బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2017 (16:46 IST)

కుషన్ కుర్చీలో శశికళ... చెక్క కుర్చీపై సీఎం సెల్వం... పతనం ప్రారంభమైనట్టేనా?

తమిళనాడులో రాజకీయ రంగులు మారడం ఆగటంలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత ఆ సీటుపై శశికళ కన్నేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. చివరికి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత అన్నాడీఎంకెలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. అంతకు

తమిళనాడులో రాజకీయ రంగులు మారడం ఆగటంలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత ఆ సీటుపై శశికళ కన్నేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. చివరికి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత అన్నాడీఎంకెలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. అంతకుముందు అన్నాడీఎంకే గల్లీ లీడర్ నుంచి ఢిల్లీస్థాయి లీడర్ వరకూ అందరి జేబుల్లోనూ అమ్మ జయ బొమ్మలు వుండేవి.

అమ్మ జయ మరణానంతరం శశికళ పార్టీ పగ్గాలను చేపట్టారు. ఇక అప్పట్నుంచి అన్నాడీఎంకే నాయకులందరి జేబుల్లోనూ శశికళ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. చాలాచోట్ల అమ్మ బొమ్మలు మాయమయ్యాయి. ఆ స్థానంలో శశికళ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. అంతకుముందటిలా కాకుండా అమ్మ జయలలితను మరపించే రీతిగా గెటప్ మార్చేశారు శశికళ.
 
ఇదిలావుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సీఎం సీటుకు కౌంట్ డౌన్ స్టార్టయినట్లు తమిళనాడులో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అందుకు అనుగుణంగా చకచకా పావులు కదులుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగా చిన్నమ్మ శశికళ.. తమిళ దివంగత సీఎం జయలలితకు నమ్మినబంటులా పేరొందిన మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలాకృష్ణన్‌‌ను బాధ్యతలను వీడి ఇంటికెళ్లిపొమ్మన్నారనే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ షీలా సీఎం సలహాదారు పదవికి రాజీనామా చేశారు. 
 
ఆమెతో పాటు మరో ఇద్దరు సీనియర్ అధికారులు కూడా రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాలను ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆమోదించారు. ఇక ఆ స్థానంలో శశికళకు అనుకూలురైన వారిని నియమించేందుకు కసరత్తు సాగుతున్నట్లు సమాచారం. ఇదిలావుంటే పార్టీ సమావేశాల్లో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెక్క కుర్చీపై కూర్చుంటే పార్టీ పగ్గాలను చేపట్టిన శశికళ మాత్రం రాజసాన్ని ప్రదర్శిస్తూ కుషన్ కుర్చీపైన కూర్చుంటున్నారు. మొత్తమ్మీద అన్నాడీఎంకేలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా వుంది. పన్నీర్ సెల్వంను సీఎం పీఠం నుంచి తొలగిస్తే అన్నాడీఎంకేలో పెను మార్పులు ఖాయం అని అనుకోవచ్చు. అంతేకాదు... పార్టీ చీలిపోవడం కూడా జరగవచ్చని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చూడాల, ఏం జరుగుతుందో?