గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2015 (22:08 IST)

కుక్కల రాజ్యంగా ఆంధ్రప్రదేశ్.. చిన్నారులను పీక్కుతింటున్న వీధి శునకాలు!

నవ్యాంధ్రప్రదేశ్ కుక్కల రాజ్యంగా మారిపోయింది. వీటి దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా వీధి శునకాల దెబ్బకు చిన్నారులు బెంబేలెత్తిపోతున్నారు. వీధుల్లో తిరిగేందుకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఒంటరిగా కనిపించిన చిన్నారులను ఈ వీధి కుక్కలు పీక్కుతింటున్నాయి. ఈ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారులు మృత్యువాతపడుతున్నారు.
 
ఈ వీధి కుక్కల స్వైర విహారానికి ప్రత్యేక ఓ ప్రాంతం.. ఓ పట్టణం, ఓ గ్రామం.. ఓ వీధి అనే తేడా లేకుండాపోయింది. ఫలితంగా వీధిలో నడుస్తుంటే కుక్క ఎటువైపు నుంచి వచ్చి కాటేస్తుందోనని తెలియని పరిస్థితి. కుక్కకాటుకు విశాఖలో ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోగా, కడప జిల్లా బద్వేలులో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. ఇలా శునకాల దాడులు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. 
 
ఫలితంగా మన పాలకుల నిర్లక్ష్యానికి పసిప్రాణాలు మొగ్గలోనే బలవుతున్నాయి. మొన్న గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు ఓ పసికందును కొరికి చంపేస్తే, నిన్న విశాఖలో కుక్కల బారిన పడి ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు వదిలాడు. తల్లి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో గేటు తెరిచి ఉండటంతో ఇంటిబయటకు వచ్చిన బాబుపై  కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. శరీరమంతా గాట్లు పెట్టడంతో పాటు.. పొట్టలో పేగులు బయట పడేలా గాయపరిచాయి. తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న బాబుని ఆసుపత్రికి తీసుకొళ్లినా లాభం లేకపోయింది. అప్పటికే ఆ బాలుడు మరణించాడు. 
 
అలాగే, కడప జిల్లా బద్వేలులోనూ వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపరియాయి. ఇంటిముందు సరదాగా ఆడుకుంటున్న చిన్నారులపై భయానక రీతిలో మీదకు దూకి ఎక్కడికక్కడ పీకి పెట్టాయి. చిన్నారులపై కుక్కలు దాడి చేస్తుండగా.. స్థానికులు గమనించి తరిమివేయడంతో పిల్లలు ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకున్నారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో... స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ మన పాలకులకు ఇవేమీ కనిపించక పోవడం గమనార్హం.