గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2015 (18:17 IST)

రెండేళ్ళలో మిగులు బడ్జెట్... ఇక ప్రత్యేకహోదా ఎందుకు..?

రెండేళ్ల‌లో రాష్ట్రం మిగులు బ‌డ్జెట్ సాధించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌కు ల‌క్ష్యం నిర్దేశించారు. చంద్రబాబు జనం ముందు ఎన్ని మాట్లాడినా అధికారులు, ప్రైవేటు కార్యక్రమాలలో మాత్రం రాష్ట్రం త్వరలోనే మిగులు బడ్జెట్‌లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇవాళ‌ రూ. 3 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉందట. మరిరెండేళ్లలో మిగులు బడ్జెట్ లోకి రావడం సాధ్యమా...! ఒకవేళ మిగులు బడ్జెట్ లోకి వచ్చే పరిస్థితులే ఉంటే ప్రత్యేక హోదా ఎందుకు? అనేది పెద్ద ప్రశ్న. బాబు మనసులో మాటేదో చెప్పేస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా.. 
 
విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి-ఆదాయ వనరులు’పై  ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్‌ తదితరులతో చంద్రబాబు సమీక్షించారు. ఈ సమావేశాలో ఆయన చాలా నిశ్చయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. రాష్ట్రం రాబోవు రెండేళ్ళలో మిగులులోకి వచ్చే అవకాశాలపై ఆయన వివరించినట్లు తెలుస్తోంది. అది సాధ్యమా కాదా అనే ప్రశ్న చాలా ప్రధానమైనది. ఆయన మాట్లాడుతున్న తీరును చూసిన అధికారులు కూడా బుర్ర గొక్కున్నారట. చివరకు ఎలా మిగులు బడ్జెట్లోకి తీసుకురావాలో కూడా ఆదేశాలిచ్చారట. 
 
సమావేశ వివరాలను ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ విలేకరులకు వెల్లడించారు. వనరుల పెంపు ద్వారా ఆదాయం వస్తున్నా వ్యయం కూడా అంత‌కంటే ఎక్కువగా ఉందని ముఖ్య‌మంత్రి అభిప్రాయపడినట్లు చెప్పారు. ఎర్రచందనం, ఇసుక, బీచ్‌శాండిల్‌, బెరైటీస్ వంటి ఖనిజాల ద్వారా ఖజానాకు ఆదాయం వస్తోందన్నారు. విభ‌జ‌న‌చ‌ట్టంలో పేర్కొన్న రెవెన్యూ లోటు రూ. 6 వేల కోట్లను కేంద్రం ప్రతి ఏటా భర్తీ చేయడం, కేంద్రం నుండి రావాల్సిన నిధులు, రాయితీలను సాధించుకోవడం ద్వారా లోటును అధిగమించేందుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. 
 
అయితే రెండేళ్ల ల‌క్ష్యంపై అధికారులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఖ‌ర్చులు త‌గ్గించుకోకుండా మిగులు ఎలా సాధ్య‌మ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌త్యామ్నాయ ఆదాయ వ‌న‌రులు ఎన్ని ఉన్నా లోటు పూడ్చ‌డం క‌ష్ట‌మ‌ని అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సంగతి ఎలా ఉన్నా... చంద్రబాబు చెప్పేదే నిజమనుకుంటే, ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టాల్సిన అవసరం ఉందా..? అనేది పెద్ద ప్రశ్న అవుతుంది. బయటికి మాత్రం రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉందని ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ అవసరమనే మాటను పదే పదే మాట్లాడుతున్నారు. 
 
ఆయన అధికారుల సమీక్షలో ఎందుకు అలా మట్లాడారు అనేది పెద్ద ప్రశ్న. ప్రత్యేకహోదా నినాదాన్ని వద్దని నేరుగా చెప్పకుండా ఇలా చెబుతున్నారా అనే అనుమానం కలుగుతోంది. లేక ఇక తనకు బీజేపీ సహకరించే పరిస్థితి లేదు కనుక, ప్రతిపక్షాలు చేసే డిమాండ్ మరుగున పడాలంటే రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రాల జాబితాలో చేర్చేయగలిగితే తన సర్కారుకు, రాబోవు రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఇబ్బంది ఉండదని భావించారా.. అనే అనుమానం కలుగుతోంది. బాబు ఇలా కూడా రాజకీయ చతురుతను ప్రదర్శిస్తున్నారేమో...