బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : గురువారం, 30 జూన్ 2016 (11:31 IST)

తితిదే కాటేజీల్లో దుప్పట్లు కంపు.. కంపు.. వాసన రాకుండా నాఫ్తలిన్ గోలీల రసం పిచికారి!

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి భక్తులు బసచేసే అద్దె గదుల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పజెబుతోంది. కాటేజీల నిర్వహణ కోసం ఏటా కోట్ల రూపాయలు కుమ్మరిస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి భక్తులు బసచేసే అద్దె గదుల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పజెబుతోంది. కాటేజీల నిర్వహణ కోసం ఏటా కోట్ల రూపాయలు కుమ్మరిస్తోంది. అయితే కాంట్రాక్టు దక్కించుకున్న ఆ కంపెనీలు ఎలా పని చేస్తున్నాయో మాత్రం పట్టించుకోవడం లేదు. అద్దె గదుల్లో వినియోగించే దుప్పట్లు, దిండు కవర్లు శుభ్రం చేసే తీరు చూస్తేనే నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమైపోతుంది. తిరుమలలో ఎక్కువ భాగం గదుల నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకున్న ఆల్‌ సర్వీసెస్‌ సంస్థ దుప్పట్లు, దిండు కవర్లు శుభ్రం చేసే విధానం తీసికట్టుగా ఉంటోంది. సర్ఫ్ కూడా వేయని నీళ్ళలో నానబెట్టి, అలిచి ఆరవేయడమే వాషింగ్‌గా నమ్మిస్తోంది. సంవత్సరాల తరబడి సాగుతున్న ఈ కంపు వ్యవహారాన్ని పట్టించుకున్న వారు లేరు.
 
తిరుపతిలోని 2వ సత్రం (రైల్వేస్టేషన్‌ వెనుకవైపు ఉన్న సత్రాలు) వెనుక ఆల్‌ సర్వీసెస్‌ సంస్థకు చెందిన లాండ్రీ (దుస్తులు ఉతికే స్థలం) ఉంది. ఆ సంస్థ నిర్వహించే కాటేజీల్లో వినియోగించే దుప్పట్లు, దిండుకవర్లు ఇక్కడే శుభ్రం చేస్తుంటారు. వందల సంఖ్యలో ఉన్న గదుల నుంచి రోజూ ఐదు వేల దాకా దుప్పట్లు, దిండు కవర్లు వస్తుంటాయి. ఇంత పెద్ద సంఖ్యలోని దుస్తులను ఉతికి శుభ్రం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు లేవు. 
 
ఉతకడానికి నీళ్ళు, పిండటానికి బట్టల్లోని తడి తీసేయడానికి అవసరమైన యంత్రాలు ఉన్నా అవి పని చేయడం లేదు. ఒక వాషింగ్‌ మిషన్‌ ఒక డ్రైయ్యర్‌ మాత్రమే పని చేస్తున్నాయి. వీటిలో గంటకు 300-350 దుస్తులు మించి ఉతికే అవకాశం లేదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా నిర్విరామంగా పని చేసినా ఐదు వేల దుస్తులు శుభ్రం చేయడం అసాధ్యం. అందుకే మిషన్లతో పనిలేకుండా దుస్తులన్నీ కుప్పగా పోసి,నీళ్ళ చల్లి అక్కడ పనిచేసే కూలీలలో కాళ్ళతో తొక్కిస్తారు. 
 
ఆపై నీళ్ళలో జాడించి డ్రైయ్యర్లలో వేస్తారు. ఆ తర్వాత ఎండలో ఆరేసి మడిచేస్తారు. దుస్తులపై మరకలు అలాగే ఉంటాయి. గబ్బుకొడుతూనే ఉంటాయి. అయితే వాసన రాకుండా ఉండడం కోసం నాఫ్తలిన్‌ గోలీలను (రసగుండ్లు) పొడిచేసి నీళ్ళలో కలిపి చల్లుతారు. వానాకాలంలో అయితే అసలు ఉతికేదే ఉండదు. విదిలించి నాఫ్తలిన్‌ నీళ్ళు చల్లి మడిచేస్తారట. కనీసం ఐరిన్‌ కూడా ఉండదు. అసలు ఐరిన్‌ మిషనే పనిచేయడం లేదు. ఇక్కడి దుస్తులు యంత్రాలతో ఉతకడం లేదని చెప్పడానికి పెద్ద పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఈ లాండ్రీ యంత్రాలన్నీ తితిదేవే. ఆల్‌ సర్వీసెస్‌ సంస్థ వినియోగించుకుంటోంది. తితిదేకి విద్యుత్‌ బిల్లు చెల్లిస్తోంది. అక్కడున్న యంత్రాలన్నీ రోజూ పనిచేస్తే ఎంత విద్యుత్‌ ఖర్చవుతుంది. దానికి కరెంట్‌ బిల్లు రావాలి. ఇప్పడు ఎంత విద్యుత్‌ ఖర్చయింది. ఎంత బిల్లు చెల్లించారనే విశ్లేషణ చేస్తే సరిపోతుంది.
 
దుస్తులు ఉతకాలంటే కనీసం సర్ఫ్ పౌడర్‌, సోపు, బ్లీచింగ్‌ అవసరమవుతాయి. ఇవేవీ లేకుండానే వేలాది దుస్తులు ఉతికేస్తున్నారు ఇక్కడ. 5 వేల దుస్తులైనా కిలో సర్ఫ్ తో సరిపెట్టేస్తారట. ఇచ్చే అరాకొర స్టాకు అయిపోతే నెలల తరబడి స్టాకు రాదట. అప్పుడు నీళ్లలో అలిచి ఆరేస్తారట. సరిగ్గా ఉతక్కపోవడం వల్ల దుప్పట్లు, దిండు కవర్లు త్వరగా పాడైపోతున్నాయి. తితిదే పువ్వుల్లాంటి దుప్పట్లు కొనుగోలు చేసినా కొన్ని రోజులకే నల్లగా మారిపోతున్నాయి. విఐపి కాటేజీల్లోని దుప్పట్లు మాత్రం ప్రత్యేక శ్రద్థతో ఉతికి జాగ్రత్తపడుతున్నారు. ఏమైనా దుప్పట్లు, దిండు కవర్లు శుభ్రంగా లేకుండా గదిని అద్దంలా ఉంచినా ఉపయోగం లేదు. భక్తుల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికైనా తితిదే ఉన్నతాధికారులు స్పందించి దీనిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.