గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ESHWAR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (11:25 IST)

వాస్తు పండితుల చుట్టూ చక్కర్లు కొడుతున్న టీ కాంగ్రెస్ నేతలు!

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు వాస్తు పండితుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. అంతా అయిపోయాక ఇప్పుడెందుకు అన్న డౌటా? తమదీ, తమ పార్టీది ఫ్యూచర్‌ బాగుండాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇదంతా. తమ రాత మార్చే వాస్తు కోసం స్కెచ్‌లు వేస్తున్నారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాన్‌స్టాప్‌గా పదేళ్లు అధికారంలో ఉన్న ఘనత కాంగ్రెస్‌ పార్టీది. కానీ ఏం లాభం. ఎప్పుడూ ఏదో ఓ తలనొప్పి నేతల్ని వెంటాడేది. పార్టీలో నేతలందరూ సఖ్యంగా ఉన్న పరిస్థితి ఎప్పుడూ కనిపించలేదు. ఇలా నిత్యం కష్టాలు వెంటాడుతుండటానికి గాంధీభవన్‌ వాస్తు దోషమే కారణం కావొచ్చన్న అనుమానం వచ్చిందట టీ కాంగ్రెస్‌ నేతలకి. 
 
అలా డౌట్‌ వచ్చిందో లేదో... వెంటనే వాస్తు పండితులకు కబురు పంపారట. గాంధీభవన్‌లో అడుగడుగును పరిశీలించిన వాస్తు నిపుణులు మార్పులు చేయడం మంచిదని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో అలా వాస్తు బాగోలేకే పార్టీ ఓడిపోయిందేమోనన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వాస్తుపై ఎలాంటి అనుమానాలు రాలేదు. కానీ ఎప్పుడైతే పార్టీ ఓడిందో... వాస్తు ప్రభావం కావొచ్చన్న అనుమానం మొదలైంది. 
 
పార్టీ ఓడిన నాటి నుంచి పీసీసీ అధ్యక్షుడు పొన్నాలను కష్టాలు చుట్టుముట్టి కిక్‌ బాక్సింగ్‌ చేస్తున్నాయి. నలుగురితో పాటు తాను ఓడానులే అని పొన్నాల సర్దుకుపోతున్నా... పీసీసీ పీఠానికి ఎసరు పెట్టే ప్రయత్నాలు మాత్రం ఆయనకు నిద్రపట్టనివ్వడం లేదట. దీంతో గాంధీభవన్‌లో వాస్తు గురించి ఆయన ఆరా తీసినట్టు సమాచారం. పండితులను పిలిపించి చూపించడంతో వాస్తు లోపాలు బయటపడ్డాయి. అందుకే మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టారట టీ కాంగ్రెస్‌ నేతలు.
 
2004కు ముందు గాంధీభవన్‌ కుడివైపున ఓ గేటుండేది. భద్రతా కారణాలరీత్యా దాన్ని మూసేశారు. గేటును మూయడం వల్లే పార్టీ  అధ్యక్షుడికి సమస్యలు వస్తున్నాయని తేల్చారట వాస్తు పండితులు. అలాగే గాంధీభవన్‌ లోపల గదుల్లో కూడా స్వల్ప మార్పులు చేయాలని సూచించారట. బొత్స మధ్యలోనే పదవి వదిలేయాల్సి రావడానికి వాస్తు కారణాలే కావొచ్చని చర్చించుకుంటున్నారట పార్టీ నేతలు.
 
చెప్పిన వాస్తు మార్పులు చేస్తే ఇక పొన్నాలకు తిరుగే ఉండదని తేల్చారట పండితులు. శ్రావణమాసం శుభ సమయం కావడంతో ఇక రేపోమాపో పాత గేట్లు తిరిగి తెరిపించేందుకు సిద్ధమవుతున్నారట నేతలు. పొన్నాల ఇన్‌స్పిరేషన్‌తో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా సీఎల్పీ కార్యాలయం వాస్తు గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ ప్రాంగణంలో టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయాన్ని ఇప్పుడు కాంగ్రెస్‌కు కేటాయించారు. 
 
పదేళ్లకు పైనే ప్రతిపక్షంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఇదే శాసనసభాపక్ష కార్యాలయంలో ఉండేవారు. ఇప్పుడు వాళ్లు అధికారంలోకి రావడానికి ఆ కార్యాలయం వాస్తే కారణమని నమ్ముతున్నారట కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. అందుకే తమకు కేటాయించిన గదులపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎల్పీ నేత జానారెడ్డి - అక్కడ కొనసాగడానికి అంగీకరించారట. మరి వాస్తును నమ్ముకొంటున్న కాంగ్రెస్‌ నేతల దశ తిరుగుతుందా? అని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.