గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2015 (07:56 IST)

సార్.. అంతా మీరే... టీడీపీలో ఉత్కంఠ.. ఎవరెవరికి ఏ ఏ స్థానం..?

ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగుదేశం పార్టీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన తరువాత తొలిసారిగా రాష్ట్రాల వారిగా అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను, కమిటీలను చంద్రబాబు నేడు ప్రకటించనున్నారు. ఉదయం 9.15నిమిషాలకు ఈ కమిటీలను చంద్రబాబు ప్రకటిస్తారని తెలుస్తోంది. కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు కొత్త బాధ్యతలోకి మారనున్నారు. ఏపీ తెదేపాకు కళా వెంకట్రావు అధ్యక్షుడు కానున్నారు. తెలంగాణకు ఎల్‌.రమణ అధ్యక్షుడిగా, రేవంత్‌రెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపిక అవుతారని పలువురు భావిస్తున్నారు. మిగిలిన స్థానాలలో ఎవరుంటారు... పార్టీలో అంతర్గతం ఇదే ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. 
 
కేంద్ర కమిటీకి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉంటారు. అలాగే కొంతమంది ఉపాధ్యక్షులు ఉంటారు. ఐదుగురు అధికార ప్రతినిధులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 16మంది పొలిట్‌బ్యూరో సభ్యులు, ఒక కోశాధికారి, క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌, కార్యాలయ కార్యదర్శి, ఇతర కమిటీలు ఉంటాయి. అయితే ఇందులో చాలా పేర్లు ఖరారు అయ్యాయి. చివరి నిమిషంలో కూడా మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. కమిటీల నియామకానికి పెద్ద కసరత్తే జరిగింది. కేంద్ర అధికార ప్రతినిధులుగా పయ్యావుల కేశవ్‌, బోండా ఉమామహేశ్వర్‌రావు, పెద్దిరెడ్డి, జూపూడి ప్రభాకర్‌ తదితరులు ఉంటారని తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శుల స్థానంలో నారా లోకేష్‌‌కు చోటు దాదాపు ఖరారయ్యిందట. 
 
ఆయనతో పాటు ఎంపీ కొనకళ్ల నారాయణ, రేవూరి ప్రకాష్‌రెడ్డిలు ఉండవచ్చు. పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఏపీ నుంచి తొమ్మిది మంది, తెలంగాణ నుంచి ఏడుగురు ఉంటారని తెలిసింది. ఏపీ నుంచి అశోక్‌గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, నందమూరి హరికృష్ణ, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు, ప్రతిభాభారతి తదితరులు ఉంటారని చెప్తున్నారు. 
 
తెలంగాణ కమిటీని పూర్తిగా విడదీశారు. అక్కడ నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఉమామాధవరెడ్డి, రాథోడ్‌ రమేష్‌, దేవేందర్‌గౌడ్‌, నామా నాగేశ్వర్‌రావులు ఉంటారు. పార్లమెంటరీ కమిటీ కూడా ఉంటుంది. రాష్ట్ర కమిటీల్లో 65 నుంచి 80 మంది వరకు ఉండే అవకాశాలున్నాయి. వాటిలో రకరకాల హోదాలు ఉంటాయి. కార్యదర్శులు, ఉపాధ్యక్షులు ఇలా ఎన్నో కేడర్‌లు ఉన్నాయి. వాటన్నింటికి పోటీ పడే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. దీంతో చివరి నిమిషంలో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఎవరు పీఠమెక్కుతారో వేచి చూడాల్సిందే..