శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : శనివారం, 30 మే 2015 (07:46 IST)

బావా.. ! నువ్వు కేంద్రానికెళ్లావు... మరి ఇప్పుడైనా నాకు రాష్ట్రం...!!

తెలుగుదేశం పార్టీలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. జాతీయ శాఖ అధ్యక్షుడుగా ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపికయ్యారు. మరి తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు ఎవరు..? తెలంగాణకు ఎవరు..? ఆంధ్రప్రదేశ్ కు ఎవరు ఉండబోతున్నారు..? ఇది తెలుగుదేశం పార్టీలో నడుస్తున్న చర్చ. కుటుంబ పాలనే సాగుతుందా..! చంద్రబాబు దానికి తెరదింపుతారా.. ! మరోవైపు తాను కేవలం హిందూపురానికే ఎమ్మెల్యేని కానని రాష్ట్రస్థాయి నాయకుడనని బాలకృష్ణ కుండబద్దలు కొట్టారు. మరి దీని అర్థం ఏంటి? ఇలాంటి ఎన్నో పరిణామాలు.. ప్రశ్నలు.. అనుమానాలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి. 
 
టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి టీడీపీ నేత, ఎమ్మెల్యే బాలకృష్ణ అభినందనలు తెలిపారు. శుక్రవారం నాడు మహనాడులో టీడీపీని జాతీయ పార్టీగా చేస్తూ రాజకీయ తీర్మానం చేసిన అనంతరం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అంతకు ముందు రోజు బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్ర స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తానని, తాను రాష్ట్ర స్థాయి నాయకుడనని ఆయన ప్రకటించుకున్నారు. అంటే ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు ఎంపికయ్యారు కాబట్టి రాష్ట్రంలో పార్టీ చీఫ్ నాయకత్వం ఖాళీ అయ్యింది. ఆ బాధ్యతలను బాలకృష్ణ తీసుకుంటారా.. బాలకృష్ణ వ్యాఖ్యలకు అర్థం అదేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఇక పార్టీలో కొడుకు నారా లోకేష్ ను ప్రమోట్ చేసుకోవడానికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నాడు. అమెరికా పర్యటన, సంక్షేమ నిధి. సీనియర్లతో పొగడ్తలు ఇలా ఒకటేంటి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు కూడా పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తే తనకు ఎసరు పెట్టేవారు ఉండరని చంద్రబాబు భావించి ఉండవచ్చు. రాబోవు రోజుల్లో పార్టీని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో కూడా పార్టీశాఖలను ప్రారంభించాలనే ఆలోచన ఉంది. కాని, అక్కడ అధ్యక్షులు ఎవ్వరున్నా వచ్చిన ఇబ్బంది లేదు. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో తెలుగుదేశం పార్టీ కుటుంబ పాలనలోనే ఉండవచ్చునని భావిస్తున్నారు. తెలంగాణ బాధ్యతలను తన కుమారుడు, బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ కు అప్పగించి, ఆంధ్రాలో బాలకృష్ణకు ఇవ్వవచ్చునని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీయార్, హరికృష్ణలకు ప్రాధాన్యత కల్పిస్తే ఏనాడైనా తనకు ఇబ్బందేనని చంద్రబాబు గ్రహించారు. కాబట్టే ఇప్పటికే జూనియర్ ఎన్టీయార్ ను దూరం పెట్టారు. ఇక మిగిలింది హరికృష్ణ ఒక్కరే కాబట్టి ఏమి చేయలేడనే నమ్మకం. తెలుగు రాష్ట్రాలు మామా అల్లుళ్ళ చేతిలోకి వెళ్ళతాయా లేక కొత్త ముఖాలు తెర మీదికి వస్తాయా.. అనేది వేచి చూడాలి.