శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 మే 2016 (12:18 IST)

తమిళనాడు ఎన్నికలు : బరిలో రాజకీయ నేతల వారసులు.. అదృష్టం వరించేనా?

తమిళనాడు రాజకీయాల్లో వారసులకు పెద్దపీట వేస్తుంటారు. ముఖ్యంగా డీఎంకేలో ఈ సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. డీఎంకే అధినేత కరుణానిధి ఇద్దరు కుమారులైన ఎంకే స్టాలిన్, ఎంకే అళగిరిల మధ్య ఈ పోటీ అధికంగా ఉంది. ఈ పోటీ మరింతగా ముదిరిపోవడంతో కరుణానిధి తన చిన్న కుమారుడు స్టాలిన్‌ వైపు మొగ్గు చూపి.. పెద్ద కుమారుడు అళగిరిని పార్టీ నుంచి నాలుగేళ్ళ పాటు బహిష్కరించారు. దీంతో ఈయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
 
ఈ నేపథ్యంలో ఈనెల 16వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేతల వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో ప్రధానంగా ఎంకే స్టాలిన్ ఉండగా, పీఎంకే అధ్యక్షుడు డాక్టర్ రాందాస్ తనయుడు డాక్టర్ అన్బుమణి రాందాస్, కేంద్ర మాజీ మంత్రి డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు తనయుడు టీఆర్‌బీ రాజాలు ఉన్నారు. 
 
వీరిలో స్టాలిన్‌ చెన్నై కొళత్తూరు నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీచేస్తున్నారు. 2011 ఎన్నికల్లో ఆయన అన్నాడీఎంకే అభ్యర్థి సైదై దురైస్వామిని ఓడించి శాసనసభకు ఎన్నికయ్యారు. 63 ఏళ్ల స్టాలిన్‌ అతి పిన్నవయస్సులోనే రాజకీయ రంగంలోకి ప్రవేశించి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ కోశాధికారి స్థానానికి చేరుకున్నారు. ఆయన పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా కూడా ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. స్టాలిన్‌ మొదటిసారి 1984లో థౌజండ్‌లైట్స్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగి విజయం సాధించలేకపోయారు. కానీ తర్వాత 1989, 1996, 2001, 2006 ఎన్నికల్లో శాసనసభకు వరుసగా ఎన్నికయ్యారు. 
 
2006లో ఆయనను కరుణానిధి పురపాలకశాఖ మంత్రిగా మంత్రివర్గంలో చేర్చుకుని తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవిని కల్పించారు. స్టాలిన్‌ 1996-2001 మధ్య చెన్నై మేయర్‌గా కూడా పనిచేశారు. ఇక పీఎంకే తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగిన అన్బుమణి రామదాసు ధర్మపురి జిల్లాలోని పెన్నాగరం నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేసిన అన్బుమణి ప్రస్తుతం ధర్మపురి ఎంపీగా ఉన్నారు. 2004 నుంచి 2010 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు. ఇక డీఎంకే నాయకుడు కేంద్రమాజీ మంత్రి టీఆర్‌బాలు కుమారుడు టీఆర్‌బీ రాజా కూడా మన్నార్‌గుడి నియోజకవర్గం నుంచి రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.