గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Modified: శనివారం, 2 జులై 2016 (13:34 IST)

తిరుమలలో శ్రీవారి ఏనుగు ఆశీర్వదిస్తే "అరకోటి"... ఏనుగు తోక వెంట్రుకల్లో కూడా...

భగవంతుడు సర్వాంతర్యామి అని చెబుతారు. ఎందెందు వెతికినా అందందు కనిపిస్తాడన్నది భక్తుల అంచంచల విశ్వాసం. ఈ స్తంభంలో మీ దేవుడిని చూపగలవా అని హిరణ్యకశిపుడు ఎగతాళిగా భక్త ప్రహ్లాదుడిని అడిగితే ఆ స్థంభం నుంచే నృసింహస్వామి ప్రత్యక్షమయ్యాడట. దేవుడినే మాయం చేసే

భగవంతుడు సర్వాంతర్యామి అని చెబుతారు. ఎందెందు వెతికినా అందందు కనిపిస్తాడన్నది భక్తుల అంచంచల విశ్వాసం. ఈ స్తంభంలో మీ దేవుడిని చూపగలవా అని హిరణ్యకశిపుడు ఎగతాళిగా భక్త ప్రహ్లాదుడిని అడిగితే ఆ స్థంభం నుంచే నృసింహస్వామి ప్రత్యక్షమయ్యాడట. దేవుడినే మాయం చేసేస్తున్న ఈ కలియుగంలో ఎందెందు వెతికినా అందందు భగవంతుడు ప్రత్యక్ష్యం కాకపోవచ్చు గానీ అవినీతి మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్షమవుతుంది.


చెట్టులో, పుట్టలో, కొండలో, కోనలో ఎక్కడైనా అవినీతి రక్కసిని పట్టి చూపించడం పెద్ద సమస్య కాదు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే దేవుడికి ప్రతిరూపంగా చెప్పుకునే శ్రీవారి ఏనుగులనూ అక్రమార్జనకు సాధనంగా వాడుకుంటున్నారు. ఏనుగుతో ఆశీర్వాదం ఇప్పించి డబ్బులు సంపాందించడంతో పాటు ఆ ఏనుగు తోక వెంట్రుకలూ పీకి అమ్మేస్తున్నారట. గత వారం విజిలెన్స్ దాడులు కూడా జరిగిన తిరుమల గోశాలలో ఇంతకీ ఏం జరుగుతోంది..?
 
తిరుమల గోశాలలో రెండు ఏనుగులున్నాయి. శ్రీవారి సేవల సమయంలో మర్యాద కోసం ఏనుగులను తీసుకొచ్చి నిలబెడతారు. పీఠాధిపతులు దర్శనానికి వచ్చినపుడు ఏనుగులతో స్వాగతం పలుకుతారు. శ్రీవారి ఊరేగింపుల్లో ఏనుగులు, గుర్రాలు వాహనాల ముందు నడుస్తుంటాయి. ఇది ఎప్పటి నుండో వస్తున్న సంప్రదాయం. ఇందుకోసం కేటాయించిన ఏనుగులతో కొందరు లక్షలు సంపాదిస్తున్నారు. సాధారణంగా శ్రీవారి సేవల సమయంలో ఒక ఏనుగును ఆలయం వద్దకు తీసుకురావాలి. సేవ ముగియగానే తీసుకెళ్ళి గోశాలలో విడిచిపెట్టాలి. అయితే ఏనుగును గంటల తరబడి ఆలయ సమపీంలో నిలబెట్టి డబ్బులు దండుకుంటున్నారు. 
 
ఏనుగుకు చేతికి డబ్బులు అందిస్తే అది దాన్ని మావటి చేతికి అందించి డబ్బులు ఇచ్చిన వారి నెత్తిన తొండం పెట్టి ఆశీర్వదిస్తుంది. వేలమంది భక్తులు వచ్చే తిరుమలలో వందలమంది ఏనుగు ఆశీర్వాదం తీసుకుంటారు. ఎవరూ రూ.5 కంటే తక్కువ ఇవ్వరు. ఇలా ఆశీర్వాదాలతో ఉదయం 8 వేలు, సాయంత్రం 8 వేల రూపాయలు దాకా వసూలు చేస్తున్నట్లు అంచనా. తెల్లవారి ఓ ఏనుగును గోశాల నుంచి నడిపించుకుంటూ ఆలయం వద్దకు వచ్చి తిరిగి తీసుకెళ్ళిపోవాలి. 
 
అయితే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల దాకా వరాహస్వామి ఆలయం వద్దే నిలబెట్టి ఆశీర్వాదంతో డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే సాయంత్రం స్వామివారి దీపాలంకరణ సేవలకు అరగంట ముందు అంటే 4.30 గంటలకు రెండు ఏనుగులను తీసుకొచ్చి సేవ ముగిశాక తీసుకెళ్ళిపోవాలి. అయితే గంట ముందుగానే అంటే 3.30 గంటలకే తీసుకొస్తారు. సేవ ముగిసిన తరువాత మరో రెండు గంటలు అక్కడే ఉంచుతారు. ఈ రెండు పూటలా భక్తుల నుంచి 15వేల రూపాయలుపైగా వసూలవుతున్నట్లు ఆలయ ఉద్యోగులే చెబుతున్నారు. ఈ విధంగా నెలు 4.50లక్షలు వసూలవుతాయని అంచనా. అంటే ఏడాదికి అరకోటికిపైగా దండుకుటున్నట్లు లెక్క ఏనుగు ద్వారా వసూలు చేసే చిల్లర్లను స్థానికంగా ఉండే హోటళ్ళలో ఇచ్చి నోట్లు మార్చుకుంటున్నారట. 
 
ఏనుగు ద్వారా వసూలవుతున్న అరకోటి డబ్బుల్లో చాలా మందికే వాటా ఉన్నట్లు సమాచారం. ఏనుగులను ఎన్ని గంటలు అక్కడ ఉంచినా అడగకుండా ఉన్న విజిలెన్స్ సిబ్బంది నుంచి సి.సి.కెమెరాల దృష్టి ఏనుగుపైన పడకుండా సహకరించే కంట్రోల్‌ రూం సిబ్బంది దాకా వాటాలున్నాయని తెలుస్తోంది. ఏనుగు అక్రమ వసూళ్ళపై భక్తుల నుంచి డెయిరీ ఫారం డైరెక్టర్‌కు ఫిర్యాదు అందడంతో ఇటీవలే సంబంధిత వ్యక్తులకు రెండుసార్లు మెమోలు కూడా ఇచ్చారు. అయినా వారిలో మార్పు రాలేదు. 
 
వస్తే కొండ...పోతే వెంట్రుక అనేది సామెత. వెంట్రుకను తేలిగ్గా తీసేస్తారు గానీ..వాళ్ళకు మాత్రం వెంట్రుకలే కొండలతో సమానం. శ్రీవారి భక్తుల తలనీలాలు కోట్లు ఆర్జించి పెడుతుంటే కొందరికి గజరాజుల వెంట్రుకలు వేలు సంపాందించి పెడుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే తిరుమల శ్రీవారి గోశాలలోని ఏనుగుల వెంట్రుకలనూ పీకేసి అమ్మేస్తున్నారు. ఏనుగు తోక వెంట్రుకను ఉంగరంలో అమర్చి ధరిస్తే మేలు జరుగుతుందన్న విశ్వాసం సర్వత్రా ఉంది. ఇటీవల కొందరు ప్రవచనకారులు కూడా ఇలాంటివి ప్రబోధిస్తున్నారు. దీంతో ఏనుగు వెంట్రుకలకు డిమాండ్‌ ఏర్పడింది. తిరుమలకు వచ్చే భక్తులు. 
 
గోశాలకు వెళ్ళి ఏనుగు వెంట్రుకలు కావాలని అడుగుతున్నారు. వెంట్రుకే కదా అని ఉచితంగా ఇచ్చేది లేదు. ఒక్కో వెంట్రుక కనీసం వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారట. అందుకే పాపం తిరుమలలోని ఏనుగుల తోకలు ఎప్పుడూ బోడిగా కనిపిస్తాయట. వెంట్రుకలు పెరగడం, పీకి అమ్మేయడం పరిపాటిగా మారిపోయిందట. ఉండేది కేవలం రెండు ఏనుగులు. ఎన్ని వెంట్రుకలు ఉంటాయి చెప్పండి. పైగా పెరగడానికి చాలా రోజులు పడుతుంది. అందుకే ఇటీవల కాలంలో నకిలీ వెంట్రుకలను తీసుకొచ్చి అనే ఏనుగులను వెంట్రుకలని చెప్పి భక్తులకు అంటగట్టేస్తున్నారట. ఏం చేద్దాం. ఏనుగు వెంట్రుకలు మార్కెట్‌లో దొరికే వస్తువు కాకపోయే. అవసరమనుకున్నప్పుడు వెయ్యి అయినా కొనాల్సిందే. 
 
ఏనుగు ద్వారా జరుగుతున్న అవినీతిని అరికట్టాలంటే అక్కడ వసూలయ్యే డబ్బులను శ్రీవారి హుండీకి చేర్చాలి. గజరాజు కష్టార్జీతాన్ని శ్రీవారికే చెందాలని చెప్పి, రోజూ వసూలయ్యే డబ్బులను హుండీలో వేయించాలని పలువురు సూచిస్తున్నారు.