మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (15:09 IST)

టీడీపీ నేతలకు మతిచెడిందా? : జగన్ ఢిల్లీ దీక్ష ఎందుకు?

దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ప్రత్యేక హోదాపై చిత్రవిచిత్రమైన కామెంట్లు చేయడం వారికే చెల్లుతుంది. ఓ వైపు లోక్‌సభ సాక్షిగా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసినా ఈ నేతల చెవులకెక్కక పోవడం చూస్తుంటే.. ఏపీ మంత్రులు ఇంకెంత కాలం చెవిలో పూలు పెడుతూ రాజకీయ పదవులు అనుభవించాలని చూస్తున్నారో అర్థంకావడం లేదు. 
 
ప్రత్యేక హోదాపై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ లోక్‌సభలో సమాధానమిచ్చారు. గతంలో ప్రత్యేక హోదా వివిధ రాష్ట్రాలకు అమలయ్యేదని, అయితే, దానికి బదులు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా పెంచాలన్న 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనల్ని కేంద్రం యధాతథంగా ఆమోదించి అమలు చేస్తోందన్నారు. అందువల్ల, ఇప్పుడు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని తెలిపారు. ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ.. టీడీపీ మంత్రులు, ఎంపీలు మాత్రం.. తాము ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తమకు నమ్మకముందని, ఆయనను ఒప్పించి ప్రత్యేక హోదా తీసుకొస్తామంటూ కల్లిబొల్లి కబుర్లు చెపుతూ కాలం వెళ్లదీయడం వారికే చెల్లుతుంది.  
 
పైగా, ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేస్తున్న సమయంలో సభలోనే ఉన్న సీమాంధ్ర ఎంపీల్లో ఏ ఒక్కరిలోనూ ఎలాంటి స్పందనా కనిపించలేదు. కేవలం తమ సీట్లకు పరిమితమై ప్రేక్షక పాత్రలో నిమగ్నమైపోయారు. వాస్తవానికి ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు వచ్చే ‘స్టార్‌ ప్రశ్నల’ జాబితా, వాటి సమాధానాలను ఎంపీలందరికీ ముందుగానే వారి వారి నివాసాలకు లోక్‌సభ సెక్రటేరియెట్‌ పంపిస్తుంది. తద్వారా ఆయా ఎంపీలు తమకు నచ్చిన ప్రశ్నకు అనుబంధంగా ప్రశ్నలు వేసేందుకు ఆస్కారం లభిస్తుంది. 
 
ఆయా ప్రశ్నల తీవ్రతను బట్టి, సమయాన్ని బట్టి, స్పీకర్‌ విచక్షణాధికారాన్ని బట్టి ఎంతమంది సభ్యులకైనా అనుబంధ ప్రశ్న వేసే అవకాశం లభిస్తుంది. అయితే, ప్రత్యేక హోదా ప్రశ్నపై చర్చ జరుగుతుండగా టీడీపీ లోక్‌సభాపక్ష నాయకుడు తోట నరసింహం, బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి సభలోనే ఉన్నారు. అయినా, వారెవరూ దీనిపై అనుబంధ ప్రశ్నలు వేయలేదు. ప్రత్యేక హోదా కోరుతూ గతవారం పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు ధర్నా చేయగా, ఆగస్టు 10వ తేదీన జగన్‌ జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేస్తానని ప్రకటించడం గమనార్హం. సభలో ఉన్నపుడు కనీసం మాటమాత్రం కూడా స్పందించిన ఈ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ధర్నాలు, ఆందోళనలు వంటివి చేస్తామని ప్రకటించడం వారికే సిగ్గుచేటు. 
 
ఇకపోతే.. ఏపీలోని టీడీపీ మంత్రుల విషయానికొస్తే.. మీడియా ముందు వారు ఇస్తున్న ఫోజులు.. చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే... వారిని ఏమనాలో తెలియడంలేదు. వీరంతా మతివుండే మాట్లాడుతున్నారా అనే ప్రశ్నించాల్సి వస్తోంది. ఎందుకంటే.. ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం తెగేసి చెప్పిన తర్వాత కూడా తాము ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తున్నామనీ, మోడీని మెప్పించి... ఒప్పించి తెస్తామని చెప్పడం వారికే చెల్లుతుంది. 
 
ముఖ్యంగా మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథ రెడ్డి, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావులు చేస్తున్న హడావుడి, ప్రకటనలు చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియక ఏపీ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. కేంద్రం చెప్పిన మాటలు వీరి చెవులకు ఎందుకు వినిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అసత్యపు ప్రచారంతో ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారని నిలదీస్తున్నారు. పైగా బీజేపీతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రం నష్టపోతుందని, అందుకే ఆచితూచి స్పందించాల్సివస్తోందని వారు వ్యాఖ్యానించడం గమనార్హం. అదేసమయంలో విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న దొంగ దీక్షలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పడం మరింత విడ్డూరంగా ఉంది.