు దారి తీస్తుందని ఎవరూ అనుమానించలేదు.
 
అయితే, సీకే బాబుపై హత్యాయత్నం కేసులో జైలుకెళ్తున్న సమయంలోనే కటారి మోహన్.... తన క్వారీ నిర్వహణ బాధ్యతలను కూడా చింటూకు అప్పగించారు. కొంతకాలం పాటు వీళ్ల మధ్య వ్యాపార లావాదేవీలు బాగానే కొనసాగాయి. మేయర్ అనురాధతో పాటు ఆమె భర్త రాజకీయంగా ఎదగడాన్ని చింటూ జీర్ణించుకోలేక పోయారు. దీంతో విభేదాలు తారా స్థాయికి చేరాయి. 
 
ఇదేసమయంలో జిల్లాకు చెందిన ఓ మంత్రి మధ్యవర్తిత్వంతో క్యారీని స్వాధీనం చేసుకునేందుకు చింటూ ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. దీంతో చింటూ అనురాధ కుటుంబంపై పగ పెంచుకున్నాడు. కటారి కుటుంబానికి సమాంతరంగా ఎదిగేందుకు ప్రయత్నించిన చింటూ అనుకున్నది సాధించలేక పోయాడు. దీంతో కటారి ఫ్యామిలీని చింటూ లక్ష్యంగా పెట్టుకుని అనుకున్న పనిని పూర్తి చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.