గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2015 (12:26 IST)

తిరుపతా... తొక్క.. ! వరల్డ్ క్లాస్ లేదు.. ఏదో క్లాస్‌లో తోసేయండి..!

అధికారం మారిందంటే చాలు బండ్లు ఓడలు అవుతాయి. ఓడలు బండ్లవుతాయి. దేశంలో ఎవరు రైల్వే మంత్రిగా ఉన్నా సరే తిరుపతిని ప్రపంచస్థాయి స్టేషన్ చేస్తున్నట్లు ఊదరగొట్టేశారు. కొంత మంది నాయకులు అరచేతిలో వైకుంఠం చూపించారు. అయితే భారతీయ జనతాపార్టీ మాత్రం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసింది. తిరుపతి ఏంటి గొప్ప వేంకటేశ్వర స్వామికి గొప్ప కావచ్చునేమోకానీ, మాకు కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దాదాపు వరల్డ్ క్లాస్ స్టేషన్‌గా ప్రకటించి నిలిపేశారు. మోడ్రన్ స్టేషన్‌గా చేసి చేతులు దులుపుకునే పనిలో పడ్డారు. 
 
తిరుపతి రైల్వేస్టేషన్‌ను వరల్డ్ క్లాస్‌గా అభివృద్ధి చేయాలని రైల్వేకి చెందిన కమిటీలు భావించాయి. ఎంపీ చింతా మోహన్ లాంటి వారైతే తిరుపతి వాసులకు అరచేతిలో వైకుంఠం చూపించేశారు. ఎక్కడా ఎటువంటి కళ్ళ ముందే మల్టీ ప్లక్సులు కట్టేశారు. పూర్తి ఏసీ కోచ్‌లతో తిరుపతికి రైళ్ళను రప్పించేశారు. లల్లూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఒకటేమిటి కొన్ని వందల సార్లు తిరుపతిని వరల్డ్ క్లాస్ రైల్వే  స్టేషన్‌గా ప్రకటించారు. ‌అయితే అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. తిరుపతికి సౌకర్యాల మాటే లేదు. 
 
తిరుపతి నుంచి కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తూనే తిరుపతి స్టేషన్‌ను చిన్న చూపు చూస్తున్నారు. రోజూ దాదాపుగా 30 వేలం మంది ప్రయాణీకులు తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళి వస్తుంటారు. తిరుపతి ఈ ప్రాంతంలో అత్యంత ఆదాయం ఉన్న స్టేషన్‌గా చెప్పవచ్చు. అయితే ఎక్కడా ప్రభుత్వ చెప్పిన ప్రకారం వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ లక్షణాలు ఇసుమంత కూడా కనిపించడం లేదు. సరికదా.. కనీసం మోడ్రన్ క్లాస్ పనులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. పాత గోడలకు రంగులు పూయడం మినహా మరేపని చేయలేదు. రెండు లిఫ్టులు ముఖాన కొట్టే వీటితో సర్దుకోండి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. 
 
వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్ చేసేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వెస్ట్ రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. ఇటు టీటీడీ సత్రాల స్థలాన్ని కలుపుకుంటే ఇక్కడే ప్రపంచస్థాయి స్టేషన్ నిర్మించవచ్చు. మూడేళ్ల క్రితం తిరుపతి రైల్వే స్టేషన్ కు చుట్టుపక్కల 20 కి.మీల వరకు ఉన్న అన్ని స్టేషన్లలో స్థలాలను పరిశీలించాయి. 
 
తిరుపతికి అతి దగ్గరలోని వెస్ట్ రైల్వేస్టేషన్ లో అందుబాటులో ఉన్న 52 ఎకరాల రైల్వే స్థలంతో పాటు ఎస్వీయూ, మహిళా యూనివర్సిటీలకు చెంది న మరో 40 ఎకరాల స్థలాలను రైల్వేకి అప్పగిస్తే తాము పనుల ప్రారంభానికి సిద్ధమని అప్పటి రైల్వే బోర్డు అధికారులు ప్రకటించారు. అయితే అప్పటి ప్రభుత్వాలు మారిపోయాయి. వచ్చిన ప్రభుత్వం ఆ ప్రతిపాదనను చెవికి కూడా ఎక్కించుకోవడం లేదు. ఎక్కడ వేసిన వరల్డ్ క్లాస్ స్టేషన్ అక్కడే కూడా ఉండకుండా మరింత వెనక్కి వెళ్ళుతోంది.