శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (12:30 IST)

ఎర్రదొంగలు ఖబడ్దార్‌ - తిరుపతిలో టాస్క్‌ఫోర్స్ పోలీస్టేషన్‌... ఇక స్మగ్లర్లపై ఉక్కుపాదమే!

ఎట్టకేలకు తిరుపతిలో టాస్క్ ఫోర్స్ పోలీస్టేషన్‌ ఏర్పాటైంది. ఏపీ సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో తిరుపతిలోని కపిలతీర్థంలో నూతన టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్‌‌ను ఏర్పాటు చేశారు. ఇద్దరు డిఎస్పీలు పర్యవేక్షణలో ఈ పోలీస్టేషన్‌ నడువనుంది. అసలు టాస్క్‌ ఫోర్స్ పోలీస్టేషన్‌ అంటే తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. అసలు టాస్క్‌ ఫోర్స్ అంటే శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాను అడ్డుకునే రక్షణ దళాలు. దీన్నే ప్రభుత్వం టాస్క్‌ ఫోర్స్‌గా ఏర్పాటు చేసింది.
 
తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు సీఎం చంద్రబాబునాయుడు. ఎంతో విలువైన వృక్షసంపద ఈ ప్రాంతంలో ఉండటంతో పాటు వాటిని కొంతమంది అక్రమార్కులు విదేశాలకు తరలిస్తుండడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రిత్వ శాఖలో చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డినే అటవీశాఖామంత్రిగా వేశారు. ఎందుకంటే సొంతజిల్లాలో ఆయన ఉండడమే కాకుండా ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుంటారన్న నమ్మకంతో. అంతేకాదు టాస్క్‌ ఫోర్స్ అనే ప్రత్యేక దళాన్ని కూడా ఏర్పాటు చేసి ఒక డిఐజి ర్యాంకు అధికారిని నియమించారు.
 
గతంలో హైదరాబాద్‌లో పనిచేసిన కాంతారావు అనే వ్యక్తి ప్రస్తుతం డిఐజిగా కొనసాగుతున్నారు. కపిలతీర్థంలోని అటవీశాఖ కార్యాలయంలోనే టాస్క్‌ ఫోర్స్ కార్యాలయాన్ని నామమాత్రంగానే ఏర్పాటు చేశారు. శేషాచలంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుకున్న దుంగలను కూడా నేరుగా కపిలతీర్థంలోని ఈ గోడౌన్‌లలోనే భద్రపరుస్తారు. అందుకే ఈ ప్రాంతంలోనే తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే అధికారాలు మాత్రం టాస్క్‌‌ ఫోర్స్‌కు లేవు. దాంతో పాటు ఆయుధాలు కూడా లేవు. ప్రాణాలకు తెగించి టాస్క్‌ ఫోర్స్ సిబ్బంది ఎర్రచందనం దుంగలను పట్టుకుని పోలీసులకో, అటవీశాఖాధికారులకో అప్పజెప్పాలి. అదే వారి పని. 
 
ఆయుధాలు లేకుండానే ఇలా ఎన్నోసార్లు ఎర్రచందనం దుంగలను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు టాస్క్‌ ఫోర్స్ సిబ్బంది. అసలు టాస్క్‌ ఫోర్స్ సిబ్బందికే అధికారాలు అప్పజెబితే బాగుండునని ఎంతోమంది సూచనలు కూడా చేశారు. అయితే అప్పట్లో ఏపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కారణం స్థానిక పోలీసులు, అటవీశాఖాధికారులు ఉండడమే. అయితే ఇందులో మరో సమస్య తలెత్తింది. కారణం వీరి మధ్య సమన్వయం లేకపోవడమే. ఒకరికొకరు సఖ్యతగా ఉండి ఎర్రచందనం దొంగలను పట్టుకోవాల్సింది పోయి ఒకరిపై ఒకరు అజమాయిషీ చేసుకునే ప్రయత్నం చేశారు. వీరి మధ్య ఉన్న తగాదాల కారణంగా ఎర్రచందనం దొంగలు ఎన్నోసార్లు తప్పించుకుపోయిన సందర్భాలు లేకపోలేదు.
 
దీన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం చంద్రబాబునాయుడు టాస్క్‌‌ ఫోర్స్‌కే పగ్గాలు అప్పజెప్పేందుకు ప్రణాళికలు రూపొందించారు. తిరుపతిలోనే టాస్క్‌ ‌ఫోర్స్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కపిలతీర్థంలోని అటవీశాఖ కార్యాలయంలోనే ఈ కార్యాలయం కూడా ప్రస్తుతం ఉంది. టాస్క్‌ ఫోర్స్ సిబ్బంది పట్టుకునే నిందితులు ఇక నుంచి పోలీసులకో, అటవీశాఖాధికారులకో అప్పజెప్పాల్సిన అవసరం లేదు. నేరుగా వీళ్లే కేసు నమోదు చేసి కోర్టుకు తరలించవచ్చు. అలాంటి అధికారాన్ని ప్రభుత్వం అప్పజెప్పింది. అంతేకాదు ఆయుధాలను కూడా కొన్నింటిని ప్రస్తుతం అందించింది. మరికొన్ని ఆయుధాలను అందించేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. 
 
శేషాచలం అడవుల్లో పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే టాస్క్‌ ‌ఫోర్స్ సిబ్బంది ఏ మాత్రం పనిచేస్తారన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కొంతమంది టాస్క్‌‌ ఫోర్స్ సిబ్బంది ఎర్రచందనం దొంగలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో కూలీలలను పట్టుకు వచ్చి కేసులు పెడుతున్నారే కానీ, అసలైన స్మగ్లర్లను పట్టుకోవడం లేదన్న విమర్శలు లేకపోలేదు. మొత్తం మీద ప్రభుత్వ నిర్ణయం బాగానే ఉన్నా క్రింది స్థాయి సిబ్బంది కారణంగా అది మొత్తం నీరుగారిపోతోంది. టాస్క్‌ ‌ఫోర్స్ పోలీసులు తాజాగా ఒక కేసును కూడా నమోదు చేశారు. ఎర్రచందనంను అక్రమంగా రవాణా చేసే తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌‌ఫోర్స్ సిబ్బంది నిందితునిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
 
తిరుపతి కోర్టులో నిందితునికి 15 రోజుల రిమాండ్‌ను విధించారు. టాస్క్‌‌ ఫోర్స్ సిబ్బంది ఇదే దూకుడుతో వ్యవహరిస్తారో.. లేక ఎర్రచందనం స్మగ్లరలో తమ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే.