మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (13:17 IST)

మంత్రులపై టీడీపీ సర్వే...! మార్పులకు సంకేతమా...?

ఎవరిపైనైనా వేటు వేయాలనుకున్నా.. ఎవరినైనా పీఠం ఎక్కించాలనుకున్నా.. చంద్రబాబు నాయుడు చేసే కసరత్తే వేరుగా ఉంటుంది. మొదట అవతల వ్యక్తి వాదనకు ఆయన పస లేకుండా చేస్తారు. అదీ ఆయన రాజకీయ చతురత.. చివరకు కుక్కను చంపాలన్నా ఓ లాజిక్కు ఉండాలి. లేదంటే విశ్వాసవంతమైన జంతువును కొడతాడనే పేరు వస్తుంది. అందుకే పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపితే అడిగే దిక్కే ఉండదు. సరిగ్గా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలిలో అదే జరగబోతోంది. మంత్రివర్గంలో కొందరిపై వేటు ఖాయమనే మాట వినిపిస్తోంది. చంద్రబాబు ఇప్పటికే అందుకు తగిన  ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా మంత్రులపై పార్టీ జరిపిన ఓ సర్వేను ముందుకు తీసుకొస్తోంది. దాని ఆధారంగా వేటు వేసే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి. 
 
ఒక ఇంగ్లీష్ దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఇప్పుడున్న ఏ ఒక్క మంత్రికీ కూడా పాస్ మార్కులు పడలేదట. నియోజకవర్గాల వారీగా జరిపిన సర్వేలో పాల్గొన్న వాళ్లంతా ఎమ్మెల్యేల పనితీరుపై ర్యాంకులిచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..13 జిల్లాల్లో ఏ మంత్రుల పట్ల కూడా సర్వేలో  ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయలేదు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, పత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, వారి వారి సొంత జిల్లాల్లో బాగా వెనుకబడినట్లు ఫలితాలు తెలియజేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో పత్తిపాటి పుల్లారావు కంటే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, మంత్రి పదవి ఆశిస్తున్న ధూళిపాళ్ల నరేంద్రకుమార్ జిల్లా మంత్రి అయిన పత్తిపాటి కంటే, మంచి మార్కులు సాధించుకున్నారు.
 
 రాజేంద్రప్రసాద్, నరేంద్ర మొదటి రెండు స్థానాల్లో ఉండగా, వ్యవసాయశాఖ మంత్రి మాత్రం ఆరోస్థానంలో ఉండటం గమనార్హం. ఇక ముఖ్యమంత్రి  దృష్టిలో ఉన్న సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు 10వ స్థానంలో ఉన్నారట. తూర్పుగోదావరి జిల్లాలో పీతల సుజాత అక్కడున్న మొత్తం 15మంది ఎమ్మెల్యేల్లో 13వ స్థానాన్ని మాత్రమే దక్కించుకున్నారు. సుజా రోజుకో వివాదంలో చిక్కుకోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో బాలయ్య మాత్రం ముందు వరుసలో ఉండటం విశేషం. 
 
ఇప్పటికే మంత్రిమండలిలో మార్పులు చోటుచేసుకుంటాయని...శాఖల మార్పు ఉంటుందని.. వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో సర్వే వార్త చర్చనీయాంశమైంది. దసరా తరువాత జరుగబోయే మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులు చేర్పులు కనిపించే అవకాశం ఉంది. సర్వేతో మంత్రులపై చంద్రబాబుకు ఉన్న అభిప్రాయం మేరకు ఆయన మార్పులను చేపట్టే అవకాశం ఉంటుంది. మంత్రుల గుండెల్లో ఇప్పటి నుంచే రైళ్లు పరిగెడుతున్నాయి.