శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (19:15 IST)

పదేళ్ళుగా విపక్షంలో ఉన్నాం.. ఇంకా ఖర్చులు భరించలేం.. 'కారు' సీట్లో కూర్చొందాం.. టీటీడీపీ నేతలు!?

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలను అంతర్మథనంలో పడేశాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన ఒక్కగానొక్క కార్పొరేటర్ సైతం ఆపరేషన్ ఆకర్ష్‌లో కనిపించకుండా పోయారు. అలాగే, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ సైతం సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో మిగిలిన నేతలు ఆపరేషన్ ఆకర్ష్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. 
 
నిజానికి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు టీడీపీని ఓ కుదుపుకుదిపాయి. తెలంగాణలో కాస్తోకూస్తో జీవం ఉన్న ప్రాంతంగా భావిస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌ హ్యాండ్ ఇవ్వడంతో నేతలు పూర్తిగా నీరసపడిపోయారు. భవిష్యత్తు ఏంటో అర్థంకాక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు ఒక ఎత్తయితే... అంచనాకు మించి ఆ పార్టీ విజయం సాధించడంతో పాటు భారీ మెజారిటీ సాధించడంతో తెలుగు తమ్ముళ్లకు కళ్లు బైర్లుకమ్మాయి. దీంతో పార్టీ భవిష్యత్తుపై అంతర్గతంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 
 
గ్రేటర్ హైదరాబాద్‌లో ముఖ్య నేతలు కొందరు సహచరులకు ఫోన్లు చేసి... ఓ సారి కూర్చొని మాట్లాడుకుందామని ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే అనేక మంది నేతలు తమ పార్టీలో తమ రాజకీయ మనుగడపై సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. బలమైన నాయకులమైన తమ ఇలాఖాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే... తెలంగాణలో ఇక ఎలా ఉంటుంది అన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. అంతేనా... ఇప్పటికే పదేళ్లకు పైగా ప్రతిపక్షంలో ఉన్నాం... ఖర్చులు పెరిగిపోతున్నాయి... ఇంకా ఇదే పరిస్థితిని కొనసాగించలేమన్న భావనలో టీ టీడీపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అయితే, మరికొందరు నేతలు మాత్రం తమను తామే ఓదార్చుకుంటున్నారు. తాజా గ్రేటర్ ఫలితాలు తెరాసకు అనుకూల ఫలితాలే కానీ... తమ పార్టీకి వ్యతిరేక ఫలితాలు కాదని సమర్థించుకున్నారు. తామే కాదు... ప్రతిపక్ష పార్టీలు ఏవీ తెరాస కారు స్పీడు ముందు నిలబడలేకపోయాయని గుర్తు చేస్తున్నారు. తమ కంటే కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని గుర్తుచేస్తున్నారు. ఆ పార్టీ చాలా వేగంగా కుప్పకూలిపోతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఓపికతో ఉండటం మినహా తమ ముందు మరోమార్గం లేదని అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద గ్రేటర్ ఎన్నికల ఫలితాలు టీ టీడీపీ నేతల్లో అంతర్మథనానికి తెరతీశాయని చెప్పొచ్చు.