మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2015 (12:47 IST)

టీడీపీ నేతలకు సెక్షన్-8 ఉన్న మక్కువ ప్రత్యేక హోదాపై లేదు.. ఎందుకని?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించుకునే దిశగా అధికార టీడీపీ నేతలు ఏమాత్రం కృషి చేయడం లేదనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓటుకు నోటు అంశం తెరపైకి రావడం, అందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పాత్ర కూడా ఉందనే వార్త దేశ వ్యాప్తంగా సంచలనమైంది. దీన్ని నుంచి గట్టెక్కేందుకు టీడీపీ నేతలు వ్యూహ రచన చేసి.. హైదరాబాద్‌లో సెక్షన్ 8ను అమలు చేయాలంటూ డిమాండ్ చేయసాగారు.

ఇందుకోసం పెద్ద రాద్ధాంతమే సృష్టించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ఈ అంశాన్ని స్వయంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం, ఆ తర్వాత గవర్నర్ హస్తినకు పోయి హోంశాఖ పెద్దలకు వివరణ ఇవ్వడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే సెక్షన్ 8 అమలుపై టీడీపీ నేతలు చేసిన హంగామా అంతాఇంతా కాదు. 
 
కానీ, ఇదే టీడీపీ నేతలు ప్రత్యేక హోదాపై మాత్రం కల్లిబొల్లి కబుర్లు చెపుతూ కాలం వెళ్లదీస్తున్నారు. సెక్షన్‌ 8 డిమాండ్‌పై పెట్టిన శ్రద్ధ... స్పెషల్‌ స్టేటస్‌పై ఎందుకు చూపట్లేదనే విమర్శలు వస్తున్నాయి. పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రణాళికా మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ప్రత్యేక హోదా కష్టమని తేల్చేసినప్పటికీ.. టీడీపీ నేతల్లో ఏమాత్రం చలనం కనిపించడంలేదు. తదుపరి అడుగు ఎలా వేయాలన్న వ్యూహరచనలూ లేవు. 
 
రాష్ట్ర విభ‌జ‌న తర్వాత ఏపీకి కనీస స్థాయిలో ప‌రిశ్రమ‌లు రాలేదు. పెట్టుబడులూ అంతంతమాత్రమే. ప్రత్యేక హోదా వ‌స్తే రాయితీలు వ‌స్తాయి. పన్ను మిన‌హాయింపు ఉంటుంది. ఈ లాభ ఫలాలన్నీ నాలుగున్నర కోట్ల సీమాంధ్ర ప్రజానీకం అనుభవించే అవకాశమూ ఉంది. కానీ, ప్రత్యేక హోదాను సాధించుకునే అంశంలో టీడీపీ నేతలు తమ వంతు ప్రయత్నం లేశమాత్రం కూడా చేయడం లేదనే చెప్పొచ్చు. 
 
ఓటుకు నోటు కేసులో తమ అధినేతను రక్షించుకునేందుకు టీడీపీ నేతల కేంద్ర రాష్ట్రాల్లో వీరంగం సృష్టించారేగానీ, అదే ప్రజలకు ఉపయోగపడుతూ.. రాష్ట్రానికి ఎంతో మేలు చేకూర్చే ప్రత్యేక హోదాపై వారు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తూ.. బెదిరింపులకు దిగితే కేంద్రం తలొగ్గే పరిస్థితి లేదని తమకు తాము శాంతపరుచుకుంటూ.. తమ పదవులను కాపుడుతుంటున్నారన్నది జగమెరిగిన సత్యం. ఇదీ టీడీపీ నేతల రాజకీయం.