శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శనివారం, 30 మే 2015 (17:32 IST)

'మహానాడు'లో ఏపీ ప్రత్యేక హోదా ఊసే లేదు... ఇకలాభం లేదు, పవన్ కళ్యాణ్ రావాల్సిందే...

తెలంగాణ రాష్ట్రంలోని గండిపేటలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీ తెలుగుదేశం మహానాడును ఘనంగా మూడు రోజులపాటు జరుపుకుంది. అందులో పలు తీర్మానాలు చేశారు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన పైన బలమైన నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి తెదేపా ప్రత్యేక హోదాను అంత సీరియస్ గా తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రపంచం దృష్టిని ఆకర్షించే రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామంటున్న చంద్రబాబు నాయుడు ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు అంతంతమాత్రమనే వాదనలు కూడా వినబడుతున్నాయి.
 
 
ముఖ్యంగా రాజధాని నిర్మాణం వేలకోట్లతో కూడుకున్న పని. అలాంటిది కేంద్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం కేంద్రం వద్ద మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఐతే చంద్రబాబు నాయుడు మాత్రం సింగపూర్ ప్రభుత్వం నుంచి మాస్టర్ ప్లాన్ తెప్పించారు. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏం చేయబోతున్నదీ వివరించారు. కానీ వాటిని నిర్మించేందుకు నిధులు మాత్రం నిల్. పైగా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు గతంలో మాట్లాడుతూ... రెక్కలు నరికి ఎగరమంటున్నారంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇంకోవైపు ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలను చెల్లించేందుకు ఓవర్ డ్రాఫ్ట్ చేయాల్సిన దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు చెప్పే మాటలపై ప్రజల్లో అయోమయం నెలకొని ఉంది. అంతేకాదు... రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములకు ప్రతిగా వాటిని అభివృద్ధి చేసి రైతులకు కట్టబెడతామన్నారు. ఈ కీలకమైన అంశం కూడా సింగపూర్ అందించిన మాస్టర్ ప్లాన్ లో పేర్కొనలేదు. దీంతో భూములను ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మా భూములు తీసుకుని వాటి గురించిన ప్రస్తావన చేయకపోవడమేమిటి అని అంటున్నారు. 
 
ఇలా మొత్తమ్మీద అమరావతి రాజధాని నిర్మాణం అయోమయంగా తయారైంది. కేంద్రం నుంచి ఏపీకి ప్రత్యేక హోదాను సాధిస్తే తప్ప ఇవన్నీ సాధించలేమనీ, అందుకు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితేనే సాధ్యమవుతుందనే వాదన వినబడుతోంది. మరి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 చిత్రం కోసం గెడ్డం పెంచుకుని నటించేందుకు రెడీ అవుతున్నారు. ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు ఆయన పట్టించుకుంటారా...? వెయిట్ అండ్ సీ.